- ఖరీఫ్ కరవుపై కేంద్రానికి నివేదిక!
- ప్రకటించిన కరవు కేంద్ర అధ్యయన బృందం
- ఖరీఫ్ `2024 పరిస్థితిపై పూర్తైన అధ్యయనం
- రైతులను ఆదుకోవడానికి సత్వర సాయం..
- రూ.151.77 కోట్లు సాయం అందించండి
- కేంద్ర బృందానికి ఆర్పీ సిసోడియా వినతి
అమరావతి (చైతన్య రథం): ఖరీఫ్ కరువు పరిస్థితులను అర్థం చేసుకుని సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన కేంద్రబృందాన్ని రెవెన్యూ శాఖ (ల్యాండ్స్, విపత్తుల నిర్వహణ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్) స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా కోరారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో గురువారం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ పెరిన్‌దేవి నేతృత్వంలోని కేంద్ర బృందంతో సమావేశమై రాష్ట్రంలో కరవు పరిస్థితులను వివరించారు.
కేంద్ర బృందం సభ్యులు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిరచర్ డిప్యూటీ డైరక్టర్ సుప్రియా మాలిక్, నీతి ఆయోగ్ సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ అనురాధ బట్నా, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ కమిషనర్ దీపాంకర్ సేథ్, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరక్టర్ ప్రదీప్ కుమార్, సెంట్రల్ వాటర్ కమిషన్ డైరక్టర్ మన్నూజీ ఉపాధ్యాయ్, గ్రామీణాభివృద్ధి శాఖ అండర్ సెక్రటరీ జయంతి, ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ డైరెక్టర్ కె పొన్నుస్వామిలు ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిపై చర్చించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరవు పరిస్థితులను కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు జిల్లాల్లోని 54 మండలాలు (అన్నమయ్య -19, చిత్తూరు -16, శ్రీ సత్యసాయి -10, అనంతపురం -7 మరియు కర్నూలు -2) ఇప్పటికే ప్రకటించడం జరిగింది. వీటిలో 27 తీవ్ర కరువు మండలాలు, 27 మధ్యస్థ కరువు మండలాలు ఉన్నాయి. కేంద్ర కరవు నిబంధనల ప్రకారం సాధారణ వర్షపాతంకంటే తక్కువ వర్షపాతం, వర్షాభావంతో అత్యధిక డ్రైస్పెల్స్, రిమోట్ సెన్సింగ్, సాయిల్ మోయిశ్చర్, హైడ్రాలజీ, పంట నష్టం 33శాతం అంతకంటే ఎక్కువఉన్న మండలాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కరవు ప్రాంతాలను ప్రకటించిందని ప్రభుత్వ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా వివరించారు.
కరవు ప్రభావంతో పత్తి, జొన్న, వేరుశెనగ, ఎర్ర శనగలు, మొక్కజొన్న మొదలైన 14 రకాల పంటలు దెబ్బతిని ఐదు జిల్లాల్లోని 1.06 హెక్టార్ల విస్తీర్ణంలో 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు లక్షమంది రైతులకు రూ.16.67 కోట్ల వ్యయంతో 80శాతం సబ్సిడీపై విత్తనాలు, రూ.55.47 కోట్ల వ్యయంతో పశుగ్రాసం, పశుగ్రాస విత్తనాల సరఫరా, 60శాతం సబ్సిడీపై టీఎంఆర్ (టోటల్ మిక్స్‌డ్ రేషియో), 40శాతం సబ్సిడీపై చాఫ్ కట్టర్లు, మందుల సరఫరా వంటి ఉపశమన చర్యలు చేపట్టినట్లు కేంద్ర బృందానికి వివరించారు.
కరువు ప్రాంత రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రూ. 90.62కోట్లు, రూరల్ వాటర్ సప్లై రూ. 0.78 కోట్లు, అర్బన్ వాటర్ సప్లై రూ.4.89 కోట్లు, పశు సంవర్ధక శాఖకు రూ.55.47 కోట్లు ఆర్థిక సహాయం అవసరమన్నారు. క్షేత్రస్థాయిలో కరువు నష్టానికి సంబంధించి వాస్తవిక వివరాలను అందించామని, రైతులను ఆదుకోడానికి సత్వరమే రూ.151.77 కోట్లు సాయం చేయాలని ప్రభుత్వ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ పెరిన్‌దేవి మాట్లాడుతూ.. కరవు కారణంగా నష్టపోయిన పంటల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందచేస్తామని తెలిపారు. పంట నష్టం జరిగిన రైతులను అన్ని విధాలా ఆదుకునేలా చూస్తామన్నారు. అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని కరువు మండలాల్లో రైతులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను గమనించామని తమ నివేదికలో కేంద్రానికి అన్ని విషయాలను సమగ్రంగా తెలుపుతామన్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కరవు పరిస్థితులు స్పష్టంగా అర్థమవుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో రైతులు కరువు వల్ల తమకు జరిగిన నష్టాన్ని వివరించారని తెలిపారు. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించి వీలైనంతమేర ఆదుకోవడానికి తమవంతు సహకారాన్ని అందిస్తామని పెరిన్ దేవి స్పష్టం చేశారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.