ముంబయి: దిగ్గజ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత, టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా భౌతికకాయానికి ఏప ీముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ నివాళులర్పించారు. ముంబయిలోని ఎన్సీపీఏ గ్రౌండ్లోని పార్థివదేహం ఎదుట పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్‌తోపాటు, గ్రూప్ ఉన్నతాధికారులు, టాటా కుటుంబ సభ్యులతో చంద్రబాబు, లోకేష్‌లు మాట్లాడారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రతన్ టాటాలాంటి మహోన్నత వ్యక్తి ఈ లోకాన్ని వీడిపోవడం తీరని లోటన్నారు. ప్రజల సందర్శనార్థం రతన్ టాటా పార్థివ దేహాన్ని ముంబయిలోని ఎన్సీపీఏ గ్రౌండ్లో ఉంచారు. ముంబయిలోని వర్లి శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో మహారాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది.
ఏపీ కేబినెట్ నివాళి
దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మరణానికి ఏపీ కేబినెట్ నివాళి ప్రకటించింది. ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఉదయం భేటీ అయ్యింది. అజెండా అంశాలపై చర్చను కేబినెట్ వాయిదా వేసింది. రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించింది. భేటీకిముందు టాటా చిత్రపటం వద్ద సీఎం చంద్రబాబు, మంత్రులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా కొనియాడారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్‌ను సృష్టించారని ముఖ్యమంత్రి అన్నారు. సంపదను సృష్టించడమే కాకుండా… ఆ సంపదను సమాజంలో అన్ని వర్గాలకు చేరేలా పద్మవిభూషన్ రతన్ టాటా ఎంతో కృషి చేశారన్నారు. రతన్ టాటా మృతి పారిశ్రామిక రంగానికే కాకుండా దేశానికే తీరనిలోటని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముంబైకి బయలుదేరారు. ముంబయిలోని ఎన్సీపీఏ గ్రౌండ్లో రతన్ టాటా పార్థివ దేహాన్ని ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు.