- సీఎం పీఠంపై నాల్గవసారి!
- కుప్పంనుంచి ఎనిమిదొవసారి..
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో కుప్పం అంటే చంద్రబాబు. చంద్రబాబంటే కుప్పం. మూడు రాష్ట్రాల సరిహద్దుల్లోవున్న ఒకప్పటి పేద నియోజకవర్గంతో చంద్రబాబుకున్న అనుబంధం అలాంటిది. అలాంటి కుప్పం నియోజకవర్గం నుంచి అపర చాణక్యుడు చంద్రబాబునాయుడు 18వ సార్వత్రిక ఎన్నికల్లో రెండు రికార్డులు సృష్టించారు. కుప్పంనుంచి వరుసగా 8వసారి శాసనసభకు ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ నాల్గవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఒకే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ 8సార్లు విజయం సాధించిన, నాలుగుసార్లు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన నాయకుడు చంద్రబాబు ఒక్కరే. రెండుసార్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బాబు, విభజితాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసీ, చరిత్రపై చెరగని సంతకం చేశారు. వర్తమాన ఎన్నికల్లో అప్రతిహత విజయం సాధించిన చంద్రబాబు, నాల్గవసారి సీఎం పీఠాన్ని అధిష్టిస్తున్నారు. కుప్పంతో చంద్రబాబు అనుబంధం దాదాపు నాలుగు దశాబ్దాల నాటిది. 1989లో `మూడు రాష్ట్రాల సరిహద్దుల్లోని వెనుకబడిన కుప్పం నియోజకవర్గాన్ని తన రాజకీయ కర్మభూమిగా ఎంచుకున్న చంద్రబాబు, తొలిసారి గెలిచింది మొదలు 2024 వరకూ అప్రతిహత విజయాలు కొనసాగిస్తున్నారు. 1989లో 6918 ఓట్ల మెజారిటీ సాధించిన చంద్రబాబు.. 94లో 56588 ఓట్ల మెజారిటీ సాధించడం.. కుప్పం ప్రజలతో పెనవేసుకున్న ఆయన అనుబంధానికి అద్దం పడుతుంది. 99 ఎన్నికలో ్ల65687 ఓట్లు, 2004లో 59585 ఓట్లు, 2009లో 46065 ఓట్లు, 2014లో 47121 ఓట్లు, 2019లో 20722 ఓట్ల మెజారిటీలతో సమీప ప్రత్యర్థులపై విజయం సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సమీప ప్రత్యర్థిపై 48006 ఓట్ల మెజారిటీతో చంద్రబాబు విజయం సాధించారు.
ఈక్రమంలో కుప్పం నియోజకవర్గాన్ని అక్కడి స్థానికులు కలలో ఊహించని విధంగా అభివృద్ధి చేశారు. నీటిచుక్క కరవైన కుప్పం సెగ్మెంట్‌లొ ఇజ్రాయిల్ టెక్నాలజీ తీసుకొచ్చి బంగారు పంటలు పండేలా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. సాగునీటి వసతికి అవకాం లేని ప్రాంతంలో బిందు సేద్యాన్ని ప్రోత్సహించి.. ఉద్యాన పంటలతో రైతును రాజును చేసిందీ చంద్రబాబే. ఉద్యాన పంటల ఎగుమతులను ప్రోత్సహించి అంతర్జాతీయంగా ఈ ప్రాంతాన్ని అనుసంధానించారు. అలాగే.. ప్రయివేట్ మెడికల్ కాలజీ, ద్రవిడ యూనివర్శిటీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్.. ఇలా విద్యాపరంగానూ కుప్పం సెగ్మెంట్‌ను అభివృద్ధి బాటన నడిపి.. కుప్పం ప్రజలకు చంద్రబాబు ఆరాధ్యదైవమయ్యారు. రాష్ట్రంలో వైసీపీ హవా నడుస్తున్న నేపధ్యంలో తొలిసారి కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు ఓడిపోతున్నారని, బాబు కోటకు బీటలు వారినట్టేనని పాలకపక్ష వైసీపీ అనైతిక ప్రచారం సాగించినప్పటికీ, కుప్పం ప్రజల్లో చంద్రబాబు పట్లవున్న నమ్మకం, గౌరవం ఏమాతం సడలిపోలేదు. ఓట్ల మెజారిటీ సాధించి చంద్రబాబు కుప్పం సెగ్మెంట్‌లో తనకుసాటి ఎవరూ లేరని నిరూపించుకున్నారు. విభజనకు ముందు 1994నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, 2004 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. ఇండియా టుడే నుండి ‘‘ఐటి ఇండియన్ ఆఫ్ ద మిలీనియం’’, ద ఎకనమిక్ టైమ్స్ నుండి ‘‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’’, టైమ్స్ ఆసియా నుండి ‘‘సౌత్ అసియన్ ఆఫ్ ద ఇయర్’’, ప్రపంచ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్‌లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాదు, భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు.
సంక్షేమ కార్యక్రమాలు
1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలనను 1995 నవంబరు 1న ప్రారంభించారు. ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన అభ్యుదయాంధ్రప్రదేశ్ నిర్మాణమే కర్తవ్యంగా ఎంచుకొని 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించారు. అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు రూపొందించి అమలు చేశారు. సాంకేతికాభివృద్ధిని అర్ధం చేసుకొని 1998లో హైటెక్ సిటీని ప్రారంభించి, అనతికాలంలోనే ఐటి రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చారు. హైదరాబాద్ హైటెక్‌సిటి ఒక అంతర్జాతీయ సంచలనం. రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే సదాశయంతో 1998 సెప్టెంబర్ 10న ‘పచ్చదనం-పరిశుభ్రత’ కార్యక్రమంలో దాదాపు 9.36 కోట్ల మొక్కలు నాటారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసారు. బీసీలకు 33శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు చిత్తశుద్థితో చేపట్టారు.
2014 ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన చంద్రబాబు.. ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించారు. రైతులు చంద్రబాబుపై ఉన్ననమ్మకంతో 32వేల ఎకరాల భూములను రాజధాని నిర్మాణంకోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు.
పెండిరగ్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్నా కూడా రెండెంకెల వృద్ధి రేటును సాధించగలిగాడు. అనుబంధ రంగాలలో 22శాతం వృద్ధి సాధించి, నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టారు. బీసీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్ తీసుకొచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి దేశంలో మూడో అగ్రగామి రాష్ట్రంగా 2029 నాటికి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలన్నదే చంద్రబాబు సంకల్పం. 2019లో వైసీపీ గెలుపుతో విధ్వంస పాలకుడి చేతిలో రాష్ట్రం సర్వనాశనమైంది. తిరిగి వర్తమాన ఎన్నికల్లో అప్రతిహత విజయం సాధించిన చంద్రబాబు `రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడతారని రాష్ట్ర ప్రజలు ఆశగా చూస్తున్నారు.