- సవాళ్లపై జయభేరి మోగించిన వీరుడు
- వ్యాపార రంగంలోనూ ప్రజాహితం చూసిన ఏకైక వ్యక్తి
- విలువలతో పత్రికను నడిపిన అక్షర యోధుడు
- వేధింపులకు రాజీపడని మీడియా శిఖరం
- ఒకే ఎన్టీఆర్, ఒకే రామోజీ ఉంటారు.. ఎవరూ అధిగమించలేరు
- తెలుగుజాతి వెలుగు, స్ఫూర్తి రామోజీకి భారతరత్న ఇవ్వాలి
- అమరావతిలో ఒక రహదారికి, విశాఖలో చిత్రనగరికి రామోజీ పేరు పెడతాం
- రాజధానిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం
- రామోజీరావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళి
కానూరు/అమరావతి(చైతన్యరథం): వ్యాపార రంగంలోనూ ప్రజాహితాన్ని చూసిన ఏకైక వ్యక్తి రామోజీరావు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. సమాజం కోసం ఆలోచించి వ్యాపార, సినీ, సేవా, పత్రికారంగాల్లో రామోజీరావు తనకుతానే సాటిగా నిలిచారన్నారు. విలువలతో పత్రికను నడిపిన అక్షర యోధుడు రామోజీరావు అన్నారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభకు తన సతీమణి భువనేశ్వరితో కలిసి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రామోజీరావు ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…ఈ సమాజానికి ఎంతో మేలు చేసిన రామోజీరావుకు ఏ విధంగా కృతజ్ఞత చెప్పగలుగుతామనడానికి ఘనంగా నివాళులర్పించడమే మార్గం అన్నారు. ఆయనలోని స్ఫూర్తిని అందిపుచ్చుకుని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సాధారణ కుటుంబంలో పుట్టి స్వయంకృషితో అసామాన్యమైన వ్యక్తిగా ఏ విధంగా ఎదుగుతారనడానికి రామోజీ ఒక ఉదాహరణ. ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటారు…ఒకే ఒక రామోజీరావు ఉంటారు. ఆ ఇద్దరినీ జీవితంలో ఎవరూ అధిగమించలేరు. రామోజీ అసాధారణ శక్తి. ఆయన వ్యక్తి కాదు..ఒక వ్యవస్థ. రామోజీరావు వ్యవస్థలను నిర్మించారు. ఆయన ఏ రంగాన్ని తీసుకున్నా నెంబర్-1గా నిలబెట్టారు. ఏం చేపట్టినా ఉన్నతస్థాయిలో ఆలోచించారు. పద్ధతి ప్రకారం నిజాయితీగా పని చేశారు. ప్రజాస్వామ్యం కోసం యోధునిలా పోరాటం చేశారు. మీడియా రంగంలో చేసిన కృషికి అనేక అవార్డులు వచ్చాయి. కేంద్రం కూడా పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. రామోజీ సమాజానికి చేసిన సేవకు ఆ పురస్కారాలు లభించాయని సీఎం చంద్రబాబు అన్నారు.
విశ్వసనీయతకు మారుపేరు రామోజీ
1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ స్థాపించారు. అంతకముందు…తర్వాత అనేక చిట్‌ఫండ్ సంస్థలు వచ్చాయి…కానీ మార్గదర్శి నేటికీ మార్గదర్శిగానే ఉంది. గత ప్రభుత్వాలు మార్గదర్శిపై ఎన్ని కుట్రలు చేసినా ఆ సంస్థపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టలేకపోయారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మార్గదర్శిలో పెట్టుబడి పెట్టిన వారు ఆయనతో ఉన్నారంటే అది రామోజీ పట్ల ఉన్న విశ్వాసం, విశ్వసనీయత. 1969లో అన్నదాత పత్రిక తెచ్చి రైతులకు ఎనలేని సేవలు అందించారు. 1974 ఆగస్టు 10న ఈనాడు దినపత్రికను విశాఖలో స్థాపించారు. 5 దశాబ్దాలుగా ఈనాడు పత్రిక ప్రజాచైతన్యం కోసం పని చేస్తోంది. 22 జిల్లా ఎడిషన్లు ప్రవేశపెట్టి వినూత్నమైన ఆలోచనతో ప్రజాసమస్యలను వెలుగులోకి తెచ్చారు. పాలకుల వైఫల్యాలను ఎండగట్టారు. రాజకీయాల్లో ఉన్న మేము ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తాం…అధికారంలో ఉంటే సమస్యలు పరిష్కారిస్తాం. కానీ రామోజీ పత్రికా రంగంలో ఉండి ప్రజాసమస్యలుపై నిరంతరం పోరాడారు. 40 ఏళ్లుగా ఈనాడు నెంబర్-1గా ఉందంటే దాని వెనక రామోజీ కార్యదక్షత, కృషి ఉన్నాయి. కొన్ని వందల మంది జర్నలిస్టులును, నటీనటులను, గాయకులను, కళాకారులను తయారు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఒకేసారి 7 ఛానెల్స్ పెట్టి జయప్రదం చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
సేవాభావంతో ముందుకెళ్లారు
హైదరాబాద్ వెళ్లిన ఎవరైనా రామోజీ ఫిల్మ్ సిటీ చూడకుండా తిరిగొచ్చే పరిస్థితి లేదంటే అందులో ఆయన పడ్డ కష్టం ఉంది. విపత్తులు వచ్చినప్పుడు సేవాభావంతో రామోజీ ముందుకెళ్లారు. తుఫాన్లు వస్తే మన తెలుగురాష్ట్రాలైనా, ఇతర రాష్ట్రాలైనా సేవలందించారు. పెదపారుపూడి, తెలంగాణలోని నాగన్ పల్లి గ్రామాలను దత్తత తీసుకుని రూ.25 కోట్లతో అభివృద్ధి చేశారు. కోవిడ్ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లు ఖర్చు చేసి ప్రజలకు సేవలందించారు. 40 ఏళ్లుగా నేను రామోజీని దగ్గరుండి చూశాను…ఆయనలో భయం లేదు. పోరాటం ఆయన జీవితంలో భాగం. ఏ విషయంలోనైనా రాజీలేకుండా పోరాటం చేశారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ నెంబర్-1గా ఎలా ఉంటారో…తెలుగువారికి సేవలందించిన వ్యక్తిగా రామోజీని కూడా తెలుగు జాతి శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు.
విలువల కోసం రామోజీ బతికారు
ఈ రోజుల్లో రేటింగ్ ల కోసం ఛానళ్లు, పత్రికలు పెట్టి.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వద్దకెళ్లి పనులు చేసుకుంటున్నారు. నాకు ఒక పని చెయ్యి, చెప్పిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వు, మంత్రి పదవి ఇవ్వు అని ఏనాడూ అడగలేదంటే అదీ రామోజీ నీతి, నిజాయితీ. ప్రజాస్వామ్యం అపహాస్యం అయినప్పుడు తన వంతుగా వచ్చి పోరాడారు. చాలా మంది పదవులుంటేనే సేవ చేస్తామనుకుంటారు..కానీ రామోజీ తనకు కావాల్సింది పదవులు కాదు ప్రజా చైతన్యంతో ప్రజలకు మేలైన సేవలందిస్తానని నిరూపించారు. 1982 వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదు…ప్రత్నామ్నాయం కోసం ఆలోచించి పార్టీ పెట్టిన 9 నెలల్లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారంటే అందులో రామోజీరావుది కూడా ప్రముఖ పాత్ర ఉంది. తరువాత ఎన్టీఆర్ ప్రభుత్వానికి ఆగస్టు సంక్షోభం వస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాజీలేని పోరాటం చేశారు. ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంటుంది. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా రంగం ప్రజాస్వామ్యానికి పిల్లర్ లాగా ఉంటుంది. ఈనాడు పత్రికలో వార్తకు ఒకసారి ఉల్లంఘన కింద నోటీసులు ఇస్తే సుప్రీంకోర్టులో కూడా పోరాడి నిలబడ్డారని సీఎం చంద్రబాబు చెప్పారు.
రామోజీ సూచనతోనే రాజధానికి అమరావతి పేరు
మార్గదర్శిపైనా అనేక కేసులు పెట్టారు…ఆయన్ను రకరకాలుగా హింసించారు. నేను ప్రజల కోసం పోరాడుతున్నా…సంపాదించిన ఆస్తులన్నీ పోయినా ఫర్వాలేదని రాజీపడకుండా పోరాడారు. 86 ఏళ్ల వయుసులో మంచం పై ఉన్నా ప్రజలకు న్యాయం జరగాలని కోరుకున్నారు. నేను ఆయన్ను చూసి నేర్చుకున్న మేరకు…వినూత్నంగా సైబరాబాద్ నిర్మించి అభివృద్ధి చేశాను. హైదరాబాద్ అభివృద్ధిలో రామోజీ స్ఫూర్తి, ఆలోచనలు ఉన్నాయి. విభజన అనంతరం ఏపీ రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుదని నేను ఆలోచిస్తే ఎంతో పరిశోధన చేసి అమరావతి పేరు పెట్టాలని నాకు సూచించారు. దాంతో ప్రపంచమంతా అమరావతి అని మారుమోగింది. నూటికి నూరు శాతం ప్రజలు ఆమోదించిన నగరం అమరావతి.
గత 5 ఏళ్లు అమరావతి ఇబ్బంది పడినా…మళ్లీ అమరావతి దశ, దిశ మారుతుంది…తెలుగుజాతి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుంది. రామోజీ ఎవరినీ ఆయన వద్దకు పిలవరు…తన వద్దకు ఎవరైనా రావాలని కోరుకోరు. వస్తే గౌరవంగా మాట్లాడి…ఉన్నది ఉన్నట్లు చెప్తారు. కొన్ని పత్రికలు ఉన్నాయి…వేరే పార్టీలకు సంబంధించిన వార్తలు ప్రచురించవు…కానీ రామోజీరావు మాత్రం ప్రతి పార్టీకి, నాయకుడి సంఖ్యాబలాన్ని బట్టి ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన అభిప్రాయాలను ఎడిటోరియల్ పేజీలో మాత్రమే రాశారు. నా పాలనపైనా ఎన్నో వార్తలు రాశారు. కానీ ఆయన ఒకే మాట అన్నారు…నేను పత్రికా రంగంలో ఉన్నాను…నన్ను ఎన్నిసార్లు కలిసినా నా స్వేఛ్చకు భంగం కలగకూడదు..మిమ్మల్ని నేను ఏమీ అడగను…నన్ను మీరు ఏమీ అడగొద్దు అని చెప్పి విలువల కోసం బతికారు. పని చేస్తూనే చనిపోవాలని కోరుకున్నారు. నిరంతరం పని చేయాలన్నది ఆయన ఆలోచన. ఈ ఆలోచన కొంత మంది మాత్రమే చేయగలుగుతారు. చనిపోయినప్పుడు కూడా ఎక్కడ అంత్యక్రియలు చేయాలో ముందుగానే నిర్ణయించుకున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగు భాషన్నా…తెలుగు జాతన్నా ఎనలేని ఆప్యాయత
తెలుగు భాష అంటే రామోజీకి ఎనలేని అభిమానం…తెలుగుజాతి అంటే ఎనలేని ఆప్యాయత. తెలుగు జాతి, మనదేశం ఎప్పుడూ బాగుండాలని, విలువలతో కూడిన సమాజం ఉండాలని రామోజీ కోరుకున్నారు. తెలుగు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా…రామోజీ వారసత్వం కొనసాగించాలి. కిరణ్, వారి కుటుంబ సభ్యులను కూడా కోరుతున్నా…రామోజీ, ఆయన స్థాపించిన వ్యవస్థ 10 కోట్ల మంది ప్రజల ఆస్తి. రామోజీ స్థాపించిన వ్యవస్థలను భావితరాలకు అందించాలి. తెలుగుజాతిలో ఆయన స్ఫూర్తి ఉండాలి. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని మనమంతా ఎప్పటి నుండో అడుగుతున్నాం…రామోజీరావుకు కూడా భారతరత్న అడగడం మనందరి బాధ్యత. ఎన్టీఆర్, రామోజీరావు ఇద్దరూ ఇద్దరే అని సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం
అమరావతి…రాజధానికి ఆ పేరు పెట్టాలని నాకు సలహా ఇచ్చారు. అందుకే ఆయన గుర్తుండేలా అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం. రాజధానిలో ఏదైనా ఒక రహదారికి రామోజీరావు మార్గం అని పేరు పెడతాం. విశాఖలో ఆయన జీవితాన్ని ప్రారంభించి, పేపరు స్థాపించినందున అక్కడి చిత్రనగరికి రామోజీ చిత్రనగరిగా పేరు పెడతాం. ఎంతోమంది పుడతారు..చనిపోతారు..కొంతమంది మాత్రమే చరిత్రలో నిలుస్తారు. రామోజీరావు లాంటి వారే చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారు. ఆయన సంస్మరణ సభ నిర్వహించడం నా అదృష్టం. రామోజీరావుకు తగిన గుర్తింపు ఇస్తాం. రామోజీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్కరణ సభకు పలువురు పాత్రికేయ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, రామోజీరావు కుటుంబ సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు ఎన్.రామ్, గులాబ్ కొఠారి, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు హాజరై పుష్పాంజలి ఘటించారు. పత్రికా రంగంతోపాటు వివిధ రంగాల్లో రామోజీరావు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఆయన సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. వేదిక వద్ద రామోజీరావు జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా ప్రముఖులు వీక్షించారు.