- వీఆర్వో నుండి కలెక్టర్ వరకు అధికారులందరూ గ్రామాల్లోనే
- వైసీపీ పాలనలో ప్రతి గ్రామంలో భూ కబ్జాలే
- భూ సమస్యల పరిష్కారానికి ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
- ప్రజలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపు
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతుల స్వీకరణ
అమరావతి(చైతన్యరథం): ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా గ్రీవెన్స్‌కు వచ్చే ప్రజా వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్త్తున్నామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, తెలుగుయువత అధ్యక్షుడు శ్రీరాం చిన్నబాబులతో కలిసి సోమవారం గ్రీవెన్స్‌లో వినతి పత్రాలు స్వీకరించిన అనంతరం మీడియాతో మంత్రి మండిపల్లి మాట్లాడుతూ వచ్చే నెల 1వ తేదీ నుండి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్త్తున్నామన్నారు.
గత ఐదేళ్ల పాలనలో జరిగిన భూ దోపిడీలు, ఆన్‌లైన్ ట్యాంపరింగ్‌లు, రికార్డుల తారుమారులాంటి సమస్యలను గ్రామాల్లోకి వచ్చే అధికారులకు ప్రజలు తెలియజేయాలని. గ్రామాల్లోనే సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నిస్తారని తెలిపారు. వీఆర్వో నుండి కలెక్టర్ వరకు అధికారులందరూ గ్రామాల్లోనే ఉండి బాధితుల నుండి విన్నపాలు స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు జయప్రదం చేయాలన్నారు. రాబోయే ఐదేళ్లలో రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించి మంచి పేరు తెచ్చుకునేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ప్రజలనుండి వచ్చిన వినతుల్లో కొన్ని…
ఎన్నికలకు ముందు మదనపల్లిలో తమ భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఆక్రమించి అక్రమంగా ఇల్లు కట్టారని, అక్కడికి వెళ్లి అడిగితే చంపుతామని బెదిరించడంతో అన్నమయ్య జిల్లా రాయచోటి జేసీకి ఫిర్యాదు చేశామని, తరువాత మదనపల్లి సబ్ కలెక్టర్‌కు స్పందనలో అర్జీ ఇచ్చామని, ఈ భూ ఆక్రమణపై విచారించి భూమిని కబ్జా చేసిన వారిపై, కబ్జాకు సహకరించిన తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మజరా సుద్దగుంట గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ జి. మురళి గ్రీవెన్స్‌లో వాపోయాడు.
పశ్చిమగోదావరి జిల్లా విప్పారు గ్రామానికి చెందిన గుడిమెట్ల కోటయ్యకు చెందిన వ్యవసాయ భూమిని దేవాదాయ శాఖ బ్లాక్ లో పెట్టడంతో రిజిస్ట్రేషన్ కావడంలేదని, ఈ సమస్యను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఎండోమెంట్ కమిషనర్‌కు ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌కు 31 సేవల ద్వారా ఓ బ్యాంకు ఖాతాకు వచ్చిన వందల కోట్ల నిధులు అలాగే బ్యాంకులో ఉన్నాయని. దాన్ని పీడీ ఖాతాకు మళ్లించి గ్రామాలో అభివృద్ధి పనులకు ఆ డబ్బులను వినియోగించాలని గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి గ్రీవెన్స్‌లో నేతలకు వినతిని అందించాడు
బీ రూపశ్రీ అనే యువతి ఇచ్చిన వినతి పత్రంలో.. తాను ఎంబీఏ చదవాలనే కోరికతో ఐ సెట్ పరీక్ష రాస్తే 8,239 ర్యాంక్ వచ్చిందని, విజయవాడలోని పీబీ సిద్ధార్థ కాలేజీలో సీటు వచ్చిందని.. కాలేజీ వారు సీటుకోసం రూ. 80,000 వేలు ఫీజు అడుగుతున్నారని తెలిపింది. డైవర్‌గా పనిచేస్తున్న తన తండ్రి అంత డబ్బు కట్టలేక చదువు ఆపేయమని చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు చదువుకోవాలని ఉందని, శారీరక అంగవైకల్యంతో బాధపడుతున్న తన చదువుకు సాయం చేయాలని మంత్రిని ఆమె అభ్యర్థించారు. వెంటనే మంత్రి ఆమెకు రూ. 20,000 ఆర్థిక సాయం చేశారు.
గిద్దలూరుకు చెందిన ఓ వృద్ధుడు తన భూ సమస్యపై మంత్రికి మొరపెట్టుకోగా.. మంత్రి వెంటనే స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి ఫోన్ చేసి సమస్యను వివరించారు. బాధితుడి సమస్యను తెలియపరిచి సమస్యను పరిష్కరించాలని కోరారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాసాపేట గ్రామంలోని తన భూమి అన్యాక్రాంతం అయ్యిందని.. దానిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలంటూ పట్టణంలోని పాత రాయచోటికి చెందిన షేక్ సయ్యద్ బాష మంత్రికి విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి భూ సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తామని బాషకు హామీ ఇచ్చారు.
గత 20 సంవత్సరాలుగా సంఘమిత్రలుగా పనిచేస్తున్న తమని.. కింది స్థాయిలో నాయకులు తొలగించేందుకు ప్రయత్నిస్త్తున్నారని.. వైసీపీకి అనుకూలంగా ఉన్నవారిని అలాగే ఉంచి తమను తొలగించేందుకు యత్నిస్తున్నారని కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలానికి చెందిన సంఘమిత్రలు నేతల ముందు వాపోయారు. తమను తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని దయచేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు అభ్యర్థించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీలో ఎమ్‌డి జనరల్ మెడిసిన్ చదివిన తన కూతురు దొమ్మేటి తేజశ్రీకి గత ప్రభుత్వంలో ఫీజు రియింబర్స్‌మెంట్ రాలేదని.. తన కూతురు చదువుకోసం అప్పులు చేయాల్సివచ్చిందని.. తనకు ఎటువంటి స్థిరాస్తులు లేవని.. దయ ఉంచి తన కూతురుకు ఫీజు రీయింబర్స్ మెంట్ వచ్చేలా చూడాలని తేజశ్రీ తండ్రి రామోహనరావు గ్రీవెన్స్ లో అభ్యర్థించాడు.
2013లో రిటైరయిన తనకు రావాల్సిన సెటిల్‌మెంట్ బకాయిలు, ఇంక్రిమెంట్ బకాయిలు ఇంకా ఇవ్వలేదని… కాకినాడ డిపోకు వెళ్లి మేనేజర్‌ను ఎన్ని సార్లు అడిగినా పట్టించుకోవడంలేదని, దయ చేసి తనకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని రాజమండ్రికి చెందిన సూర్యచంద్రరావు అభ్యర్థించాడు. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం గాదెవారిపాలెం గ్రామానికి చెందిన గాదె సూర్యనారాయణ విజ్ఞప్తి చేస్తూ.. తాను టీడీపీ కోసం పనిచేస్తున్నానని, తనను వైసీపీలోకి మారమంటే మారకపోవడంతో తనకు రావాల్సిన వర్క్ బిల్లులు అడ్డుకున్నారన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, తన భూమిలో అక్రమంగా మట్టిని తవ్వేశారని తెలిపాడు. తన భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుని, తనకు రావాల్సిన బిల్లుల డబ్బులను ఇప్పించచాలని కోరాడు.