- హాజరు కానున్న సీఎం చంద్రబాబు, పలువురు ప్రముఖులు
- ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి
అమరావతి: రామోజీ గ్రూపు సంస్థల చైౖర్మన్ రామోజీరావు సంస్మరణ సభ విజయవాడ శివారు కానూరులో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ సభను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. దాదాపు 7 వేల మంది ఆహ్వానితులు పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని వివరించారు. చలనచిత్ర, మీడియా, వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులు, రచయితలు సహా దేశంలోని నలుమూలల నుంచి వివిధ రంగాల నిష్ణాతులు పాల్గొంటారని తెలిపారు. సభ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రుల కమిటీలోని కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు వెలగపూడి సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. శాఖల వారీగా చేపడుతున్న ఏర్పాట్లను తెలుసుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని చర్యలు. తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్ జి.సంపత్‌కుమార్ సభ ఏర్పాట్లను మంత్రులకు వివరించారు. ప్రధాన వేదిక, దాని ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లను, హాజరుకానున్న ప్రముఖులకు వసతి, రవాణా, ఇతర ఏర్పాట్లను. వివరించారు. రామోజీరావు జీవిత చరిత్రకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌తోపాటు ఆడియో, వీడియో ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిరచారు.
సభ ఏర్పాట్లపై సమీక్ష
రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. ఈ నెల 27వ తేదీన పెనమలూరు మండలం తాడిగడప- ఎనికేపాడు 100 అడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్ లో నిర్వహించనున్న రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభ కార్యక్రమ ఏర్పాట్లపై శ్రీచైతన్య మహిళా జూనియర్ కళాశాల మీటింగ్ హాల్లో బుధవారం ఏఎస్‌ఎల్ (అడ్వాన్స్ సెక్యూరిటీ లైజనింగ్) సమావేశం నిర్వహించి సభ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్యమంత్రి ఈనెల 27వ తేదీ సాయంకాలం 4.30 చేరుకుని సా. 6:30 గంటల వరకు ఉంటారని తెలిపారు. అనంతరం నోవాటెల్ కు వెళతారని తెలిపారు.
దివంగత రామోజీరావు కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, మంత్రులు, వేదిక పైన ఉండే వివిఐపిల వాహనాల పార్కింగ్‌కు వేదిక పక్కనే సిద్ధార్థాలో ఏ -1 పార్కింగ్ ఏర్పాటు చేశారు. పార్లమెంటు సభ్యులు, శాసనమండలి, శాసనసభ్యులకు ఎం-1 గ్యాలరీ ఏర్పాటు చేశారు. వీరికి చైతన్య మహిళ జూనియర్ కళాశాల ఆవరణలో ఎం 1 పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్, ఈనాడు గ్రూపు సంస్థల ప్రతినిధులు, జాతీయ మీడియాకు బి 1 గ్యాలరీ ఏర్పాటు చేయగా, వీరికి కృష్ణవేణి విద్యాసంస్థల ఆవరణలో బి1 పార్కింగ్ కేటాయించారు.
అధికారుల వాహనాలు, జనరల్ పబ్లిక్ (బస్సులు, ఇతరుల వాహనాలు) వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బెంజ్ సర్కిల్ వద్ద వాహన పాసు లేని వాటికి వీఆర్ సిద్ధార్థ లో పార్కింగ్ చేయాలని బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ ప్రదేశాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సాయంత్రం 4 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించాలన్నారు. ప్రధాన వేదిక వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నారు. సభ ఏర్పాట్లన్నీ బుధవారం సాయంత్రానికి పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
సీఎం భద్రత అధికారి జార్జ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రధాన వేదికకు చేరుకుని మార్గం కృష్ణాజిల్లా, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిటీ లిమిట్స్ లో ఉందని, ఈ రూట్ పరిశీలించామని, కార్యక్రమం రోజున వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎస్‌విడి ప్రసాద్, గన్నవరం డీఎస్పీ జయసూర్య, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ టీ. కస్తూరి, రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ కృష్ణారెడ్డి, ఉయ్యూరు, గుడివాడ రెవిన్యూ డివిజన్ల అధికారులు డి రాజు, పి పద్మావతి, గుడివాడ, వైఎస్సార్ తాడిగడప మున్సిపల్ కమిషనర్లు సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సమావేశానికి ముందు ఏపీ సీఆర్డ్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, పెనమలూరు శాసనసభ్యుడు బోడే ప్రసాద్, కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కృష్ణా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, సీఆర్డీఏ అదనపు కమిషనర్ అలీం బాషా, జిఏడీ, ప్రోటోకాల్, వివిధ శాఖల అధికారులతో కలసి సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.