- ప్రజాహితమే ధ్యేయంగా బతికారు
- రాజధానిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలి
- సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పవన్
కానూరు: విలువల కోసం బతికి, వాటికోసం రాజీలేని పోరాటం చేసిన యోధుడు రామోజీరావు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు, పద్మవిభూషణ్ రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన పవన్ మాట్లాడుతూ రామోజీరావు గురించి అందరూ చెప్పిన దాని కంటే, తన అనుభవంలో రామోజీరావు గురించి ఎంతో తెలుసుకున్నానని వెల్లడిరచారు. రామోజీరావు సినీ రంగంలో ఉన్నప్పటికీ ఆయనతో తనకు పరిచయం లేదని తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలినాళ్లలో 2008లో మొదటిసారిగా రామోజీరావును కలిశానని వెల్లడిరచారు. రామోజీరావు మాట్లాడే విధానం చాలా నిక్కచ్చిగా ఉండేది. ఆయన ప్రజల పక్షపాతి అని అర్థమైంది. ఆయన మాట్లాడుతున్నంత సేపూ నా మదిలో ఒకటే ఆలోచన… పాత్రికేయ విలువలను కాపాడడానికే ఆయన ఉన్నారనేది స్పష్టంగా అర్థమైంది. ఆయన నాతో మాట్లాడినంత సేపూ ప్రజా సంక్షేమం కోణంలోనే చర్చ జరిగింది. 2019లో ఒకసారి లంచ్‌కు ఆహ్వానించారు. ఆ సందర్భంగా దేశ పరిస్థితులు, పత్రికా స్వేచ్ఛ గురించి, తాను ఎప్పుడూ రాజీ పడకపోవడం గురించి చెప్పారు. ఆయనతో మాట్లాడుతుంటే, పత్రికా స్వేచ్ఛ అనేది ఈ దేశానికి ఎంత అవసరమో అర్థమైంది.అంతేకాదు… పరిచయస్థులు కానీ, సన్నిహితులు కానీ, ఇంకెవరి పట్ల అయినా గానీ… ప్రజా ప్రయోజనాల కోణం నుంచి చూస్తే ఆయన వైఖరి చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుందని పవన్ అన్నారు.
నమ్మిన విలువలు పాటిస్తూ..
ఆయనను ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనకందరికీ తెలుసు. దినపత్రిక నడపడం ఎంతో కష్టమైన పని. తాను నమ్మిన విలువలు పాటిస్తూ పత్రిక నడిపే వ్యక్తి ఇతర వ్యాపారాలు చేస్తుంటే, ఆయనపై దాడులు చేయడం సులువు. కానీ అలాంటి దాడులను కూడా ఎదుర్కొని ముందుకు సాగిన వ్యక్తి రామోజీరావు. ఆయనను కలిసిన సమయంలో ఒక్కటే చెప్పారు… నువ్వు పైకొస్తున్న రాజకీయ నాయకుడివి. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను… జీవితంలో ఎప్పుడూ రాజీపడొద్దు… నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించు అని చెప్పారు. ఆయన మాటలు ఇప్పటికీ నేను మర్చిపోలేదని పవన్ చెప్పారు.
మా విజయవార్త విన్నాకనే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆయన సంస్మరణ కార్యక్రమంలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఓ దశలో ఆయన కుటుంబ సభ్యులను కూడా పాలకులు ఇబ్బందిపెట్టారు… ఎంతయినా నలిగిపోతాను కానీ ఓ జర్నలిస్టుగా రాజీపడను అని పోరాడిన వ్యక్తి రామోజీరావు. అలా పోరాడాలంటే ఎంతో సాహసం ఉండాలి. ఇటీవల ఎన్నికల ఫలితాలు వచ్చే ముందే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. కానీ, మా కూటమి విజయ వార్త ఆయన వినాలి అని గట్టిగా కోరుకున్నాను. శైలజా కిరణ్‌ని కూడా అడిగాను… ఆయనకు సరిగ్గా వినిపించడం లేదంటున్నారు కదా… మా విజయ వార్త విన్నారా అని అడిగి తెలుసుకున్నాను. దశాబ్దకాలం పాటు నలిగిపోయిన వ్యక్తి ఆ విజయ వార్త వినకపోతే ఆయన ఆత్మ క్షోభిస్తుందేమో అనిపించింది. కానీ విజయ వార్త వినే ఆయన కన్నుమూశారు. ఆ విషయం నాకు తృప్తినిచ్చింది. రాజధాని అమరావతిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలి. అటువంటి మహానుభావుడికి నా నివాళులు అర్పిస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.