- చట్టసభల్లో 33 శాతం కల్పనకు నిర్ణయం
- కేంద్రం ఆమోదానికి కేబినెట్ నిర్ణయం
- రాష్ట్రంలో ఏఐ వర్శిటీ, స్కిల్లింగ్ అకాడమీ
- ప్రస్తుత ఏజెన్సీకే ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్ పనులు
- వార్డు, సచివాలయలకు దినపత్రిక కోత
- ఎక్స్ సర్వీస్‌మెన్ కార్పొరేషన్‌కు రూ.10 కోట్లు
- రైతు భరోసా కేంద్రాల పేరు మార్పు
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
- వివరాలు వెల్లడిరచిన మంత్రి పార్థసారథి
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలోని వెనుకబడినవర్గాల వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమల్లో భాగంగా రాష్ట్రంలోని బీసీలకు చట్టసభలో సమానమైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలనే లక్ష్యంతో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనలను కేంద్ర ఆమోదం కొరకు పంపాలని కేబినెట్ నిర్ణయించింది. బీసీలు ఆర్థికంగా వెనుకబడి ఉండటానికి కారణం రాజకీయపరంగా వారికి తగిన అవకాశాలు లేకపోవడమేనన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సుదీర్ఘ రెండో ఈ-కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడిరచారు.
రాష్ట్రంలో ఏఐ వర్శిటీ, స్కిల్లింగ్ అకాడమీ
కృత్రిమ మేధ, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అమరావతిలో ఏఐ యూనివర్సిటీ, స్కిల్లింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీని యుజిసి నిబంధనలు-2023 ప్రకారం డిస్టింక్టు కేటగిరీలో ‘డీమ్డు టు బి యూనివర్శిసిటీ’గా కన్వర్టు చేసేందుకు అవసరమైన ‘నో అబ్జక్షన్ సర్టిఫికేట్’ను ప్రభుత్వపరంగా జారీచేసేందుకు కేబినెట్ ఆమోదించింది. ప్రజా జీవితంలోని ప్రతి అంశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో సాంకేతిక విద్యను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. నాలెడ్జ్ జనరేషన్ మరియు అప్లికేషన్ కేంద్రాలతో స్మార్ట్ `ఫ్యూచరిస్టిక్ సిటీగా రాజధాని అమరావతి నిర్మించేలా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. సవాళ్లు మరియు అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సిద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించి ప్రతిభ, అభివృద్ధి, స్టార్టప్ ఇంక్యుబేషన్, అత్యాధునిక పరిశోధనలు, బాధ్యతాయుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాలను ప్రోత్సహించడానికి ముందుకొచ్చే పలు విద్యాసంస్థలకు పూర్తిస్థాయిలో సహకారాన్ని అందజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. దేశంలో పేరెన్నికగన్న పది ఉత్తమ వర్శిటీలను ఆంధ్రప్రదేశ్‌కు తేవడం లక్ష్యమని, బిట్స్ పిలానీ సంస్థ తమ అనుబంధ సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత తెలిపిందని సీఎం చంద్రబాబు వెల్లడిరచారు.
ప్రస్తుత ఏజెన్సీకే ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్ పనులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం జాతీయ ప్రాజెక్టులో భాగమైన ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ (ఇసిఆర్‌ఎఫ్) గ్యాప్ 2 పనుల్లో భాగంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను ప్రస్తుతమున్న ఏజన్సీతోనే కొనసాగించేందుకు పోలవరం చీఫ్ ఇంజనీరు ప్రతిపాదించిన రాటిఫికేన్ ఆర్డర్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త డయాప్రమ్ వాల్ నిర్మాణం కారణంగా ఉత్పన్నమయ్యే అదనపు పనులను పారదర్శక బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. రాయలసీమలో ఉన్న అన్ని రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను ఈ సీజన్‌లోనే నింపేవింధగా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖను సీఎం ఆదేశించారు.
ఎక్స్ సర్వీస్‌మెన్ కార్పొరేషన్‌కు రూ.10 కోట్లు
మాజీ సైనికులు, యుద్ధ వికలాంగ సైనికులు, యుద్ధ వితంతువులు, మాజీ సైనిక వితంతువులు, వారిపై ఆధారపడినవారి స్వయంసమృద్ధి, సహాయ పునరావాసానికై సొంత పీడీఎఫ్ ఖాతానుండి రూ.3 కోట్ల కార్పస్ నిధితో ఆంధ్రప్రదేశ్ ఎక్స్-సర్వీస్మెన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై స్పందించిన ముఖ్యమంత్రి రూ.10 కోట్ల కార్పస్ నిధి ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
వార్డు, సచివాలయలకు దినపత్రిక కోత
గ్రామ, వార్డు వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నెలకు రూ.200 చొప్పున అదనపు ఆర్థిక సాయం అందించేందుకు 2023 ఏప్రిల్ 3న జారీ చేసిన జీవోఆర్టీ నెం.6, జీవో నంబరు 7ల ఉపసంహరణ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. రాజకీయ లబ్దికోసం ఎవరికో ఆర్థికలాభం చేకూరేలా చేసిన ఈ ఉత్తర్వులువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.102 కోట్లు నష్టం వాటిల్లిందని, దీనిపై కమిటీ వేసి పూర్తి వివరాలను సేకరించాలని కేబినెట్‌కు ముఖ్యమంత్రి సూచించారు.
వ్యవసాయం మరియు మార్కెటింగ్ శాఖలో..
రాష్ట్రంలోని సహకార సంఘాల పనితీరును మెరుగుపర్చాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం 1964లో క్లాజు (ఐ-1)ను తొలగించి, సెక్షన్ 2లో క్లాజు (ఎన్-ఐ)ను చేర్చే చట్ట సవరణ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే సెక్షన్ 21ఏ లోని సబ్ సెక్షన్ (1ఎ)ను తొలగించడంతో పాటు సహకార సంఘాల పనితీరు మెరుగుకు 115-ఇ సవరణకు సంబంధించి ముసాయిదా బిల్లును మంత్రిమండలి ఆమోదించింది. కౌలుదారు గుర్తింపు కార్డుల జారీ మరియు కొత్త కౌలు చట్టం, 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ‘‘సాయిల్ హెల్త్ కార్డుల జారీ మరియు 2024-25లో ‘‘పొలం పిలుస్తోంది’’ కార్యక్రమంపై స్టేటస్ నోట్స్‌ను ఆమోదించింది.
రైతు భరోసా కేంద్రాల పేరు మార్పు
గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రంగా మారుస్తూ.. ఇప్పటికే జారీ చేసిన జీవోను ర్యాటిపైచేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.