మీడియా దిగ్గజం రామోజీ రావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ అక్కడి నుంచే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఓ మీడియా దిగ్గజానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుండటం దేశంలో ఇదే తొలిసారి.
రాష్ట్రంలో రెండు రోజులు సంతాపదినాలు
రామోజీ అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు
రామోజీగ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరపున ముగ్గురు సీనియర్ అధికారులు హాజరు కానున్నారు. ఆదివారం ఉదయం నిర్వహించనున్న అంత్యక్రియల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా ఆర్పీ సిసోదియా, సాయిప్రసాద్, రజత్ భార్గవ హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పార్థివదేహంపై అధికారులు పుష్పగుచ్ఛం సమర్పించి నివాళి అర్పించనున్నారు.
రామోజీరావు మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం 9, 10 తేదీలను సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండ్రోజుల పాటు జాతీయ పతాకాన్ని సగం వరకూ అవనతం చేయాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారికంగా ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రమాణ స్వీకారం తరువాత కలుద్దామనుకున్నా..
రామోజీ భౌతిక కాయం వద్ద పవన్ నివాళి
రామోజీగ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) నివాళులర్పించి, రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ రామోజీరావు మరణ వార్త చాలా దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయన్ను కలుద్దామనుకున్నా. కానీ, ఇంతలోనే దురదృష్టవశాత్తూ కన్నుమూశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చిన వారే. ఎంతో మంది జర్నలిస్టులను అందించిన మహానుభావులు ఆయన. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో చేశారు. అత్యున్నత ప్రమాణాలతో గొప్ప ఫిల్మ్ సిటీని నిర్మించారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలి. జనసేన తరపున సంతాపం తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.
అందరికీ మార్గదర్శకులు: ఎడిటర్స్ గిల్డ్
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతికి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఆయనో మార్గనిర్దేశకుడని కొనియాడిరది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఎడిటర్స్ గిల్డ్ మాజీ అధ్యక్షుడు రామోజీరావు మరణం విచారకరం.. మీడియా మెఘల్‌గా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన రామోజీరావు ఎన్నో మార్గాల్లో మనందరికీ మార్గనిర్దేశకులు.. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే గొప్ప వ్యక్తి.. ఆయనో ఐకాన్.. మీడియా రంగానికి ఆయన చేసిన కృషి.. దేశవ్యాప్తంగా జర్నలిస్టులందరిలో నిరంతరం స్ఫూర్తి కలిగిస్తుందని ఎడిటర్స్ గిల్డ్ తమ ప్రకటనలో పేర్కొంది.
1987లో రామోజీరావు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. పత్రికాస్వేచ్ఛ అణచివేతకు అప్పటి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించడంలో కీలకపాత్ర పోషించారు.