అమరావతి (చైతన్యరథం): ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న అప్పులపై స్పష్టత ఇస్తున్నా అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నిజానికి చెల్లికి ఏ అన్న అయినా ఆస్తిలో వాటా ఇవ్వాలి. ఆస్తిలో వాటా తీసుకోవడం ఆడబిడ్డగా నా హక్కు. ఆడబిడ్డకు ఇవ్వాల్సిన బాధ్యత అన్నకు ఉంది. తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేది మేనమామే కనుక, మేనమామగానూ అన్నకు ఆ బాధ్యత ఉంటుంది. కాని `కొందరు చెల్లికివ్వాల్సిన వాటాను కూడా తమదిగా భావిస్తారు. ఇవ్వాల్సిన వాటాలో పిసరంత ఇచ్చి కూడా.. తామేదో చెల్లెళ్లకు కానుకగా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తారు. చెల్లెళ్లకు కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపిస్తారు. ఇది వాస్తవం. మా కుటుంబం మొత్తానికి తెలుసు, దేవుడికీ తెలుసు’ అని షర్మిల పరోక్షంగా జగన్ వైఖరిని ఎత్తిపొడిచారు. బాబాయి వివేకా అంశాన్ని ప్రస్తావిస్తూ ‘హంతకుడు అవినాష్ అని సీబీఐ చెబుతోంది. వైఎస్సార్, వైఎస్ వివేకాల ఆడబిడ్డలుగా న్యాయం కోసం సునీత, నేను పోరాడుతున్నాం. మా పోరాటం ఆస్తుల కోసం కాదు.. న్యాయం కోసం. రేపన్న రోజున మాకు, మా పిల్లలకు ఏమవుతుందో తెలియదు. మొండిగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం అని వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.