- చంద్రబాబును అపఖ్యాతిపాలు చేసే ప్రయత్నం
- జగన్‌రెడ్డినే ఈ సినిమా తీయించారు
- తెలంగాణా హైకోర్ట్ లో నారా లోకేష్ పిటీషన్
- ఈనెల 26వ తేదీన విచారణ
- విడుదలను నిలుపుదల చేస్తూ సివిల్ కోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్, చైతన్యరథం: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని అందులో కోరారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మలను ప్రతివాదులుగా చేర్చారు. చిత్రం విడుదల కాకుండా నిర్మాతను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 26న ఆ పిటిషన్ విచారణకు రానుంది. ‘‘ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి అంటే ఇష్టమని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ తనకు నచ్చరని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. తన ఇష్టాయిష్టాలతో సినిమాలోని పాత్రలను నిర్ణయించుకున్నారు. చంద్రబాబును తప్పుగా చూపించారు. ట్రైలర్‌లో చూపించిన విధంగానే సినిమా మొత్తం ఉండే అవకాశం ఉంది. 10ఏళ్ల జీవితంలో చంద్రబాబు నిబద్ధత, పారదర్శకతతో ఉన్నారు. ఈ సినిమాతో ఆయన్ను అపఖ్యాతి పాలుజేసే.. రాజకీయ శత్రువైన జగన్‌కు లబ్ధిపొందేలా చూస్తున్నారు. వాక్‌స్వాతంత్య్రం పేరుతో దర్శక నిర్మాతలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వీరి చర్యల వల్ల చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలగడంతో పాటు పార్టీ గౌరవం దెబ్బతింటోంది. వంగవీటి, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్… లాంటి చిత్రాల వల్ల దర్శక నిర్మాతలకు ఎలాంటి లాభాలు రాలేదు. అయినా మరోసారి అలాంటి సినిమానే నిర్మించారు. నష్టాలు వస్తాయని తెలిసినా కేవలం జగన్‌కు లాభం కలగడం కోసం తీశారు. జగన్‌మోహన్ రెడ్డి వెనక ఉండి ఈ సినిమాను తీయించారు’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. డిసెంబరు 29న సినిమాని విడుదల చేస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ ప్రకటించారు.
‘వ్యూహం’ చిత్రం విడుదల నిలుపుదల చేస్తూ సివిల్ కోర్టు ఉత్తర్వులు
వ్యూహం సినిమాను ఓటిటి, ఇతర ప్లాట్‌పామ్‌లలో విడుదలను నిలిపివేస్తూ హైదరాబాద్‌లోని సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహం సినిమా విడుదలను ఆపాలంటూ సివిల్ కోర్టులో నారా లోకేష్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై సివిల్ కోర్టు సినిమా విడుదలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన సివిల్ కోర్ట్ తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.