అమరావతి (చైతన్య రథం): రంజాన్ పవిత్ర మాసంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం పనివేళల ముగింపుకంటే ఒక గంట సమయం ముందుగానే బయటకు వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ తెలిపారు. అమరావతిలో ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తూ గంట సమయం ముందస్తు అనుమతి విషయాన్ని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయాలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే ముస్లిం ఉద్యోగులందరికీ గంట సమయం ముందుగానే బయటకు వెళ్లేందుకు అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు. రంజాన్ పవిత్ర మాసంలో మార్చి 2నుంచి 30వరకు ఇస్లాం మతాన్ని ఆచరించే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వారి కార్యాలయాలు/ పాఠశాలలను ఒక గంట సమయం ముందుగానే వీడడానికి అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి వెల్లడిరచారు. ఈమేరకు సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతులకు, జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా మార్గదర్శకాలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. రంజాన్ మాసంలో ఒక గంట ముందుగా ప్రభుత్వ శాఖల్లో పని చేసే ముస్లిం ఉద్యోగులు మతపరమైన ఆచారాలు నిర్వహించుకోవడానికి బయటకు వెళ్లేందుకు అనుమతించే నిర్ణయంపట్ల సీఎం చంద్రబాబుకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు.