- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- 50మందికిపైగా తీవ్ర, స్వల్ప గాయాలు
- క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమం
- పేలుడు ధాటికి కుప్పకూలిన స్లాబు
- శిథిలాల కింద పలువురు కార్మికులు
అనకాపల్లి (చైతన్య రథం): అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలిన ప్రమాదంలో 16మంది దుర్మరణం చెందారు. మరో 50మందికిపైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పేలుడు సమయంలో 300మంది కార్మికులు విధుల్లో ఉన్నారని తోటి కార్మికులు చెబుతున్నారు. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని అసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పని చేస్తున్నారు. భోజన విరామ సమయం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకొని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పేలుడు సంభవించగానే కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.
భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫార్మా సెజ్ లోని అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో 11 యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. గాయపడ్డ వారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రియాక్టర్ పేలుడు ధాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు శ్లాబు కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు కార్మికులు చెబుతున్నారు. మూడో అంతస్తులో చిక్కుకున్న కార్మికులను క్రేన్ సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతన్నాయి.
హోంమంత్రి అనిత ఆరా
ఫార్మా కంపెనీలో ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మరోవైపు ప్రమాదంపై అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై వెంటనే విచారణ చేపట్టాలని ఎంపీ ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆస్పత్రి, ఘటనాస్థలి వద్ద స్థానిక నాయకులు అందుబాటులో ఉండి బాధితులకు సహాయ సహకారాలు అందించాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చారు.
ఘటనా స్థలానికి కలెక్టర్, ఎస్పీ
హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు రాంబిల్లి ఎస్సెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ దీపిక హుటాహుటిన వెళ్లి సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులు, సిబ్బందిని అడిగి ఆరా తీశారు. పేలిన రియాక్టర్ శకలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండొచ్చని కలెక్టర్ అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ప్రమాదంలో ఫార్మా కంపెనీ వద్దకు పెద్దఎత్తున కార్మికులు, స్థానికులు చేరుకున్నారు.
మృతుల వివరాలు…
1. వి. సన్యాసినాయుడు (50), ప్లాంట్ ఏజీఎం
2. రామిరెడ్డి, ల్యాబ్ హెడ్
3. హారిక, కెమిస్ట్
4. పార్థసారథి(23), ప్రొడక్షన్ ఆపరేటర్
5. వై. చిన్నారావు, ప్లాంట్ హెల్పర్
6. పి రాజశేఖర్ (22)
7. మోహన్, ఆపరేటర్
8. గణేష్, ఆపరేటర్
9. హెచ్. ప్రశాంత్
10. ఎం. నారాయణరావు
మరో నలుగురి వివరాలు తెలియాల్సి ఉంది.