అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోగ్య సమాచారంపై న్యాయవాదులు ఏపీ హైకోర్టు కు నివేదికను సమర్పించారు. చంద్రబాబుకు వైద్యులు చేసిన కంటి ఆపరేషన్, హెల్త్ కండిషన్ వివరాలను హైకోర్టుకు లాయర్లు తెలిపారు. వైద్యుల సూచనల నివేదికను మెమో ద్వారా కోర్టుకు లాయర్లు ఇచ్చారు. నివేదికలో ఏం చెప్పారంటే.. కుడి కంటికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. చంద్రబాబు అనారోగ్యం నుంచి కోలుకునేందుకు మందులు వాడాలి. ఐదు వారాలపాటు వైద్యులు ఐ చెకప్ కోసం షెడ్యూల్ ఇచ్చారు. కంటికి ఐదు వారాల పాటు ఇన్‌ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి. ఐదు వారాల పాటు చంద్రబాబు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలి. గుండె సంబంధిత సమస్యతో చంద్రబాబు బాధపడుతున్నారు. గుండె పరిమాణంపెరిగింది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలున్నాయి. చంద్రబాబుకు తగినంత విశ్రాంతి అవసరం. మధుమేహన్ని అదుపులో ఉంచి.. జాగ్రత్తలు పాటించాలి. స్కిన్ ఎలర్జీకి సంబంధించి కూడా చంద్రబాబు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాబుకు ఎలర్జీ పెరిగిందని కూడా వైద్యులు పేర్కొన్నారు. చంద్రబాబు కాన్వాయ్‌లో, 24 గంటల పాటు అంబులెన్స్‌లో ట్రెయిన్డ్ డాక్టర్ ఉండాలని వైద్యులు సూచించారని న్యాయవాదులు నివేదికలో తెలిపారు.