- ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో కూల్చడమే పనిగా పెట్టుకున్నాడు
- అభివృద్ధి చేయడం చేతగాక పన్నులతో జనాన్ని బాదేస్తారా?
- బాదుడే బాదుడులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
నూతక్కి (మంగళగిరి) : సైకోపోయి సైకిల్ వస్తేనే రాష్ట్రప్రజలకు పన్నుల బాదుడు నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని నూతక్కి గ్రామంలో గురువారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్.. గ్రామంలో సమస్యలను పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరం వున్నా తాను ఆదుకుంటానని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. సైకో మాదిరిగా మారిన ముఖ్యమంత్రి పాలనలో పెంచిన ధరలు, చార్జీలు, పన్నులు గురించి ప్రజలకు వివరించారు. గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో పేదలకు ఒక్క ఇల్లూ కట్టలేని చిన్న సైకో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి. వేలాది పేదల ఇళ్లు కూల్చేసి రాక్షసానందం పొందుతున్నాడని అన్నారు. నియోజకవర్గ ప్రగతి కోసం వేల కోట్లు కేటాయించామంటోన్న ప్రభుత్వం, ఎమ్మెల్యే..అవి ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనుల కోసం ఒక్క రూపాయి నిధులు సాధించలేని ఎమ్మెల్యే..పన్నుల పేరుతో ప్రజల్ని బాదాలని అధికారులకు టార్గెట్లు విధించడం దారుణమన్నారు. చివరికి ఖాళీ స్థలాలనీ వదలకుండా పన్నులు వసూలు చేయాలని అధికారికంగా ఆదేశించడం ఎమ్మెల్యే శాడిజానికి నిదర్శనమన్నారు. పేదలకు ఒక్క ఇల్లూ కట్టి ఇవ్వలేని చిన్న సైకో నూతక్కి గ్రామంలో ఇళ్లు తొలగించేందుకు ప్రయత్నాలు చెయ్యడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా వుండి పోరాడుతుందని లోకేష్ హామీ ఇచ్చారు.