- పొలాలకు వెళ్లకుండా చూడాలి
- తీర, లంక గ్రామాల ప్రజలను తరలించాలి
- కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పంటలకు అధికనష్టం
- రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- ముంపు ప్రాంతాల్లో 175 వెటర్నరీ అంబులెన్స్‌లతో వైద్యశిబిరాలు
- 163 బోట్లతో 187 మంది మత్స్యకారులతో సహాయక చర్యలు
- వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖల అధికారులతో సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు
- విజయవాడ ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన
- వరదనీటిలో తిరుగుతూ బాధితులకు భరోసా
అమరావతి(చైతన్యరథం): భారీ వర్షాలు, పొంగుతున్న వాగులు, కాలువల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితిపై రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం అత్యవసర సమీక్షలు నిర్వహించారు. వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక శాఖల అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. కృష్ణా నదిలోకి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాలకు రైతులెవరూ వెళ్లవద్దని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉన్నట్లు వ్యవసాయ అధికారులు మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. ప్రాణహాని లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, నదీ పరివాహక ప్రాంతాల్లో, లంక గ్రామాల్లో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉండి రైతులకు సూచనలు ఇస్తూ పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనా వేయాలని మంత్రి ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ముంపు ప్రాంతాల్లో పర్యటన
విజయవాడ అజిత్‌సింగ్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు వాస్తవ పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వరద నీటిలోకి దిగి బాధితుల వద్దకు వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలందరికీ ఆహార పదార్థాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
సోమవారం సాయంత్రం సింగ్‌నగర్ వరద ముంపు ప్రాంతాల్లో మరొక మారు వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. వరద నీటిలోకి దిగి సహాయక చర్యల తీరు పరిశీలించి అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు తగు సూచనలు ఇచ్చారు. ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లో ఆహార పంపిణీ సక్రమంగా చేపట్టాలని, ముంపు ప్రాంతాల్లో చిక్కుకుని ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
అప్రమత్తంగా పశుసంవర్ధక, మత్స్య శాఖలు
మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతో పశు సంవర్ధక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 175 వెటర్నరీ అంబులెన్స్‌లతో వరద ఉధృతికి ఇబ్బందులు పడుతున్న పశువులకు వైద్యం చేయడంతో పాటు వరద ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాల ద్వారా పశువులకు వైద్య సేవలు అందిస్తోంది.
మత్స్యశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించడంతో పాటు వరద ముంపు ప్రాంతాల్లో 163 బోట్లతో 187 మంది మత్స్యకారులతో సహాయక చర్యలు చేపట్టారు.
పశువుల గల్లంతు విచారకరం
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి పెదలంకలో వరద ప్రవాహానికి 200 పాడి గేదెలు కొట్టుకుపోయిన దుర్ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల భారీ వర్షాలు, వరదల వల్ల 16 పశువులు, 64 గొర్రెలు, మేకలు, 34,500 కోళ్లు మృతి చెందాయని అధికారులు తెలిపారు. వరద ప్రవాహం పెరుగుతున్న ప్రాంతాల్లో నివాసాల నుంచి ఎవరూ బయటకు రావద్ధని మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలను కోరారు. వరద ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి రైతులు, పశువులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.