- ప్రపంచ నీటి దినోత్సం, ఎర్త్ అవర్ ఒకేరోజు రావటం సంతోషం
- అన్ని జీవరాసులకు ఏకైక ఇల్లు భూమి
- అందరం కలిసి కాపాడుకుందాం
- చిన్న ప్రయత్నాలతోనే పెనుమార్పులు
- అందరూ కలిస్తేనే బంగారు భవిష్యత్
- ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పిలుపు
అమరావతి (చైతన్యరథం): అన్ని జీవరాశులకు భూమే ఏకైక ఇల్లని, దాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్బోధించారు. భూమిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ చేయగలిగినంత సహాయం చేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవం, అలాగే ఎర్త్ అవర్ రెండూ ఒకే రోజు రావడం సంతోషంగా ఉందన్నారు. శనివారం ఎర్త్ అవర్ సందర్భంగా ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. ఏటా ఎర్త్ అవర్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని 60 నిమిషాల పాటు ఏకం చేస్తోందన్నారు. రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకూ విద్యుత్ వాడకం ఆపేసి ఎర్త్ అవర్ పాటించటం ఆనవాయితీగా వస్తోంది. ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు సహా తదితర చోట్ల లైట్లు, విద్యుత్ ఉపకరణాలు ఆఫ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సంఫీుభావం తెలపటం సంతోషకరం.
మానవ జీవితంలో నీరు, విద్యుత్ శక్తి ఎంతో ముఖ్యమైన మూల స్తంభాలు. నీరు, విద్యుత్ శక్తి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. వీటి ప్రాముఖ్యతను గుర్తించడం వల్లే నీరు, ఇంధన భద్రత అంశాలను స్వర్ణాంధ్ర-2047 మార్గదర్శక సూత్రాల్లో పొందుపరిచాం. వీటిని పొదుపుగా వాడుకోవడం ప్రకాశవంతమైన స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోంది. కానీ సమష్టి కృషి ఎంతో అవసరం. ప్రభుత్వంతో కలిసి ప్రతి ఒక్కరూ తమ వంతుగా పని చేసినప్పుడు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. చిన్న ప్రయత్నాలు రేపటి పెద్దపెద్ద మార్పులకు దారితీస్తాయని అందరూ గుర్తించాలి. అంతా కలిసి పని చేస్తే ప్రభావవంతమైన మార్పు తీసుకురాగలుగుతాం. ప్రతిఒక్కరూ మార్పు కోసం కృషి చేయాలి. అందుకు నా ప్రోత్సాహం ఉంటుంది. ప్రతి ఒక్కరూ నీరు, విద్యుత్ పొదుపు విషయంలో అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.