- ప్రతిరోజూ నిర్ణీత వేళలు ప్రకటించాలి
- ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రణాళికలు
- ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఆదేశాలు
మంగళగిరి: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు చేరువ చేయాలని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఆ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రజలు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలకు వెళ్లి తమ సమస్యలు తెలియచేసేందుకు, ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రతిరోజూ రెండు గంటల పాటు నిర్ధేశిత సమయాన్ని ప్రకటించాలని ఆదేశాలు ఇచ్చారు. బుధవారం మంగళగిరిలోని తన నివాసంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో పవన్ సమావేశమ య్యారు. మండలి ప్రధాన కార్యాలయంతో పాటు రీజినల్, జోనల్ కార్యాలయాల్లోనూ ప్రజలు తమ సమస్యలు తెలియచేసేందుకు సమయం కేటాయించాలని సూచించారు. మండలి వెబ్ సైట్‌లో రాష్ట్రంలో వాయు, జల, శబ్ద కాలుష్యాల వివరాలను ప్రజలకు అవగాహన కలిగించే విధంగా పొందుపరచాలని స్పష్టం చేశారు. ప్రతిరోజూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య ఫిర్యాదులు స్వీకరణ, సమస్యలు తెలుసుకునేందుకు సమయం నిర్ధేశిస్తామని ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి బి.శ్రీధర్ తెలిపారు. ఈ సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎన్.వి.భాస్కరరావు, కె.శ్రీరామమూర్తి, పి.ప్రసాదరావు పాల్గొన్నారు.