- విక్రయించిన 24 గంటల్లోనే నగదు జమ
- రైతు కుటుంబాల్లో పండుగ వాతావరణం
- పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి(చైతన్యరథం): ధాన్యం అమ్మిన 24 గంటల నుంచి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వంలో ఎప్పుడెప్పుడా నగదు జమ అయ్యేదని ఎదురుచూపులు చూసి ఇబ్బందులు పడ్డారన్నారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే నగదు అకౌంట్లో జమ అవుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇది కూటమి ప్రభుత్వం..మంచి ప్రభుత్వం అనేందుకు ఇదే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం 617 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 24,051 మంది రైతుల నుంచి 1,81,988 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు రూ.418.75 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇందులో రూ.391.50 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. 24 గంటల్లోపు రూ.281.30 కోట్లు, 24 గంటల నుంచి 48 గంటల్లో రూ.10.20 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ధాన్యాన్ని ఎప్పుడు ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకునేలా వాట్సాప్ చాట్ బోర్డ్‌ను ప్రవేశపెట్టినట్లు వివరించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారా ప్రత్యేక వాయిస్ సేవలందిస్తున్నట్లు చెప్పారు. గోతాల సరఫ రా నుంచి రవాణా వరకు అన్ని విధానాలను సులభతరం చేసినట్లు వివరించారు.