- భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం
- విజయవంతానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి
- ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి
- ఫిర్యాదులను ఆర్టీజీలో పొందుపరిచేలా చర్యలు
- రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 6వ తేదీ నుంచి వచ్చే జనవరి 8వ తేదీ వరకూ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా తెలిపారు. గ్రామస్థాయిలో భూములకు సంబంధిం చిన సమస్యలను పరిష్కరించే ప్రాథమిక ఉద్దేశంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని చెప్పారు. ఈ సదస్సుల సందర్భంగా సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శించి ఫ్రీ హోల్డ్, సెక్షన్ 22ఏకు సంబంధించిన భూ ఆక్రమణ సమస్యలతో ప్రభావితమైన వారి నుంచి ముందస్తు సమాచారంతో వినతు లను స్వీకరించడం జరుగుతుందని వివరించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జిల్లా షెడ్యూల్‌ను ఖరారు చేసి గ్రామ, మండల స్థాయి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార విధానా న్ని పర్యవేక్షించి సకాలంలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. రెవెన్యూ సదస్సుల సందర్భంగా స్వీకరించే ఫిర్యాదులన్నింటినీ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్‌టీజీఎస్) రూపొందించిన గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్‌లోని ప్రత్యేక విండోలో ఆన్‌లైన్‌లో పొందుపరిచి ఉంచడం జరుగుతుందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం, రెవెన్యూ సదస్సు లు ప్రతిరోజూ ఉదయం 9.00 గంటలకు రెవెన్యూ గ్రామంలో నిర్దేశించిన ప్రదేశంలో నిర్వహించాలని సూచించారు.
ఈ రెవెన్యూ సదస్సులకు జాయింట్ కలెక్టర్‌ను సమన్వయ కర్తగా ఉంటారని, సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లను వారి వారి డివిజన్‌లలో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు 5వ తేదీ లోగా షెడ్యూల్ ఖరారు చేసే విధంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెద్ద రెవెన్యూ గ్రామాల్లో రోజంతా, చిన్న రెవెన్యూ గ్రామాలకు ఒక పూటలో రెవెన్యూ సదస్సు ల నిర్వహణకు తగినంత కూర్చోగలిగే సామర్థ్యం ఉన్న ప్రదేశాలను ఎంపిక చేసుకోవా లని సూచించారు. రెవెన్యూ సదస్సుల గురించి ప్రజలకు తెలియజేయడానికి స్థానిక మీడి యాను ఉపయోగించి విస్తృత అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశాల ఉద్దేశం, సదస్సులు జరిగే తేదీలు, వేదిక వివరాలతో కూడిన కరప త్రాలు, పోస్టర్లను అన్ని గ్రామ పంచాయతీల్లో పంపిణీ చేయాలని కలెక్టర్లను ఆదేశిం చారు. రెవెన్యూ సదస్సుల తేదీ, స్థలాన్ని టాం-టాం ద్వారా గ్రామస్తులకు తెలియజేసి గ్రామ పంచాయతీ కార్యాలయం, పాఠశాల, గ్రామ సంస్థ కార్యాలయం, ఐకేపీ, ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో వాటిని ప్రదర్శించాలని తెలిపారు. తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, సంబంధిత గ్రామాల వీఆర్వో, మండల సర్వేయర్, రిజిస్ట్రేషన్ శాఖ ప్రతినిధి, అవసరమైన చోట్ల అటవీ, దేవాదాయ శాఖ, వక్ఫ్ బోర్డు సిబ్బందితో కూడిన ఈ అధికార బృందాలు ఆయా గ్రామాల సందర్శన గురించి గ్రామస్తులకు ముందస్తుగా తెలియజేసి విస్తృత ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాస్థాయి అధికారులను మండల నోడల్ అధికారులుగా నియమించి వారి ఆధ్వర్యంలో ఈ రెవెన్యూ సదస్సులు విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.