- ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష
అమరావతి (చైతన్య రథం): తుపాను కారణంగా రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమవ్వాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు మరికొద్ది రోజులు కొనసాగే పరిస్థితులు ఉన్నాయన్న నేపథ్యంలో.. ప్రజల ఆరోగ్యంపట్ల అన్ని స్థాయిల అధికార్లూ అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. అమెరికాలో ఉన్న మంత్రి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, ఇతర అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. క్షేత్రస్థాయి వైద్యాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు తగు సూచనలు, సాయంఅందేలా చూడాలని ఆదేశించారు. భారీగా వర్షాలు కురుస్తున్నందున గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా సంబంధిత శాఖలతో ఆరోగ్య శాఖాధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. గుంటూరు, రంగరాయ, సిద్దార్ధ ప్రభుత్వ వైద్య కళాశాలల పూర్వ విద్యార్థుల ద్వైవార్షిక సమావేశంలో కీలకోపాన్యాసం చేయడానికి నిర్వాహకుల ఆహ్వానంపై మంత్రి అమెరికాలోని ఆర్లెండో చేరుకున్నారు. సెప్టెంబర్ 1న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల పూర్వ విద్యార్థులు, ఇతరులతో నిర్వహిస్తోన్న కార్యక్రమంలో రాష్ట్రంలోని వైద్య ఆరోగ్యరంగంలో కొత్తగా రానున్న పెట్టుబడుల అవకాశాల్ని మంత్రి వివరించనున్నారు.