- గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం
- స్థానిక సంస్థల బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు స్థానిక సంస్థలకు రూ.1,452 కోట్ల నిధులు విడుదల చేస్తున్నామన్నారు. గ్రామాల అభివృద్ధితోనే దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న మహాత్మా గాంధీ ఆశయాలను పాటించే ప్రభుత్వం తమదన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఇప్పుడున్న ప్రజా కూటమి ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేస్తోంది.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే స్థానిక సంస్థలకు మరిన్ని నిధుల విడుదలకు నిర్ణయం తీసుకున్నాం. గ్రామ పంచాయతీలకు రూ.998 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.454 కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకున్నాం. ఈ నిధులతో గ్రామ, వార్డు స్థాయిల్లో పనులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నిధుల విడుదలతో స్థానిక సంస్థలకు ఆర్థికంగా వెసులుబాటు కలిగే అవకాశం కలుగుతుంది. గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తే.. ప్రజా కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా పని చేస్తోందని మంగళవారం ఒక ప్రకటనలో మంత్రి కేశవ్ తెలిపారు.