- ప్రాణాలు తీస్తున్న కలుషిత తాగునీరు
- గుంటూరులో పరిస్థితి తీవ్రం
- డయేరియాతో నలుగురు మృతి
- ఆసుపత్రుల్లో వందలాదిమంది, భయపెడుతున్న కలరా
- పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
- హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
- జగన్ రెడ్డికి అచ్చెన్నాయుడు లేఖ
అమరావతి(చైతన్యరథం): జగన్ రెడ్డి అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో ప్రజారోగ్యం గాల్లో దీపంలా మారిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. కలుషిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య లేమి కారణంగా రాష్ట్రంలో వ్యాధులు ప్రబలుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. యుద్ధప్రాతిపదికన సురక్షిత తాగునీరు అందించాలన్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న గుంటూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ముఖ్యమంత్రి జగన్రెడ్డికి శనివారం రాసిన బహిరంగ లేఖలో అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత తాగునీరు అందకపోవటంతో కలుషిత జలంతో డయేరియా, కలరా వ్యాధులు ప్రబలి ప్రజలు ఆస్పత్రులపాలవుతున్నారు. గ్రామ పంచాయితీ నిధులు దారి మళ్లించడం, పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తాగునీటి పథకాలను సక్రమంగా నిర్వహించకపోవడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను అర్ధాంతరంగా నిలిపేయడం వంటి చర్యలతో ప్రజల ఆరోగ్య పరిస్థితి గాల్లో దీపంలా మారింది. ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటు కాదా? లక్షలాది మంది ఆస్పత్రులపాలవుతున్నా ఏమీ పట్టనట్టు అధికార యంత్రాంగం వ్యవహరించడం మీ ప్రభుత్వ పాలనా వైఫల్యం కాదా? మీ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సురక్షిత నీరు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం మీకు తెలుసా? ఇంతటి భయానక పరిస్థితులపై ఒక్కసారైనా మీరు స్పందించారా? కలుషిత నీటి సరఫరాతో గుంటూరులో డయేరియా బారిన పడ్ నలుగురు మృతిచెందారు. వందలమంది ఆస్పత్రుల పాలయ్యారు. అవే కలుషిత జలాల కారణంగా కలరా మహమ్మారి గుంటూరును వణికిస్తోంది. ముగ్గురికి కలరా సోకింది. ఇంతటి ప్రమాదక పరిస్థితులు తలెత్తితే చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖ మంత్రి విడదల రజనీ అసలు విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
ప్రచారార్భాటంతో ప్రాణాలు నిలబడవు…
గుంటూరు నగరంలో పలుచోట్ల తాగునీటి పైపులైన్లు మురుగునీటి కాల్వల్లోంచి వెళుతున్నాయి. ఈ క్రమంలో పైపు లైన్లు పగిలిపోయి లీకేజీ కారణంగా తాగునీరు కలుషితమవుతోంది. దీనిపై అధికారులకు కనీసం చీమకుట్టినట్టు కూడా లేదు. టీడీపీ హయాంలో నెలకోసారి వాటర్ ట్యాంక్లు శుభ్రం చేసేవారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం మేర పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పూర్తి చేసివుంటే నేడు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి వచ్చేది కాదు. ఆరోగ్యాంధ్రప్రదేశ్, ఆరోగ్య విప్లవం, ప్రజారోగ్యమే మా ధ్యేయమంటూ ప్రచారార్భాటం చేయడం వల్ల ప్రజల ప్రాణాలు నిలబడతాయా? మీరు అధికారంలో ఉండే. ఈ నెల రోజుల్లోనైనా సక్రమంగా పనిచేయండి. రాజకీయ లబ్ధి కోసం విపక్షాలపై విమర్శలు చేయడం మానేసి ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి పెట్టండి. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించండి. శు ద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేయండి. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.