- ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలల అభివృద్ధి
- మంత్రి పార్థసారథి స్పష్టీకరణ
- ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి
నూజివీడు (చైతన్యరథం): ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. శనివారం ఏలూరు జిల్లా నూజివీడు ముడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి పార్థసారథి ప్రారంభించి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.28 కోట్ల రూపాయలను, వచ్చే ఆర్థిక విద్యా సంవత్సరం నుండి 86 కోట్ల రూపాయలను ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఖర్చు చేయనుందన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తోందన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు పొంది తద్వారా తమ కుటుంబాలను బాగా చూసుకోవాన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హజరుశాతం, ఫలితాల మెరుగుదలకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యానభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియేట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకాన్ని అమలు చేస్తోందన్నారు. ఏలూరు జిల్లాలో 19 జూనియర్ కళాశాలల్లో 3,734 మంది విద్యార్ధులు ఉన్నారని వారిలో నూజివీడు జూనియర్ కళాశాలలో 410 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను దిర్చిదిద్దేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఏపీ మోడల్ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, హైస్కూల్స్ ప్లస్ స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్న 2 లక్షల మందికి పైగా ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేసిందన్నారు.
భోదనా విధానాన్ని మెరుగుపర్చేందుకు జిల్లా, రీజనల్ స్ధాయిలో అకడమిక్, గైడెన్స్ అండ్ మోనిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేశారన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి ఎంసెట్, నీట్ పరీక్షల మెటీరియల్, ప్రాక్టికల్ రికార్డులు, పుస్తకాలు, ఇంటర్ విద్యార్ధులకు స్టూడెంట్ కిట్లను విద్యార్ధులకు అందజేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా మనబడి-మన భవిష్యత్ పథకం కింద రాష్ట్రంలో 447 కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 307.76 కోట్ల అంచనాలతో పనులను ప్రతిపాదించగా ఇందుకోసం ఇప్పటివరకు రూ. 169.69 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్ధాయి సంస్కరణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానున్నదన్నారు.
విద్యతోపాటు అనేక అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. రానున్న సంక్రాంతి నాటికి గుంతలు లేని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు రోడ్ల మరమ్మత్తు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. అదే విధంగా అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టును సందర్శించి నిర్వాసితులకు న్యాయం చేస్తామని చెప్పి నేడు ఆ మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారన్నారు. ఈ మేరకు సంక్రాంతి కానుకగా 10 వేల మంది పోలవరం నిర్వాసితులకు పరిహారంగా ఒకేరోజు రూ. 815 కోట్లు చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో డివిఇవో బి. ప్రభాకరరావు, కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.