అమరావతి: పులివెందుల టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కి భద్రత పునరుద్ధరించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వారి గన్మెన్లను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. గన్మెన్ల తొలగింపు వ్యవహారంపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం లేఖ రాశారు. బీటెక్ రవికి తొలగించిన భద్రతను పునరుద్ధరించాలని అచ్చెన్నాయుడు తన లేఖలో కోరారు. ఎంఎల్సీ పదవీ కాలం పూర్తయిందనే నెపంతో రవికి సెక్యురిటీ తొలగించడం అభ్యంతరకరం. బీటెక్ రవికి ప్రాణహాని ఉంది. 2006లో రవి మామ ఎం రామచంద్రారెడ్డి, బంధువు పీ రామచంద్రారెడ్డిలను ప్రత్యర్థులు అతి దారుణంగా హత్య చేశారు. అప్పటి నుంచి బీటెక్ రవికి నాటి ప్రభుత్వం 1G1 భద్రత కల్పించింది. ఎమ్మెల్సీ పదవి చేపట్టిన నాటి నుంచి భద్రతని 2G2 కు పెంచారు. బీటెక్ రవికి తన రాజకీయ ప్రత్యర్థులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రాణహాని ఉంది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల కోసం అర్థంలేని కారణాలతో బీటెక్ రవికి భద్రత నుతొలగించింది. 2023 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలోను బీటెక్ రవి వాహన శ్రేణిపై దాడి జరిగింది. ఆ దాడి నుంచి రవి త్రుటిలో తప్పించుకున్నారు. కడపలో ఉన్న రాజకీయ పరిణామాలు దృష్ట్యా బీటెక్ రవిని భౌతికంగా లేకుండా చేయాలని ప్రత్యర్ధులు వ్యూహాలు పన్నుతున్నారు. బీటెక్ రవికి జరిగరానిది ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వానిదే బాధ్యత. ఈ నేపధ్యంలో బీటెక్ రవికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా భద్రత పునరుద్ధరించాలని అచ్చెన్నాయుడు కోరారు.