- ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా సీఎం ఆదేశించారు
- గంజాయి, మద్యం మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు
- ముచ్చుమర్రి, విజయనగరం బాధిత కుటుంబాలకు పరిహారం
- హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత
అమరావతి: అత్యాచార నిందితులకు శిక్షలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వివరించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు, గంజాయి, చీప్ లిక్కర్ అరికట్టే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సోమవారం సమీక్షించారు. సమీక్షలో ముఖ్యమంత్రి చర్చించిన అంశాలను విలేకరులకు వివరించారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక ఘటనపై ఇప్పటికే ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారని, రోజుకో మాట మార్చడంతో బాలిక మృతదేహం ఆచూకీ కూడా ఇంకా లభించలేదన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని, గంజాయి, మద్యం మత్తులో అత్యాచారాలు చేసే నిందితులు ఎటువంటి వారైనా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు వెంటనే శిక్షలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో ఆరు నెలల పసికందుపై వరసకు తాతైన వ్యక్తి అత్యాచార యత్నం చేయడం దురదృష్టకర పరిణామ మన్నారు.
సంఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని, కేవలం మద్యం మత్తులో ఈ ఘటన జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. గంజాయి, మద్యానికి బానిసలై వావివరసలు మరచిపోతున్నారని, పోర్న్ సైట్లు కూడా మైనర్లను చెడుదోవ పట్టిస్తున్నాయన్నారు. పిల్లలకు సెల్ఫోన్లు ఇచ్చేముందు తల్లిదండ్రులు ఆలోచించుకోవాలని, పాఠశాలల్లో విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి, మద్యానికి బానిసైన వారికి డి ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఆడపిల్లలపై అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిందంటే భయపడేలా శిక్షలు అమలు జరిపేందుకు చట్టాలు రూపొందిస్తామని తెలిపారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి అత్యాచార బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, విజయనగరం జిల్లా అత్యాచార బాధిత పసికందుకు రూ.5 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ రూపంలో ఆర్థికసాయాన్ని ముఖ్యమంత్రి మంజూరు చేశారని, త్వరలోనే బాధిత కుటుం బాలకు స్వయంగా అందజేస్తానని వివరించారు.