అమరావతి: రేషన్ సరఫరాలో అక్రమాలకు తావు లేదని.. అక్రమాలకు పాల్పడిన ఎవరినీ వదలిపెట్టబోమని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో మంత్రి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం తెనాలిలో మండల స్థాయి స్టాక్ పాయింట్లలో తనిఖీ చేసినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో కందిపప్పు, పంచదార, పామాయిల్ తూకాల్లో తేడా కనిపించిందన్నారు. ప్యాకెట్ల తూకంలో 50 నుంచి 80 గ్రాములు తక్కువగా ఉందని అన్నారు. ఏపీలో 253 మండల లెవల్ స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని అప్పుడే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 62 ఎంఎల్ఎస్ కేంద్రాల్లో తనిఖీలు పూర్తవగా, 24 చోట్ల అక్రమాలు తేలాయన్నారు.
బాధ్యులపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. సరకులు సరఫరా చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించామన్నారు. గురువారంలోగా అన్ని స్టాక్ పాయింట్లలో తనిఖీలు పూర్తి చేయాలని ఆదేశించామని తెలిపారు. అక్రమార్కులు అందరిపైనా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ద్వారా అందించే సరుకుల్లో దోపిడీ చేయడాన్ని చాలా సీరియస్గా తీసుకుంటామన్నారు. ప్రజలంతా మార్పును కోరారని…ఆ మేరకు మార్పు తప్పక ఉంటుందని స్పష్టం చేశారు. తాము నిజాయితీగా, చట్టప్రకారం వ్యవహారిస్తామని ఉద్ఘాటించారు. ఎవరైనా ప్రజలను ఇబ్బంది పెట్టినా , మోసం చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ధాన్యం అమ్ముకునే రైతులకు అన్యాయం జరగదని.. పారదర్శకంగా వ్యవహరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.