దావోస్/స్విట్జర్లాండ్ (చైతన్యరథం): గ్లోబల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్, డేటా సెంటర్ సర్వీసుల్లో పేరెన్నికగన్న యూఎసఏకి చెందిన బహుళజాతి సంస్థ ఐరన్ మౌంటైన్ (Iron Mountain) ప్రెసిడెంట్, సీఈవో విలియం ఎల్. మీనీతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం దావోస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…జాతీయస్థాయి డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్నందున స్కిల్డ్ వర్క్‌ఫోర్స్, గ్లోబల్ కనెక్టివిటీని మెరుగుపర్చడానికి డేటా సెంటర్లకు మద్దతుగా విశాఖపట్నంలో రీజనల్ టెక్నాలజీ ఆపరేషన్స్ హబ్ నెలకొల్పాలని కోరారు. డేటా మేనేజ్‌మెంట్, సెక్యూర్ స్టోరేజి టెక్నాలజీస్, నెక్స్‌ట్ జెన్ డిజిటల్ ఇన్‌ఫ్రాక్ట్రక్చర్ లపై దృష్టిసారిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని పబ్లిక్ యూనివర్సిటీల్లో అప్లయ్‌డ్ ఇన్నోవేషన్స్, టాలెంట్ డెవలప్‌మెంట్, ఆర్ అండ్ డి అభివృద్ధికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. విలియం ఎల్.మీనీ మాట్లాడుతూ… రాబోయే 3–5 సంవత్సరాలలో క్లౌడ్, ఎంటర్‌ప్రైజ్, హైపర్‌స్కేల్ విభాగాల నుంచి డిమాండ్‌ను అంచనా వేస్తూ, అభివృద్ధి చెందుతున్న క్యాంపస్‌లలో ఏఐ- రెడీ మౌలిక సదుపాయాలను నిర్మించడంపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు. (ఐరన్ మౌంటైన్ సంస్థ 2021లో వెబ్‌వర్క్స్ భాగస్వామ్యంతో భారతదేశ డేటా సెంటర్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. భారత్‌లో రాబోయే రెండేళ్లలో ఈ సంస్థ 150 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది.)














