- పనుల వేగవంతానికి కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు
- రైలు, రోడ్డు కనెక్టివిటీ మరియు భూసేకరణపై అధికారులకు దిశానిర్దేశం.
- పాల్గొన్న మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్.
అమరావతి (చైతన్య రథం): రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణ పనులను వేగవంతం చేయడం, మౌలిక సదుపాయాల మెరుగుదలే లక్ష్యంగా సచివాలయంలోని బ్లాక్`2లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం మంత్రివర్గ ఉప సంఘం రెండవ భేటీ నిర్వహించింది. భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ పాల్గొని పోర్టు పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. రామాయపట్నం పోర్టు తొలి దశ నిర్మాణ పనులను పూర్తి చేయడానికి కాల పరిమితి పొడిగింపు ప్రతిపాదనకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. పోర్టునుంచి సరుకు రవాణా వేగవంతం చేసేందుకు బాహ్య రోడ్లు మరియు రైల్వే కనెక్టివిటీపై మంత్రుల బృందం ప్రత్యేకంగా చర్చించింది. ముఖ్యంగా ఉత్తర దిశలో రోడ్డు నిర్మాణం మరియు రైల్వే డబుల్ లైన్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ, బడ్జెట్ ప్రతిపాదనలను తదుపరి సమావేశం నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రామాయపట్నం పోర్టు అందుబాటులోకి వస్తే దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని, దీనివల్ల స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు సీఈఓ అభిషేక్కుమార్, చీఫ్ ఇంజనీర్ జీవి రాఘవరావు, రామాయపట్నం పోర్ట్ ఉన్నతాధికారులు, నవయుగ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. తదుపరి సమావేశంలో రోడ్డు, రైల్వే లైన్లకు సంబంధించిన నూతన ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.















