అమరావతి (చైతన్యరథం): ఏఐ, మెడ్‌టెక్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వైద్య చికిత్సలను ప్రజలకు మరింత చేరువ చేసే విషయమై ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో లోతైన చర్చ జరిపినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిరచారు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ఏఐ మెడ్‌టెక్ అలయన్స్ (ఏఐఎం) ఫౌండేషన్ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. దీనిపై ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. టెక్నాలజీలో వచ్చిన కొత్త మార్పులు, ఆవిష్కరణల సమర్థ వినియోగంతో ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సంరక్షణ విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చే అంశంపై తాము విస్తృతంగా చర్చించామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వైద్యసేవలను మరింత మెరుగుపర్చేందుకు ఏపీ ప్రభుత్వం, ఏఐఎం ఫౌండేషన్ కలిసి పనిచేసే విషయం కూడా చర్చకు వచ్చిందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏఐజీ ఆస్పత్రుల డైరెక్టర్, ఏఐఎం ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాకేష్ కూడా మంచి సలహాలు ఇచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు.