.ఆయన సీఎం మాత్రమే అయినందున బతికిపోయాం
.నోట్లను ఏ ప్రాతిపదికన ప్రింట్ చేస్తారో కూడా తెలియని సీఎం
.అదేమంటే టెన్త్ ఫస్ట్, ఇంటర్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్ అంటారు
(చైతన్యరథం స్పెషల్ డెస్క్)
ఒక దేశంలో కరెన్సీ నోట్లను ఏ ప్రాతిపదికన ముద్రిస్తారో కూడా తెలియని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో మనం ఉన్నాం. ఆయనకే గనుక నోట్లను ముద్రించే అధికారం ఉంటే దేశాన్ని మరో జింబాబ్వే చేసేవారేమో. ఇటీవల ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని వేలేరుపాడు మండలం కన్నాయిగట్టు, చింతూరు మండలం కుయుగూరు, చట్టిలో పర్యటించిన సందర్భంగా నోట్లు ముద్రించే విషయమై ఆయన మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ముంపు బాధితులకు పరిహారం, పునరావాసం అందించాలంటే రూ.20 వేల కోట్లు అవసరం. వెయ్యి లేదా రూ.2వేల కోట్ల వరకు ఇచ్చేందుకైతే నేను సిద్ధం. కేంద్రమే డబ్బులను ప్రింటు కొట్టేది.. వాళ్ల దగ్గర డబ్బుల్లేకపోతే ఎవడి దగ్గర ఉంటాయి? ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించేందుకు కృషిచేస్తాం. ఆ మొత్తాన్ని ఇస్తే ప్రధానమంత్రి చేతే బటన్ నొక్కించి మీ ఖాతాల్లో పడేలా చేస్తా’’ అని హామీ ఇచ్చారు. అవసరమైనన్ని కోట్ల రూపాయలు కేంద్రం ముద్రించేస్తుందని ఆయన అనుకుంటున్నారు. ముద్రించడమే కాకుండా అడిగిన వాళ్లకు అడిగినట్లు ఇచ్చేస్తుందని, మనం అడిగితే ఓ రూ.20వేలు కోట్లు అదనంగా ప్రింట్ చేసి ఇస్తుందని అనుకుంటు న్నట్లున్నారు. ఆ అధికారమేదో ఆయన చేతిలో ఉంటే ఇష్టమొచ్చినట్లు కరెన్సీ నోట్లను ఇబ్బడి ముబ్బడిగా ఎడాపెడా ముద్రించేసి కుటుంబానికి ఓ కోటి రూపాయలు వెళ్లే విధంగా బటన్ నొక్కేసేవారేమో. ఎటూ బటన్ నొక్కడం ఆయనకు అలవాటే. దాంతో దేశం దివాళా తీసేది. ఆయన ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయినందుకు మనం సంతోషించాలి. అదేమంటే ‘‘నేను టెన్త్ క్లాస్‌లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్‌లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్’’ అని చెబుతారు. అలా చెప్పడమేగాక తాను హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్‌లో చదివానని ఆ స్కూల్ పరువుతీశారు. జాతీయ ఉత్పత్తికి అనుగుణంగా కరెన్సీ నోట్లను ముద్రిస్తారు. ఇష్టమొచ్చినట్లుముద్రిస్తే దాని విలువ తగ్గిపోతుంది. ధరలు పెరుగుతాయి. ప్రజలు జీవించడం కష్టమైపోతుంది. ఒక్కోసారి చట్టవ్యతిరేకంగా ముద్రించిన దొంగనోట్ల వల్ల కృత్రిమంగా ధరలు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా ద్రవ్యోల్బణానికి దారి తీసే ప్రమాదం ఉంది. మన చేతిలో పనేగదా అని కేంద్రం నోట్లను ముద్రిస్తే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. దేశం సంక్షోభంలో చిక్కుకుంటుంది. దాంతో దేశం ప్రపంచంలోనే అత్యంత వెనుకబడినదేశంగా మారిపోతుంది.
గతంలో కొన్ని ఆఫ్రికా దేశాలు మన జగన్ రెడ్డిలానే ఆలోచన చేసి కరెన్సీని ఇష్టం వచ్చినట్లు ముద్రించాయి. దాంతో ఆ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఇంకా కొన్ని దేశాలు ఆ ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా బయటపడలేదు. అందుకు జింబాబ్వే పెద్ద ఉదాహరణ. ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడుప్రజల వద్ద డబ్బు లేదని ఆ దేశం నోట్లను పెద్ద ఎత్తున ముద్రించింది. దాంతో కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. పేదల జీవనం దుర్భరమైపోయింది. బస్తాలతో డబ్బు తీసుకువెళ్లి, సంచులలో సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిరది. ఇవి హాస్యానికి చెప్పే మాటలు కాదు. వాస్తవం. ఎక్కడైనానోట్లను అధికంగా ముద్రిస్తే ఎదురయ్యే పరిస్థితులు ఇలానే ఉంటాయి. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో ఆ దేశం ఇప్పటికీ నలిగిపోతోంది. జింబాబ్వేలో ద్రవ్యోల్బణం జూన్ నెలకు 191.6 శాతానికి చేరింది. ఈ విషయాలు మన జగన్ రెడ్డికి తెలియకపోవడం విచారకరం. సాధారణంగా స్థూల జాతీయ ఉత్పత్తి(జీడీపీ)లో 2 నుంచి 3 శాతం డబ్బును మాత్రమే సెంట్రల్ బ్యాంకు ముద్రిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం1934లోని సెక్షన్ 22 ప్రకారం భారతదేశంలో నోట్లను ముద్రించే హక్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్.బి.ఐ.)కు మాత్రమే ఉంది. ఐర్బీఐ వాణిజ్య బ్యాంకు కాదు. ఇది దేశ ద్రవ్యవ్యవస్థకు శిఖరాగ్రాన నిలిచే సంస్థ. భారతదేశం జీడీపీ రూ.148 లక్షల కోట్లైతే, అందులో రెండు శాతం అంటే రూ.3 లక్షల కోట్ల నోట్లు మన దేశంలో ముద్రిస్తారు. అయితే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగిన మనదేశంలో రెండు శాతానికి మించి కొద్దిగా ఎక్కువ శాతంలోనే కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. అయితే ఆన్ లైన్ చెల్లింపులు జరిగే దేశాల్లో తక్కువ కరెన్సీని ముద్రిస్తారు. మన దేశంలో కూడా ఆన్ లైన్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నారు. తద్వారా కరెన్సీని తక్కువగా ముద్రించి అందుకు అయ్యే ఖర్చును తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కరెన్సీ నోట్లను ముద్రించడం వెనుక ఇంత తతంగం ఉంది. అధికారం ఉందికదా అని నోట్లను ముద్రిస్తే ఏమౌతుందో సీఎం జగన్‌రెడ్డి తెలుసుకోవడం మంచిది. ఇక ముందైనా నోరు జారకుండా ఉంటారు.