` చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
` 8 మంది మృతి, 30 మందికి గాయాలు
` ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
` క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
` మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
అమరావతి,బంగారుపాళ్యం(చైతన్యరథం): చిత్తూరు జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు అదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బంగారుపాళ్యం మండలం మొగలి ఘాట్ రోడ్డులో బస్సు, లారీ ఢీ కొన్న ఘటనలో ఎనిమిది మంది ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళుతున్న ఆర్టీసీ బస్సును పలమనేరు వైపు నుంచి ఐరన్ లోడుతో వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చేసుకుంది.
ఘాట్ రోడ్డులో మితిమీరిన వేగంతో వస్తున్న లారీ అదుపు తప్పి పక్క రోడ్డులో ఎదురుగా వస్తున్న బస్సు పైకి దూసుకెళ్లింది. ఘటనలో ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు ఎనిమిది మంది మృత్యవాత పడ్డారు. మరో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పలమనేరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు… రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి 5 లక్షలు ఎక్స్ గ్రేషియాను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు…
మెరుగైన వైద్యం అందించాలి: సీఎం చంద్రబాబు
చిత్తూరు జిల్లా మొగలి ఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం….సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అని తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ దిగ్బ్రాంతి
మొగలి ఘాట్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ప్రమాద వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలన్నారు.
తీవ్రంగా కలచివేసింది: మంత్రి లోకేష్
చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రవాణాశాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.
మృతుల కుటుంబాలకు మంత్రి ఆచ్చెన్న సంతాపం
చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.