- అన్నదాత సుఖీభవ పథకంపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన
- సాగుకు దన్నుగా..
- అన్నదాతకు అగ్రతాంబూలం
- రూ. 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
- రైతు కుటుంబాల్లో సంతోషమే సీఎం చంద్రబాబు ధ్యేయమని ఉద్ఘాటన
అమరావతి (చైతన్యరథం): దేశానికే అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నూ, దన్నూ వ్యవసాయమే. 62 శాతం జనాభాకు వ్యవసాయం, అనుబంధ రంగాలే ఆధారం. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేయగా కూటమి ప్రభుత్వం మాత్రం ఆన్నదాతకు బాసటగా నిలుస్తోంది. సోమవారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి చేసిన కేటాయింపులు అందుకు అద్దం పడుతున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం ముందుగా ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రూ.2.94 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తరువాత రూ.43,402.33 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. ప్రముఖ కవి గుర్రం జాషువా రైతు గురించి రాసిన పద్యంతో వ్యవసాయ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారన్నారు.
రైతు కుటుంబాల్లో సంతోషం నింపేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. అందుకు నిర్దిష్ట ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధే.. లక్ష్యంగా వ్యవసాయ బడ్జెట్ రూపొందించామని తెలిపారు. రైతుల పరిస్థితి మారాలని, రైతే రాజు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారన్నారు. ఆరుగాలం ఇంటిల్లిపాదీ శ్రమించి ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నకు మనసా, వాచా, కర్మణా శిరస్సు వంచి పాదాభివందనం జేస్తున్నా. అంధకారం అనే అగాధంలో పడిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపించేందుకు దార్శనికత కలిగిన నాయకుడు కావాలనే ప్రజలు చంద్రబాబును గెలిపించారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంకీర్ణ ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ కార్యక్రమం కింద రైతులకు ‘అన్నదాత సుఖభీభవ.. పీఎం కిసాన్ పథకం’లో ఏడాదికి రూ. 20 వేల చొప్పున (పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం అందించే రూ. 6000 ప్రయోజనంతో కలిపి)ఆర్థిక సహాయం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పథకం అమలుకు రూ.4,500 కోట్లు ప్రతిపాదించామన్నారు రాష్ట్రంలోని భూమిలేని సాగుదారులందరికీ ఆర్థిక సహాయం సంవత్సరానికి రూ.20 వేల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు నుంచి అందిస్తామన్నారు. ఈ అన్నదాత సుఖీభవ పథకం విధివిధానాలు, మార్గదర్శకాలపై ప్రభుత్వం త్వరలో ఆదేశాలు జారీ చేస్తుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది. ఏపీలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై 62 శాతం మంది ప్రజలు ఆధారపడ్డారు. గత ఐదేళ్లపాటు భూసార పరీక్షలను వైసీపీ ప్రభుత్వం విస్మరించింది. కనీసం రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందించలేదు. వైసీపీ హయాంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదు. రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో బాధ్యతను గాలికి వదిలేశారు. గతేడాది కరవు ప్రాంతాల్లో పంటల బీమా అందించేందుకు కూడా వైసీపీ ప్రభుత్వానికి మనసు రాలేదని అచ్చెన్నాయుడు అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతు అభ్యున్నతే లక్ష్యంగా భావించింది. అందుకే వ్యవసాయ రంగం మేలుకు సంబంధించి అనేక చర్యలు చేపట్టింది. భూసార పరీక్షా పత్రాల జారీ, పొలం పిలుస్తోంది వంటి కార్యక్రమాలు చేపట్టాం. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగాహన, శిక్షణ కల్పిస్తున్నాం.
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశాం. వడ్డీ లేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యమిస్తాం. రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో భూసార పరీక్షలు నిర్వహిస్తాం. అలాగే మట్టి నమూనాల కోసం ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. సాగుకు సూక్ష్మ పోషకాలు అందిస్తాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం.. వ్యవసాయ రంగానికి నిర్దిష్ట ప్రణాళిక అవసరం. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు బాగా కురిసి పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ సాయం పెంచాం. రైతులకు నెల రోజుల్లోనే నగదు చెల్లించేందుకు కంటి మీద కునుకు లేకుండా పని చేశాం. పెట్టుబడి సాయం పెంచి నెల రోజుల్లోనే రైతులకు అందించామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.
వ్యవసాయ బడ్జెట్‌లో డిజిటల్ వ్యవసాయానికి రూ.44.77 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు, వడ్డీలేని రుణాలకు రూ.628 కోట్లు, అన్నదాత సుఖీభవకు రూ.4500 కోట్లు, రైతు సేవా కేంద్రాలకు రూ.26.92 కోట్లు కేటాయించారు. భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు, విత్తనాలు పంపిణీకి రూ.240 కోట్లు, ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు, పొలం పిలుస్తోందికి రూ.11.31 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ.422.96 కోట్లు కేటాయించినట్లు మంత్రి తన బడ్జెట్ ప్రవసంగంలో తెలిపారు.
ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా తక్కువ ధరకే ఎరువుల పంపిణీ చేస్తున్నామని వివరించారు. అలాగే 2024-25లో ప్రభుత్వం వ్యవసాయ రుణాల కోసం రూ.2,64,000 కోట్లు (పంట రుణాల కింద రూ. 1లక్ష 66 వేల కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కింద రూ. 98 వేల కోట్లు) అందించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇప్పటివరకు పంట రుణాల కింద రూ.1,03,649 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో సహా వ్యవసాయ టర్మ్ రుణాల కింద రూ.66,148 కోట్లు మొత్తం రూ.1,69,797 కోట్లు పంపిణీ చేశారన్నారు.
కౌలు రైతులకు తమ ప్రభుత్వం 9.08 లక్షల పంట సాగుదారుల హక్కుల కార్డుల్ని (సీసీఆర్‌సీ) జారీ చేసిందన్నారు. తద్వారా కౌలు రైతులకు 11 నెలల పాటు పంటపై హక్కులను కల్పించడం, పంట రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత పొందేందుకు వీలు కల్పించిందన్నారు. 2024-25లో సం.లో సీసీఆర్‌సీలు పొందిన కౌలు రైతులకు రూ. 1443 కోట్ల పంట రుణాలు పంపిణీ చేశామన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడానికి.. అర్హులైన కౌలు దారులందరికీ కౌలుదారు గుర్తింపు కార్డులను జారీ చేసేందుకు కొత్త సాగుదారుల హక్కుల చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు.
రూ.3 లక్షల వరకు పంట రుణాలు పొంది, నిర్ణీత వ్యవధి ( ఒక ఏడాది)లో తిరిగి చెల్లించే అర్హులైౖన రైతులందరికీ 2024-25 నుంచి వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వడ్డీ రాయితీ నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. చిన్న సన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించడం, రైతులను అప్పుల ఊబిలో పడకుండా కాపాడటం ఈ పథకం ముఖ్యఉద్దేశ్యం అన్నారు.
2024-25 వ్యవసాయ బడ్జెట్ – రూ.43,402.33 కోట్లు
`అన్నదాత సుఖీభవ `రూ.4,500 కోట్లు
`ఉద్యానశాఖ `రూ.3,469 కోట్లు
`వ్యవసాయశాఖ `రూ.8,564 కోట్లు
` వ్యవసాయ యాంత్రీకరణ `రూ.187.68 కోట్లు
`వడ్డీ లేని రుణాలు `రూ.628 కోట్లు
`రైతు సేవా కేంద్రాలు `రూ.26.92 కోట్లు
`ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ `రూ.44.03
` పంటల బీమా `రూ.1,023 కోట్లు
`పట్టు పరిశ్రమలు `రూ.108 కోట్లు
`వ్యవసాయ మార్కెటింగ్ `రూ.314.80 కోట్లు
`సహకార శాఖ `రూ.308.26 కోట్లు
`పొలం పిలుస్తోంది కార్యక్రమం `రూ.11.31 కోట్లు
` రాయితీ విత్తనాలు `రూ.240 కోట్లు
`ఎరువుల సరఫరా `రూ.40 కోట్లు
`ప్రకృతి వ్యవసాయం `రూ.422.96 కోట్లు
`డిజిటల్ వ్యవసాయం `రూ.44.77 కోట్లు
`ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ `రూ.507 కోట్లు
`ఉద్యాన వర్సిటీ `రూ.102.22 కోట్లు
`ఎస్వీ పశు విశ్వవిద్యాలయం `రూ.171.72 కోట్లు
`మత్స్య విశ్వవిద్యాలయం `రూ.38 కోట్లు
`పశుసంవర్థకశాఖ `రూ.1095.71 కోట్లు
`మత్స్యరంగ అభివృద్ధి `రూ.521.34 కోట్లు
`వ్యవసాయ ఉచిత విద్యుత్ `రూ.7,241.30 కోట్లు
`ఉపాధి హామీ అనుసంధానం `రూ.5,150 కోట్లు