నూరి ఫర్వీన్ : మీకు ఆడపడుచులు లేరు. మీరు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మహిళలకు ఏవిధంగా అండగా నిలుస్తారు?
లోకేష్ : నేను చిన్నప్పటి నుండి చెల్లి కావాలని అమ్మని అడిగేవాడిని. బ్రాహ్మణి గర్భవతిగా ఉన్నప్పుడు ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నాను. నా తల్లి భువనేశ్వరి నన్ను చిన్ననాటి నుండి క్రమశిక్షణతో పెంచింది. ఇప్పటికీ నేను ఏదైనా తప్పు మాట్లాడితే అమ్మ ఊరుకోదు. సమాజంలో తల్లులు తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని నేను కోరుకుంటాను. అంగన్వాడీకి పిల్లలను పంపుతున్న నాటి నుండి తల్లులు బిడ్డలకు క్రమశిక్షణ, మహిళలను గౌరవించాలనే బుద్ధిని నేర్పాలి. అంగన్ వాడీకి పంపే దగ్గరనుంచి మహిళలను ఎలా గౌరవించాలో నేర్పించాలి. మహిళలను గౌరవించాలన్నది మనసునుంచి రావాలి.
ప్రశ్న : పాదయాత్ర చేస్తున్న ఈ సమయంలో ఫ్యామిలీని మిస్ అయినట్లు అన్పించడం లేదా?
లోకేష్ : నేను నా కొడుకు దేవాన్ష్ ను బాగా మిస్ అవుతున్నా. వాడితో నేను బాగా ఆడుకుంటాను. కానీ రాష్ట్రంలో మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మహిళలు తమ సమస్యలు చెప్పుకునే వేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే నేను యువగళం పాదయాత్రను చేపట్టాను. యువతలో చైతన్యం తీసుకురావాల్సి ఉంది. రాష్ట్రంలో యువత బాగా వెనుకబడిపోయారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరో పాత బీహార్ ను తలపిస్తోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టి, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే పాదయాత్ర చేస్తున్నా.
సుబ్బాయమ్మ : అసెంబ్లీలో రోజా మహిళల గురించి ఏదేదో మాట్లాడుతుంది. కానీ రాష్ట్రంలో మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే ఎవరూ మాట్లాడడం లేదు. ఆత్మ రక్షణ కోసం గన్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకునే పరిస్థితులు మాకు లేవు. మీరు అధికారంలోకి వస్తే మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు?
లోకేష్ : కేంద్రం నివేదికల ప్రకారం ఏపీలో ప్రతిగంటకు మహిళలపై 2 దాడులు, మానభంగాలు వంటివి జరుగుతున్నాయి. ఏపీలో చట్టాలు ఏం చేస్తున్నాయో అర్థం కావడం లేదు. వైసిపి ఎమ్మెల్యేలు, మహిళామంత్రులు మహిళలను అవమానించే పరిస్థితి. మంత్రి రోజా నాకు చీర, గాజులు పంపుతాను వేసుకోమని చెప్పింది. ఆమె దృష్టిలో చీర, గాజులు వేసుకునే వారు చేతకాని వాళ్లు. తెలుగు మహిళ నాయకులు రోజాకు చీర,సారె ఇవ్వడానికి వెళితే పోలీసులు చితకబాదారు. మహిళల పట్ల జగన్ ప్రభుత్వానికి ఉన్న గౌరవం ఇది. సీఎం నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మను దారుణంగా రేప్ చేసి చంపేస్తే సీఎం పట్టించుకోలేదు. పరామర్శకు వెళ్లిన టీడీపీ ఎస్సీ నాయకులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం నమోదు చేశారు. మహిళలకు అన్నింటిలో సమాన హక్కు, మాట్లాడే హక్కు ఉంటుందని గుర్తుచేయడమే నా లక్ష్యం. చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించడం మా లక్ష్యం. చట్టాలు అందరికీ సమానంగా వర్తింపజేయడం బాబుగారి నైజం. వైసీపీ పాలనలో చట్టాలు కొందరికి చుట్టాలయ్యాయి.