- రూ.60 కోట్ల మేర అవినీతి
- సహకరించిన అధికారులు, కమిషనరేట్ కీలక అధికారి
- బదిలీల్లో అవకతవకలపై విచారించి చర్యలు తీసుకోవాలి
- అవినీతికి పాల్పడిన వారందరూ జైలుకెళ్లక తప్పదు
అమరావతి(చైతన్యరథం): టీచర్ల బదిలీలలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, పార్టీ నేతలు డిమాండ్ చేశారు. బదిలీల పేరుతో కోట్లు దండుకున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన పీఏ, సహకరించిన అధికారులపై విచారణ చేపట్టి అరెస్ట్ చేయాలన్నారు. ఈ మేరకు సోమవారం ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ…గత నెల 13న జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఛీ కొట్టి టీడీపీ కూటమిని అఖండ మెజార్టీతో గెలిపించారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన, ఆయన పేషీలోని అధికారులు, కమిషన్ కార్యాలయ ఉద్యోగులు బదిలీల పేరుతో ఒక్కొక్క టీచర్ నుండి మూడు నుండి ఆరు లక్షల వరకు వసూళ్లకు పాల్పడి దాదాపు 60 కోట్ల రూపాయలు దండుకున్నారు. బిడ్డలకు చదువు చెప్పి భావి భారత పౌరులుగా తీర్చి దిద్ది, నీతి, అవినీతికి తేడాలు తెలియజేసి సంస్కారవంతులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను సైతం మోసం చేయడం సిగ్గుచేటని వర్ల రామయ్య దుయ్యబట్టారు.
ఇంత దోపిడీనా?
జగన్ రెడ్డి పాల్పడిన కుంభకోణాలతో పోలిస్తే ఇది పెద్దది కాకపోవచ్చు కానీ.. విద్యాశాఖలో ఇంత దోపిడీ ఎప్పూడూ జరగలేదు. టీచర్లు లబోదిబోమంటున్నారు. ఎన్నికల కోడ్ వచ్చాక కూడా లంచాలు తీసుకుని టీచర్లను బదిలీ చేసి, ఎన్నికలు అయ్యాక కొత్త స్థానాల్లో చేరాలని చెప్పారు. ఎన్నికలు అయ్యాక కొత్త గవర్నమెంట్ వచ్చి, టీచర్ల బదిలీల్లో అవినీతి జరిగినట్లు గుర్తించింది. దీంతో టీచర్ల బదిలీలు నిలిచిపోయాయి. ఇప్పుడు టీచర్లు గగ్గోలు పెడుతున్నారు. బదిలీల పేరుతో మోసపోయిన దాదాపు 1600 మంది టీచర్లు ఇప్పుడు వారి నుండి దోచుకున్న మంత్రి, మంత్రి పీఏ, కమిషనరేట్‌లో కిలకమైన అధికారి ఇళ్లపై దాదాపు దాడి చేసే పరిస్థితి వచ్చిందని వర్ల అన్నారు.
జైలుకు వెళ్లక తప్పదు
ఆ కుంభకోణంపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరేందుకు ఏసీబీ డీజీ కార్యాలయానికి వచ్చాం. కానీ ఆయన లేరు. ఏసీబీ ఎస్పీ రవి ప్రకాశ్ మా ఫిర్యాదు తీసుకుని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బదిలీలు జరిగిన టీచర్లను ఒక్కొక్కరిని విచారిస్తే వాళ్లే మాజీ మంత్రి బొత్స, ఆయన పీఏ, కమిషనరేట్ లోని కీలక అధికారి బాగోతం బయటపెడతారు. ఈ విచారణకు పెద్ద అధికారులు కూడా అవసరంలేదు ఒక ఎస్సై సరిపోతాడు. వారం రోజుల్లో బొత్స సంగతి తేలిపోతుంది. టూరిజం శాఖలో అవినీతిపై కూడా ఫిర్యాదు చేస్తాం. మంత్రులుగా ఉండి అవినీతికి పాల్పడిన వారందరూ జైలుకు వెళ్లక తప్పదు. అవినీతికి పాల్పడిన ఏ మంత్రినీ వదిలేది. లేదు. మహిళామంత్రైనా సరే జైలుకు పోవాల్సిందే. అన్ని బయటకు వస్తాయి.. ఈ అవినీతి తెలిసే రాష్ట్ర ప్రజలు వైసీపీ నేతలను తరిమి తరమి కొట్టారు. చట్టపరిధిలో దర్యాప్తు జరుగుతుంది. ఏపీసీ, సీఐడీలు వైసీపీలో లాగా పనిచేయవు. అవినీతి రుజువై వైసీపీ నేతలు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.
ఫిర్యాదు చేసిన వారిలో టీడీపీ అధికార ప్రతినిధి షేక్ రఫీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్ బాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్ , విజయవాడ కార్పొరేటర్ మల్లికార్జున్ రావు, పార్టీ నాయకుడు వల్లూరి కిరణ్, తదితరులు ఉన్నారు.