- ప్రభుత్వ సహాయక సంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్
- మళ్లీ వర్షాలపై శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు అప్రమత్తం
- చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా చూడాల్సిన అవసరం
- వాసర్ ల్యాబ్స్ డేటాతో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం
- ఇప్పటికే 1.1లక్ష కుటుంబాలకు నిత్యావసరాలు అందించాం
- టెక్నాలజీతో బాధితులకు అండగా నిలుస్తున్నాం
- శానిటైజేషన్‌ను సైతం ఆడిటింగ్ చేసే పరిస్థితికి వచ్చాం.
- మాపై ప్రజలకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం
- గత ఐదేళ్లలో అన్ని డ్రెయిన్లనూ గాలికొదిలేశారు
- కొందరి స్వార్థానికి ఇంతమంది బాధపడాల్సి వస్తోంది
- ఆపరేషన్ బుడమేరుతో విజయవాడను సేఫ్‌గా పెడతా
- మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్య రథం): ప్రకృతి విపత్తును ఎదుర్కోవడానికి గత ఎనిమిది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న చర్యలపట్ల రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సంతృప్తి వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 8రోజూ పర్యటించిన సీఎం చంద్రబాబు.. పర్యటన అనంతరం ఆదివారం రాత్రి విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘ఉదయం గవర్నర్‌ని కలిసి ప్రస్తుత పరిస్థితిని వివరించాను. వరదకు కారణాలు, ప్రకాశం బ్యారేజీకి గతంలో ఎప్పుడూ రానంతగా వచ్చిన నీళ్ల పరిస్థితి, ఎగువన అనేక ప్రాజెక్టులున్నా.. ఇంత పెద్దఎత్తున ఇన్‌ఫ్లోస్ రావడానికి కారణమైన వాతావరణ మార్పులు, క్లౌడ్ బరెస్టు కావడాన్ని వివరించా. ఏవిధంగా బుడమేరుకు గండ్లుపడ్డాయి? బుడమేరులో చోటుచేసుకున్న కబ్జాలు? 2 లక్షల 2 వేలు కుటుంబాలు అంటే ఆరులక్షలమంది ప్రజలు ఏవిధంగా ఇబ్బందిపడ్డారు? 8వ రోజూ నీటిలో ఉండే పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ అంశాలన్నింటినీ గవర్నర్‌కు వివరించాను. వరదను ఎదుర్కోడానికి అధికార యంత్రాంగం మొత్తం రేయింభవళ్లు నిమిషం కూడా విశ్రాంతి తీసుకోకుండా పునరావాస కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారో కూడా వివరించాను. సీనియర్ ఆఫీసర్లు సైతం బురదలో తిరిగి ఉత్తమ సేవలు అందించినట్టు చెప్పడం జరిగింది.
వీటిపై గవర్నర్ పాజిటివ్‌గా స్పందించారు. సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే సాధారణ పరిస్థితులు చోటుచేసుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ డిప్రెషన్ వచ్చింది. దీనివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెలీకాన్ఫరెన్స్ తీసుకొని శ్రీకాకుళం నుంచి గుంటూరు, ప్రకాశం, బాపట్ల వరకు అందరినీ అప్రమత్తం చేశాం. ఎక్కడికక్కడ వర్షపాతంపై వారికి సమాచారమిచ్చాం. ఉత్తరాంధ్రలో ఎక్కువగా వర్షంపడే అవకాశముంది. ఏలేరు రిజర్వాయర్‌కు ఏఎస్‌ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశముంది. దానివల్ల పిఠాపురం ప్రాంతంలో ముంపు వచ్చే అవకాశమున్నందున ముందు జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. ఏలేరు సామర్థ్యం 24 టీఎంసీ కాగా ఇప్పటికే మధ్యాహ్నానికి 21 టీఎంసీ ఉన్నాయి. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో ముంపునకు గురికాకుండా ప్రాజెక్టుకు ఇబ్బంది కాకుండా తగిన చర్యలు తీసుకోమని చెప్పాం’ అని చంద్రబాబు వివరించారు.
విజయవాడలో అల్పాహారాన్ని 3,97,866 మందికి ఇచ్చాం. లంచ్ 4,33,400 మందికి ఇచ్చాం. డిన్నర్ కూడా 4,26,280 మందికి ఇచ్చాం. ఇప్పటివరకు ఎనిమిది రోజుల్లో 97,70,000 ప్యాకెట్లు అందించాం. 94 లక్షల నీటి బాటిళ్లను పంపిణీ చేశాం. పాలు అయితే 28 లక్షల లీటర్లు అందించాం. 41 లక్షల బిస్కట్ ప్యాకెట్లు ఇచ్చాం. 3,33,000 క్యాండిళ్లు ఇచ్చాం. లక్షా 97 వేల అగ్గిపెట్టెలు పంపిణీ చేశాం. ఈరోజు 62 మెట్రిక్ టన్నులు కూరగాయలు తెచ్చి పంపిణీ చేశాం. మొత్తంమీద 163 టన్నులమేర కూరగాయలు పంపిణీ చేశాం. మొత్తం 236 మంచినీటి ట్యాంకర్లు పనిచేస్తున్నాయి. 417 ట్రిప్పులు తిరిగాయి. మొత్తంమీద 2,090 ట్రిప్పులతో నీటిని అందించడం జరిగిందని సీఎం చంద్రబాబు వివరించారు.
1200 వాహనాల్లో నిత్యావసరాల పంపిణీ
నిత్యావసర సరుకులను 1,200 వాహనాల ద్వారా అందిస్తున్నామని చంద్రబాము వివరించారు. ‘2,32,000 కుటుంబాలకుగాను 1,10,000 కుటుంబాలకు అందజేశాం. మిగిలిన కుటుంబాలకు మంగళవారంలోగా పూర్తిచేస్తాం. ఫైర్ ఇంజిన్ల ద్వారా 27 వేల ఇళ్లను శుభ్రపరిచాం. అవసరమైన ప్రతిఒక్కరికీ సేవలను విస్తరిస్తాం. 7,100 మంది శానిటేషన్‌పై పనిచేస్తున్నారు. ఎక్కడా ఇసుక, దుమ్ము అనే మాటలేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. రహదారులను రెండుమూడుసార్లు శుభ్రం చేస్తున్నారు. ఈ చర్యలవల్ల అంటువ్యాధులు రాకుండా చేసే అవకాశం ఉంటుంది. 122 బోట్లు, 37 డ్రోన్లు పనిచేస్తున్నాయి. పారిశుద్ధ్యానికి సంబంధించి ఎంతవరకు మెరుగ్గా చేశారనేదాన్ని డ్రోన్లను ఉపయోగించి విశ్లేషించడం జరుగుతోంది. ప్రతి టీమ్‌నూ జవాబుదారీతనం చేస్తున్నాం. డ్రోన్ల సాయంతో ఆహార పొట్లాలను కలుషితం అనే మాట లేకుండా సురక్షితంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదేవిధంగా శానిటైజేషన్‌ను ఆడిటింగ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఎక్కడికక్కడ తక్కువ ఖర్చుతో స్ప్రేయింగ్ చేస్తున్నాయి. 15మంది చేసే పని ఒక డ్రోన్ చేయగలుగుతోంది. 870 వాహనాలు ట్రాన్స్‌పోర్టుకు పనిచేస్తున్నాయి. ఉచిత బస్సులు నడుస్తున్నాయి. 8 ఆటోలు కూడా పెట్టాం. 13 జేసీబీలు, 14 క్రేన్లు, లారీలు 171 పనిచేస్తున్నాయి. మరణించిన 29 మంది కుటుంబాలకు పరిహారం అందించాం’ అన్నారు.
టెక్నాలజీని వాడుకుంటూ ముందుకెళ్తున్నాం
బుడమేరు నుంచి సీపేజ్ ద్వారా 500 క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. ఈ నీళ్లకు వర్షంద్వారా వచ్చే నీళ్లు కలుస్తున్నాయి. ఈ నీళ్లన్నీ పోవడానికి ఎంత సమయం పడుతుందనే లెక్కలు వేస్తున్నాం. ఇవన్నీ మంచి ఫలితాలిస్తున్నాయి. ఆరు గంటలకు 0.51 టీఎంసీ నీళ్లు ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు రఫ్‌గా 1 మీటరు, అరమీటరు తగ్గింది. ఇకపై వర్షం పడకపోతే రేపు సాయంత్రానికి చాలావరకు నీళ్లు వెళ్లిపోతాయి. మళ్లీ వర్షంపడితే ఆ నీటిని కూడా డ్రెయిన్ చేయాలి. అన్ని డ్రెయిన్లలోని నీటిని పుష్ చేయడానికి మెకానిజంను ఏర్పాటుచేశాం. ప్రొక్లెయిన్లను తీసుకొచ్చి డ్రెయిన్లలో చెత్తాచెదారాన్నీ తీసేస్తున్నాం. 10, 15 వేల క్యూసెక్కుల నీరు కృష్ణాలోకి పోవడానికి బుడమేరు బండ్‌ను పెంచుతున్నాం. కాలువలు పొంగకుండా ఏంచేయాలో చూస్తున్నాం. టెక్నాలజీని పూర్తిగా వాడి.. డేటాను క్షుణ్నంగా విశ్లేషించి సమస్య రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. ఈ విషయం ప్రజలు అర్థం కావాలి. డ్రోన్లు, ఫోన్లు, సీసీటీవీ కెమెరాలను పెద్దఎత్తున వాడుతున్నాం. వర్షం, వరదల వల్ల నష్టపోయిన వాహనాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వాహనాలు రిపేర్ చేయడానికి ఆయా ఉత్పత్తుల తయారీ కంపెనీలతో మాట్లాడుతున్నాం. ఇళ్లలో పాడైన వస్తువులను తక్కువ ఖర్చుతో రిపేర్ చేయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. చాలా వ్యవస్థీకృతంగా పనులు చేయడానికి శ్రీకారంచుట్టాం. రేపటిలోగా దీనిపై స్పష్టత వస్తుంది. ఎవరైతే తమ వస్తువులను రిపేర్ చేయించుకోలేరో అలాంటి వారికి ప్రభుత్వమే చేయిస్తే ఎలాఉంటుందో ఆలోచిస్తున్నాం. కష్టకాలంలో ఉన్న ప్రతిఒక్కరినీ ఆదుకోవాలనేది మా ఉద్దేశం’ అని సీపం చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం
‘నష్టాన్ని బేరీజు వేసుకొని ఏవిధంగా ఆర్థిక సహాయం అందించాలో ఎన్యూమరేషన్ చేసి అందిస్తాం. నష్టపోయిన వ్యాపారులకు కూడా ఏవిధంగా సహాయం చేయాలో చూస్తున్నాం. భారత ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. ప్రతిఒక్కరికీ న్యాయం చేసే దిశగా ముందుకెళ్తున్నాం. ప్రజల్లో ఓ విశ్వాసం ఉంది. ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, నీటి సరఫరాపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని డేటాను విశ్లేషించుకుంటున్నాం. మరోవైపు ప్రభుత్వ పనితీరుపైనా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నాం. 88 శాతం అధికారులు బ్రహ్మాండంగా పనిచేశారని ప్రశంసించారు. ఇది మంచి పరిణామం. మొత్తంమీద చూస్తే అధికారులకు మంచి రేటింగ్ వచ్చింది’ అని చంద్రబాబు అన్నారు.
గత ఐదేళ్లలో డ్రెయిన్లను గాలికొదిలేశారు
గత ఐదేళ్లలో ఏ ఒక్క డ్రెయిన్‌నూ.. స్టార్మ్ వాటర్ డ్రెయిన్లను సైతం నాశనం చేశారు. ఇళ్లలోంచి వచ్చే వ్యర్థ జలాలు పోయే డ్రెయిన్లన్నీ దారుణంగా ఉన్నాయి. రేపటినుంచి వాటిని శుభ్రంచేయించాల్సి ఉంది. వరద ప్రాంత ప్రజల కష్టాలను చూస్తే బాధేస్తోంది. మళ్లీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా చూస్తాం. బుడమేరు ఆపరేషన్ ప్రారంభమవుతుంది. భవిష్యత్తులో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. ప్రజల భద్రత కంటే ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని.. ప్రజల భద్రతకోసం చేయాల్సిందంతా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.