- ఇరవైనాలుగ్గంటలూ బుకింగ్‌కు అవకాశం
- వాగులు, వంకల్లోని ఇసుక స్థానికుల అవసరాలకే..
- అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు
- ఉచిత ఇసుక కొత్త పోర్టల్ ఆవిష్కరించిన సీఎం
అమరావతి (చైతన్యరథం): ఇరవైనాలుగు గంటలూ ఇసుక బుకింగ్‌కు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు అధికారులను అదేశించారు. ఎవ్వరైనా.. ఎక్కడినుండైనా.. ఏ సమయంలోనైనా ఇసుక బుకింగ్ చేసుకోగలిగేలా పోర్టల్ విధానాన్ని నవీకరించాలని సూచించారు. గురువారం సచివాలయంలో ఉచిత ఇసుక పంపణీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఇసుక నిర్వహణ విధానం నూతన పోర్టల్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేస్తూ ఇసుక బుకింగ్ విషయంలో ఎటువంటి సమయ నిబంధనలు అవసరం లేదన్నారు. పోర్టల్ ఆవిష్కరణ నేపథ్యంలో ఇసుక బుకింగ్‌కు సంబంధించి తదుపరి రోజుకు అందుబాటులోవున్న ఇసుక మాత్రమే బుక్ అవుతుందని అధికారులు వివరించగా, ప్రజల సౌకర్యార్ధం దానిని వారంరోజుల నిడివికి పొడిగించాలని ఆదేశించారు.
ఫలితంగా రానున్న వారం రోజుల్లో అందుబాటులోవున్న ఇసుకను ఎవరైనా బుక్ చేసుకునే వెసులుబాటు లభించినట్టయ్యింది. ఎప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని తక్షణ పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక హామీకి కట్టుబడి ఉందని, ఆక్రమంలోనే ప్రతి ఒక్కరూ ఇసుకను పొందగలిగేలా పారదర్శకతకు పెద్దపీట వేయాలని సూచించారు. మరోవైపు చిన్నవాగులు, వంకలలో ఉండే ఇసుక విషయంలో సమీప గ్రామాల ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. వారు తమ వ్యక్తిగత అవసరాల కోసం ఎటువంటి రుసుము చెల్లించకుండా ఇసుక తీసుకువెళ్లగలిగేలా నిబంధలను రూపొందించాలన్నారు. అక్రమ రవాణా మైనింగ్‌కు అవకాశంలేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ వ్యవస్ధను పటిష్టపర్చాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్ఫష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అబ్కారీ, గనుల మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇసుక సరఫరాకు సంబంధించి మూడోపార్టీ తనిఖీకి పెద్దపీట వేస్తున్నామని, ప్రతి అంశాన్నీ మూడో పార్టీ ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూనే ఉంటుందన్నారు. నూతన ఇసుక పోర్టల్ వల్ల వివిధ దశలలో అనుక్షణం నిఘా ఉంటుందని, అధికారులు మొదలు రవాణాదారుల వరకు ఏఒక్కరూ తప్పు చేయలేని విధంగా దీనిని రూపొందించామన్నారు. అయా జిల్లాలకు సంబంధించి కలెక్టర్ నేతృత్వంలోని జిల్లాస్ధాయి కమిటీలు స్థానిక వ్యవస్ధలను నియంత్రిస్తాయని తెలిపారు. పోర్టల్‌లో జిల్లాలవారీగా సరఫరా పాయింట్లు, రవాణచార్జీలు, ఆ రోజుకు అందుబాటులోవున్న ఇసుకవంటి వివరాలను చూపుతుందన్నారు. లారీల యజమానులు, మధ్యవర్తులు పేరిట వసూలు చేస్తున్న అధిక ధరలను నియంత్రించటానికి పోర్టల్ మార్గం చూపుతుందన్నారు. రవాణా కోసం లారీలను ఎంపానల్ చేస్తున్నామన్నారు. ఉచిత ఇసుక విషయంలో ప్రజలు ఎదుర్కునే ఇబ్బందులను టోల్‌ఫ్రీ నెంబర్ 1800-599-4599, ఈ మెయిల్ ఐడి dmgapsandcomplaints@yahoo.com ద్వారా కానీ ఫిర్యాదు చేయవచ్చని, ప్రతి ఫిర్యాదుపైనా తప్పని సరిగా చర్య తీసుకుని, సంబంధిత వ్యక్తులకు జిల్లా కలెక్టర్ల కార్యాలయాల నుండి తిరిగి సమాచారం అందిస్తారని సీఎంకు వివరించారు. ఉచిత ఇసుక ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావలన్న సీఎం మార్గనిర్దేశం మేరకు వ్యవహరిస్తున్నమన్నారు.
గనులు, భూగర్భ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ ఇసుక రవాణా లారీలకు జీపీఎస్ అనుసంధానం చేయటంవల్ల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయగలుగుతామన్నారు. ఫీడ్‌బ్యాక్ మెకానిజంకు పెద్దపీట వేసామని, ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా ఎప్పటికప్పుడు వినియోగదారుల నుండి స్పందన తీసుకుంటామన్నారు. రాష్ట్రమంతా ఒకేరీతిన రవాణా చార్జీలుండేలా చర్యలు తీసుకున్నామని, లారీల యజమనూలు నిర్దేశిత మొత్తంకంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకునేలా నిబంధనలను రూపొందించామని వివరించారు. అన్నిరకాల అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ పోలీసు యంత్రాంగం నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేసామని, పటిష్టంగా చెక్ పోస్టులను నిర్వహిస్తామని తెలిపారు. ఇసుక కొరత లేకుండా స్టాక్‌యార్డ్‌లలో లోడిరగ్ సామర్థ్యాన్ని పెంచడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. గనుల శాఖ సంచాలకులు ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఇసుక ఎగుమతి కేంద్రాలలో సీసీ టీవీ నిఘా ఉంచుతున్నామని ముఖ్యమంత్రి దృష్టకి తీసుకువచ్చారు. జిల్లాస్థాయి కమిటీలకు తగిన బాధ్యతలు, అధికారాలు అప్పగించామని పేర్కొన్నారు. పోర్టల్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎంఓ అధికారులు, గనుల శాఖ అధికారులు పాల్గొన్నారు.