- పీహెచ్సీలపై ప్రత్యేక దృష్టి
- ఐదేళ్ళలో ప్రతి ఇంటికి తాగునీరు
- ఐటీడీఏలకు పూర్వ వైభవం
- ఉద్యాన పంటలకు ప్రోత్సాహం, పండ్ల పరిశ్రమల ఏర్పాటు
- సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారులు
- ప్రజా ప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
- మన్యం జిల్లా డీఆర్సీ సమావేశంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
పార్వతీపురం (చైతన్యరథం): ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషి, సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పార్వతీపురం మన్యం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పార్వతీపురం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ (డిఆర్సీ) సమావేశం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 33 శాతం గిరిజనులు ఉండే ఈ ప్రాంతం పూర్తిగా పేదరికంతో కూడిన జిల్లా అని తెలిపారు. ఇటువంటి జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా బాధ్యత తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటికీ చాలా గ్రామాలకు రహదారి సదుపాయం లేదని, ఆరోగ్యం బాగాలేకపోతే డోలీ మోతలు తప్పకపోవడం విచారకరమన్నారు. అన్ని మండలాల్లో రోడ్డు సదుపాయం లేని గ్రామాలను గుర్తించి, రానున్న రెండేళ్లలో అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన నిధులను సమకూరుస్తామని మంత్రి తెలిపారు.
ప్రతి గ్రామానికి ఆటో లేదా అంబులెన్సు వెళ్లేలా వసతులు కల్పిస్తామన్నారు. వీటితో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపైనా దృష్టి సారించాల్సి ఉందని, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సహకరిస్తే మార్పు తీసుకురాగలననే నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని, ఇందుకు అవసరమైన నిధుల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రారంభించి నిలిచిపోయిన పనులను ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా చేపడతామని అన్నారు. ముఖ్యంగా మధ్య, చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఇప్పటికే జిల్లాపై అవగాహన వచ్చిందని, ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి సమావేశాలు నిర్వహించడం వలన స్థానిక సమస్యలు కూడా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ద వహించి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా గుర్తుండిపోయే పనులను చేపడతామని మంత్రి వివరించారు.
సాగునీటి సమస్య పరిష్కారంపై దృష్టి
జిల్లాలో 15 మండలాలకు గాను 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ( పీహెచ్సీలు ) ఉన్నాయని, అవసరమైన పీహెచ్సీలు ఉన్నప్పటికీ, అందులో వైద్యులు, సదుపాయాలు, మందులు ఉండాలని, రోగులు వస్తే అవసరమైన చికిత్స అందించే పరిస్థితి ఉండాలని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పీహెచ్సీలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, వైద్యులు, మందులు, అంబులెన్సులు వంటి సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. రక్తహీనత లోపం జిల్లాలో ఎక్కువగా ఉందని, దీనిపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో ప్రతి ఇంటికీ తాగునీటి వసతి కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. జిల్లాలో రaంజావతి, తోటపల్లి, వంశధార, ఇతర నీటి వనరులు ఉన్నాయని, వాటిని సమగ్రంగా ఉపయోగించుకొని మన్యం జిల్లా తొలిస్థానంలో నిలవాలని, ఆ బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం జరుగుతోందని, రaంజావతికి అంతరాష్ట్ర సమస్య ఉందని, ఆ సమస్యను పరిష్కరించుకుని, ఎత్తిపోతల పథకాలపై దృష్టి సారిస్తే జిల్లాలో సాగునీటి సమస్య తీరుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. జిల్లాలో రెండు ఐటీడీఏలు ఉన్నప్పటికీ గత ఐదేళ్లలో పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని, వాటికి పునరుజ్జీవం తీసుకువస్తామని మంత్రి చెప్పారు. లాభసాటి ఉద్యానవన పంటలను ప్రోత్సహించి, పండ్ల పరిశ్రమలను స్థాపించి మరింత అధిక లాభాలు ఆర్జించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇక్కడ మామిడి, పైనాపిల్ వంటి పండ్ల రసాల తయారుచేసే పరిశ్రమలను నెలకొల్పాలని, ఇందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇప్పించి ఎంఎస్‌ఎంఈ లను ప్రోత్సహించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు తక్కువగా ఉన్నారని, పూర్తి స్థాయి అధికారులు కూడా లేరని, అందువలన అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉన్నందున, దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి వివరించారు. రూ. 850 కోట్లతో గుంతలు లేని రహదారుల నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని, ఈ పనులన్నీ సంక్రాంతి నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే విద్యపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గత ఐదేళ్లలో వేలాది పాఠశాలలు మూతపడ్డాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 17 డీఎస్సీలు జరిగితే, అందులో 11 డీఎస్సీలు టీడీపీ ప్రభుత్వమే నిర్వహించిందని తెలిపారు. మరో 5 మాసాల్లో మెగా డీఎస్సీ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. శ్రీకాకుళం సమగ్ర కలెక్టరేట్ భవనం మాదిరిగా జిల్లాలో కూడా కొత్త కలెక్టరేట్ నిర్మాణం జరగాలని, ఇప్పటికే కేటాయించిన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, అధికారుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దామని మంత్రి ఈ సందర్బంగా పిలుపు ఇచ్చారు. జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కళ్ళాల్లోని ధాన్యాన్ని తడవకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైతే రవాణా ఏర్పాట్లు చేసి మిల్లులకు తరలించాలని సూచించారు. మిల్లు యాజమాన్యం రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏనుగుల దాడితో రైతులు పండిరచిన పంటలు నష్టంపోకుండా తగిన చర్యలు చేపట్టాలని డీఎఫ్‌ఓను ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహల్లో ఉన్న పిచ్చి మొక్కలను ఉపాధిహామీ పథకం కింద తొలగించేలా చర్యలు చేపట్టాలని డ్వామా పీడీని ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లో ఉన్న వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య సహాయకుల పోస్టులను సంబంధిత శాఖల పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. త్వరలో వెటర్నరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేస్తామని, వెటర్నరీ బిల్డింగులను నాబార్డ్ నిధులతో నిర్మిస్తామని అన్నారు. జిల్లాలో సమీకృత భూసార పరీక్షా కేంద్రాన్ని, మత్స్య పెంపక కేంద్రాన్ని, జిల్లా కేంద్ర సహకార బ్యాంకును మంజూరు చేస్తామని పేర్కొన్నారు. సూపర్ – 6 హామీలన్నీ తప్పక అమలుచేస్తామని, త్వరలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తామని మంత్రి తెలిపారు. జిల్లాలో రూ. 140 కోట్లతో ఆధునిక వ్యవసాయ పనిముట్లను రైతులకు పంపిణీ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
అందరి సమన్వయంతో అభివృద్ధి: మంత్రి సంధ్యారాణి
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, రహదారులకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనల మేరకు ఇప్పటికే రహదారులతో పాటు ఇతర అభివృద్ధి పనులు గత ఆరు మాసాలుగా జరుగుతూ, జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు.
జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఇన్‌ఛార్జి మంత్రి సూచనలు, సలహాలతో జిల్లాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు కృషిచేస్తామని వివరించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక రాజేశ్వరి, ట్రైకార్ చైర్మన్ బొరగాం శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘురామరాజు, పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, పార్వతీపురం మునిసిపల్ చైర్మన్ బి. విజయగౌరి, జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి, జేసీ ఎస్‌ఎస్ శోబిక, సబ్ కలెక్టర్లు అశుతోష్ శ్రీవాస్తవ, సీ యశ్వంత్ కుమార్‌రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.