- అభివృద్ధి సాధించి చూపించే పూచీ నాదీ
- కాల్వను గెలిపించుకునే బాధ్యత మీది
- మన లక్ష్యం హలో ఏపీ… బైబై వైసీపీ
- రాయదుర్గం శంఖారావంలో లోకేష్ పిలుపు
రాయదుర్గం (చైతన్యరథం): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి సాధించిన రాయదుర్గం నియోజకవర్గం.. వైసీపీ హయాంలో తిరోగమన దిశలో సాగిందని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, యువనేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం `జనసేన ఉమ్మడి అభ్యర్థి కాల్వ శ్రీనివాసులను గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత నియోజకవర్గ ప్రజలు తీసుకుంటే.. రాయదుర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే పూచీ కొత్త ప్రభుత్వం తరఫున నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆదివారం రాయదుర్గం శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగం చైతన్యం రేకెత్తించేలా సాగింది. పార్టీ శ్రేణులను, ప్రజలను ఉత్సాహపరుస్తూ.. ‘ఉమ్మడి అనంతపురం జిల్లా చిందేసింది’, ‘దేశం మొత్తం కనబడే కియా కార్ మేడ్ ఇన్ అనంతపురమని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం’, రాయదుర్గం కోట పౌరుషాలకు ప్రతీక.
ఇక్కడి ప్రజలూ అలాంటి పౌరుషాలకు ప్రతీకలే’, ‘ఇక్కడి పట్టుచీరలు, జీన్స్ దేశం మొత్తమ్మీద ఫేమస్, అనంత ప్రజల్లాగ’ అంటూ ఆసక్తిదాయక వ్యాఖ్యలతో లోకేష్ ప్రసంగం సాగింది. 2014 -19 వరకు కాల్వ శ్రీనివాసులు నాయకత్వంలో కుప్పం కూడా తీసుకెళ్లని నిధులు 3,291 కోట్లు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారన్నారు. నేను నిర్వహించిన శాఖ నుంచే ఎక్కువ శాతం నిధులు తెచ్చుకున్నారని, కాల్వకు నాయకత్వమిస్తే.. నియోజకవర్గ అభివృద్ధికి ఢోకాలేదని భరోసానిచ్చారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో సీసీరోడ్లు, బీటీ రోడ్ల, అంగన్వాడీ భవనాలు నిర్మించాం. ఇండోర్ స్టేడియం నిర్మించాం. రూ.44 కోట్లుతో డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించాం. రూ.150 కోట్లు ఖర్చుతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టామని యువనేత గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే గురించి ఆ పార్టీ అధినేతే తేల్చి చెప్పేశాడని, జగనే అవినీతి పరుడైతే… ఆయనతో అవినీతిలో పోటీపడిన వ్యక్తి అని ఎద్దేవా చేశారు.
పాపాల పెద్దిరెడ్డి జగన్‌ను కలిసి మనకంటే ఎక్కువ దోచేస్తున్నాడని రిపోర్టు ఇవ్వడంతో `ఇక్కడి ఎమ్మెల్యేను బయటకు పంపారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా జగన్‌కు సవాల్ విసురుతూ `టైం, డేట్ ఫిక్స్ చేయండి. రాయదుర్గం అభివృద్ధిపై కాల్వ శ్రీనివాసులు వస్తారు. మీరు ఎవరినైనా పంపండి. చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు. టీడీపీ, జనసేన బలపరిచిన కాల్వ శ్రీనివాసులును అసెంబ్లీకి పంపితే, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని యువనేత హామీ ఇచ్చారు. రాయదుర్గంలో బీసీ బాలికల ఆశ్రమం, జూనియర్ కళాశాలకు శాశ్వత భవనాలు కడతామన్నారు. అవసరమైన మేరకు డ్రిప్‌ను అందిస్తామని, బైరవాని తిప్పను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిగడపకు ఉచితంగా తాగునీటిని కుళాయి ద్వారా అందిస్తామన్నారు. ఇక్కడ అనేకమంది టైలర్స్, జీన్స్ కార్మికులున్నారు. వారి సమస్యలు చెప్పారు. వాటిని పరిష్కరించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
టీడీపీ బలం కార్యకర్తలే. నాయకులు పార్టీ వీడినా నమ్మకున్న సిద్ధాంతం కోసం కార్యకర్తలు నిలబడ్డారని ప్రశంసించారు. రా కదలిరా అంటే పరిగెత్తుకొచ్చే అచెంచల ప్రేమ, విశ్వాసం తెదేపా కార్యకర్తల సొంతమని కితాబిచ్చారు. నాకు అక్కా చెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు లేరు. ఎన్టీఆర్ ఇచ్చిన 60 లక్షలమంది కార్యకర్తలే నా కుటుంబ సభ్యులు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటానంటూ భావోద్వేగంతో పలికారు. గత ఐదేళ్లలో మనపై అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెటారని, చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు ఎవరైనా జ్యుడిషియల్ విచారణ వేస్తాం, తప్పకుండా శిక్షిస్తామని హెచ్చరిక చేశారు. ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు రాముడు, వైసీపీ గూండాలను ఈ లోకేష్ మూర్ఖుడు. మన వాళ్లను ఇబ్బంది పెట్టిన వారి పేర్లు ఎర్రబుక్‌లో ఉన్నాయి. ఎవ్వరూ తప్పించుకోలేరు అని హెచ్చరించారు. 53 రోజులు చంద్రబాబును జైల్లో పెట్టారు. పులిలా చంద్రబాబు బయటకు వచ్చారు.
చిల్లర కేసులకు మేం భయపడేది లేదని హెచ్చరించారు. ఎవరిపై ఎక్కువ కేసులు ఉన్నాయో వారికి నామినేటెడ్ పోస్టు ఇచ్చే బాధ్యతనాదని ఉత్సాహపర్చారు. చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి అన్నగా అండగా నిలబడతానని చెప్పారు. ఏపీకి రావాలని విమానాన్ని బుక్ చేసుకుంటే దాన్ని ప్రత్యర్థులు రద్దు చేయించారు. రాష్ట్రంలోని రానివ్వకుండా సరిహద్దుల్లో నిలిపేశారు. ఆనాడే సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని పవన్ నిర్ణయం తీసుకున్నారని లోకేష్ వివరించారు. పసుపు సైన్యం, జనసైనికులు జాగ్రత్తగా ఉండాలని, ఇరుపక్షాల మైత్రిని చెడగొట్టేందుకు వైసీపీ పేటీయం బ్యాచ్ పోస్టులు పెడుతుందని, వాటిని సంఘటితంగా తప్పికొట్టాలని లోకేష్ పిలుపునిచ్చారు. మూడు పార్టీల కార్యకర్తలు అన్నదమ్ముల్లా పని చేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు.
మన లక్ష్యం ఒక్కటే. హలో ఏపీ. బైబై వైసీపీ అని పిలుపునిచ్చారు.
కార్యకర్తల కోసం సంక్షేమ విభాగం ఏర్పాటుచేసి చనిపోయివారి కుటుంబాలకు రూ.2లక్షలు సాయం అందిస్తున్నామని, ఇప్పటివరకు రూ.100 కోట్లు ఖర్చు చేశామన్నారు. పిల్లలను చదివించలేకపోతే వారి బాధ్యత కూడా నా తల్లి భువనేశ్వరమ్మ తీసుకుంది. కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉంటామని లోకేష్ హామీ ఇచ్చారు. 2019 తర్వాత మనపై అనేక అక్రమ కేసులు నమోదు చేశారు. నాపై 22 కేసులు నమోదు చేశారు. ఎవరిపై ఎక్కువ కేసులు ఉన్నాయో వారికి అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తానని చమత్కారంగా చెప్పారు. బాబు సూపర్-6 హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం టీడీపీ-జనసేన ప్రభుత్వం. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లిన వారికి ఉత్తమ కార్యకర్త అవార్డు ఇచ్చాం. భవిష్యత్‌లో బాగా పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులిస్తాం. బీజేపీ నాయకులను కూడా కలుపుకుని రాబోయే ఎన్నికల్లో విజయదుంధుబి మోగించాలని యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చారు.