- మంత్రుల కమిటీ వెల్లడి
- నిత్యావసరాల ధరల నియంత్రణపై చర్చ
- సబ్సిడీ ధరలపై బియ్యం, కందిపప్పు, పంచదార, పామాయిల్ విక్రయాలకు ఆదేశం
- సమావేశంలో పాల్గొన్న మంత్రులు నాదెండ్ల, పయ్యావుల, అచ్చెన్నాయుడు
అమరావతి (చైతన్యరథం): నిత్యావసరాల ధరల స్థిరీకరణ కోసం రూ.500 కోట్లతో నిధి ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు మంత్రుల కమిటీ వెల్లడిరచింది. అమరావతిలోని సచివాలయంలో నిత్యావసర ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీ సమావేశమైంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. బియ్యం, కందిపప్పు, టమాట, ఉల్లి ధరల నియంత్రణపై చర్చించారు. టమాట, ఉల్లి నిల్వ చేసుకునే పద్ధతులపై మంత్రుల కమిటీ అధ్యయనం చేయనుంది. ప్రస్తుత మార్కెట్లో ధరల పరిస్థితిని మంత్రులు, అధికారులు సమీక్షించారు. ప్రత్యేక కౌంటర్లలో అమ్మకాల ద్వారా బియ్యం ధరల స్థిరీకరణ జరిగిందని, దీంతోపాటు కందిపప్పు ధరలు కూడా తగ్గినట్లు తెలిపారు.
కేంద్రం దిగుమతి సుంకం పెంపుతో వంటనూనె ధరలు పెరిగాయని, అందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రభుత్వం రూ.110లకు లీటర్ పామాయిల్ విక్రయిస్తోందన్నారు. దిగుమతిదారులు, హోల్ సేల్ నిర్వాహకులు, రిటైల్ దారులతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, రాయితీ ధరలపై క్యూఆర్ కోడ్ ద్వారా వంటనూనె అమ్మకాలు జరపనున్నట్లు మంత్రులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బియ్యం, కందిపప్పు, పంచదారను సబ్సిడీ ధరలకు సరఫరా చేయనున్నట్లు వివరించారు. కందిపప్పు కేజీ రూ.67, పంచదార అర కేజీ రూ.16, పామాయిల్ లీటర్ రూ.110కి రైతు బజార్లతో పాటు రాష్ట్రంలోని 2200 రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా సబ్సిడీ ధరలకు విక్రయించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. కూటమి ప్రభుత్వ చర్యలతో గత నెలలో ఉల్లి, టమాట ధరలు తగ్గాయని వెల్లడిరచారు. 154 మండల కేంద్రాల్లో సీపీ యాప్ ద్వారా ప్రభుత్వం ప్రతీరోజూ ధరలపై విశ్లేషణ చేస్తుందన్నారు. సంస్కరణల్లో భాగంగా మార్కెట్ సెస్ 2 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.