- ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు కృషి
- మండలిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకువస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీవో 117 వల్ల మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు 10,49,596 మంది విద్యార్థులు ప్రభత్వ పాఠశాలలకు దూరమయ్యారు. 10 మంది పిల్లల కంటే తక్కువున్న పాఠశాలలు 2021-22లో 1215 ఉంటే.. అది 5312కు పెరిగాయి. అంటే నాలుగురెట్లు ఎక్కువగా పెరిగాయి. 20 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలు 5,520 ఉంటే, అది 14,052 పాఠశాలలకు పెరిగాయి. సింగిల్ టీచర్స్ ఉన్న పాఠశాలలు 12,512 ఉన్నాయి. పాదయాత్రలో హామీ మేరకు జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకురావడం జరుగుతోంది. ఒక్క పాఠశాలను కూడా మూసివేయబోం.
సర్కారీ బడుల్లో అడ్మిషన్ల పెంపునకు కృషి
అందరినీ భాగస్వామ్యం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు కృషిచేస్తున్నాం. 60 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే..వన్ క్లాస్, వన్ టీచర్ అందిస్తున్నాం. 7 నుంచి 8వేల మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటుచేస్తాం. ప్రతి పంచాయతీకి మోడల్ స్కూల్ ఇవ్వాలని కోరుతున్నారు. రెండో విడతలో ప్రతి పంచాయతీ మోడల్ స్కూల్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అది సాధిస్తాం. అప్పర్ ప్రైమరీ స్కూల్స్‌ను కొనసాగిస్తాం. ప్రీ స్కూల్స్ విషయంలో ఫ్రేమ్ వర్క్ పై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
విద్యలో కాషాయికరణపై ఆధారాలుంటే బయటపెట్టాలి
అంతకుముందు విద్యలో కాషాయికరణ అంటూ వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా విద్యార్థులు బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులం మనం. కరిక్యులమ్ విషయంలో మతాన్ని తీసుకురావడం సరికాదు. వైసీపీ హయాంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అంటే అర్థం ఏమిటి? ఇస్లాం గురించి మాట్లాడారు, క్రిష్టియానిటీ గురించి మాట్లాడారు. హిందూమతం గురించి ఎక్కడా మాట్లాడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరివాడు.. ముస్లీం, క్రిష్టియన్, హిందూ అయినా అందరివాడని మేం పెట్టాం. ఏమతాన్ని కించపరచలేదు. అనవసరమైన వివాదాన్ని లేవనెత్తుతున్నారు. విద్యలో కాషాయికరణపై ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. మేం తీసుకువచ్చిన పుస్తకాల్లో కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా తీసుకువచ్చాం. విద్యారంగంపై చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు ఎందుకు పారిపోయారు. సభను తప్పుదారి పట్టించడం సరికాదు. కాషాయికరణపై సభ్యుని వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై నేను నిరసన వ్యక్తం చేస్తున్నాను. దక్షిణ భారతదేశంలో గత ప్రభుత్వం ఎన్‌ఈపీ అమలుచేస్తే.. వైసీపీ హయాంలో సింగిల్ మేజర్ సిస్టమ్ ను తీసుకువచ్చారన్నారు. ఈ అంశంపై మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. రికార్డులు చూసి సభ్యుని వ్యాఖ్యలు తొలగించాలన్నారు.