- ఏపీకి కేంద్రం పంపిన 5 లక్షల టన్నుల రేషన్ బియ్యం పేదలకు పంచలేదని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పార్లమెంటులో చెప్పింది నిజం కాదా?
- కాకినాడలో 4 వేల ఎకరాలు రూ.12 కోట్లకు ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తారా?
- జగన్ పాలనలో ధాన్యం బకాయిలు మూడు నెలలకు చెల్లింపు
- చంద్రబాబు పాలనలో 48 గంటల్లోనే ధాన్యం బకాయిలు చెల్లింపు
చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హమీలు అమలు చేయలేదని వర్ధెల్లి మురళి 8.12.2024 ఆదివారం సాక్షిలో వ్యాసం రాశారు. ఇది మొదటి అబద్ధం. మొదటి ఆరు నెలల్లో జగన్ పింఛన్లు రూ.250లు మాత్రమే పెంచగా, చంద్రబాబు ఒకేసారి రూ.1000 పెంచి 1వ తేదీనే ఇళ్ల వద్ద ఇస్తున్నారు. అలాగే 198 అన్న క్యాంటీన్లు పెట్టి పేదల ఆకలి తీరుస్తున్నారు. 50 లక్షల మందికి పైగా ఉచిత గ్యాస్ నమోదు చేసుకున్నారు. ధాన్యం కొన్న 48 గంటల్లోనే రైతు అకౌంట్‌లో నగదు జమ చేస్తున్నారు. రూ.861 కోట్లతో రోడ్ల గుంతలు పూడుస్తున్నారు. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలు, 6100 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. ఆరు నెలల్లోనే రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలు స్థాపించబోతున్నారు. కేంద్రం నుండి అమరావతికి రూ.15 వేలకోట్లు, పోలవరానికి రూ.12 వేల కోట్లు సాధించారు. ఇలా ఆరు నెలల్లోనే 300కు పైగా పనులు చేసిన మంచి ప్రభుత్వం ఇది. జగన్ ప్రభుత్వం మొదటి ఆరు నెలల్లో రెండు హామీలే అమలు చేసిందిగాని నవరత్న హామీలన్నీ అమలు చేయలేదు. పైగా అన్న క్యాంటీిన్లు, చంద్రన్న బీమా, నిరుద్యోగ భృతి, పండుగ కానుకలు, విదేశీ విద్యలాంటి చంద్రన్న పథకాలు నూటికిపైగా రద్దు చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్లు జగన్ దారి మళ్లించాడు. హామీలు ఎగవేసింది జగనేగాని చంద్రబాబు కాదు.
‘‘ఆరుగాలం కష్టపడి పండిచిన ధాన్యాన్ని రాసులు పోసుకున్న రైతుల కళ్లల్లో దైన్యాన్ని చూస్తున్నా’’మని మురళి రాసింది రెండో అబద్ధం. మద్దతు ధర 75 కేజీల ఏ గ్రేడ్‌కు జగన్ పాలనలో రూ.1,652 ఇచ్చారు. కొన్న ధాన్యానికి నగదు చెల్లింపులకు మూడు నెలలకు పైగాపట్టేది. చంద్రబాబు పాలనలో మద్దతు ధర రూ.1,740లకు పెంచారు. కొన్న ధాన్యానికి 48 గంటల్లోనే నగదు చెల్లిస్తున్నారు. ఆనాడు టార్పాలిన్ ఇవ్వలేదు. దూరంగా ఉన్న మిల్లులకు ధాన్యాన్ని పంపేవారు. సరిపడా గోనె సంచులు ఇవ్వలేదు. వాహన రవాణా, హమాలీల ఖర్చులు పెంచారు. జగన్ పాలనలో మిల్లర్లు దళారుల ద్వారా రూ.10 వేలనుండి రూ.20 వేల వరకు అదనంగా వసూలు చేసుకునేవారు. టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసినా స్పందించేవారు కాదు. తేమ పేరుతో నెల్లూరులో క్వింటా ధాన్యంపై అదనంగా 20 కిలోలు తీసుకునేవారు. దగ్గరలో మిల్లులున్నా ఆర్బీకే సిబ్బంది దూరంగా వున్న మిల్లులకు కేటాయించేవారు. 2021-22 రబీ కొనుగోళ్లలో ఫేక్ అకౌంట్లు సృష్టించి రూ.150 కోట్లు దుర్వినియోగం చేశారని సివిల్ కార్పొరేషన్ ఎండీ వీరపాండ్యన్ ధృవీకరించారు. జులై 19, 2022న వీరపాండ్యన్ జిల్లా కలెక్టర్‌కు రాసిన లేఖలో ఆ సొమ్మును రికవరీ చేయాలని కోరారు. జగన్ పాలన మొదటి ఏడాది 2019-20 ఖరీఫ్‌లో 82 లక్షల ధాన్యం ఉత్పత్తి జరగగా, అది 2023-24 నాటికి 71 లక్షల టన్నులకు అంటే 11 టక్షల టన్నుల ఉత్పత్తి పడిపోయింది. ధాన్య సేకరణ 2019-20లో 47 లక్షల టన్నులు సేకరించగా, అది 2023-24కు 29 లక్షలు అంటే 18 లక్షల టన్నులకు కోత కోశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం చేశారు. జగన్ పాలనలో ఒక టన్నుపై రైతు రూ.6,000 నష్టపోయారు. జగన్ ఐదేళ్ల పాలనలో సుమారు 200 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, అందులో రూ.12 వేల కోట్లు వైసీపీ నేతలు, మిల్లర్లు దోపిడీ చేశారు. ప్రకృతి విపత్తు జరిగితే హెక్టారుకు కేవలం రూ.10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ రకంగా దగా చేయబట్టే జగన్ పాలనలో రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 3వ స్థానానికి ఎగబాకింది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీని దేశంలో మొదటిస్థానంలో పెట్టారు.
చంద్రబాబు పాలనలో ధాన్యం ఉత్పత్తి ఈ ఖరీఫ్‌లో తిరిగి 80 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. గత ఏడాది ఈ సమయానికి జగన్ ప్రభుత్వం 5 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే 14 లక్షల టన్నులు సేకరించింది. 48 గంటల్లోనే రైతుల అకౌంట్లలో నగదు వేసింది. టార్పాలిన్స్, గోనె సంచులు, హమాలీలు, రవాణా చార్జీలు కూడా ప్రభుత్వం తిరిగి ఇస్తోంది. రైతుకు అందుబాటులో ఉన్న మిల్లులకు ధాన్యాన్ని సరఫరా చేస్తున్నారు. తేమ 20 శాతం ఉన్నా కొనుగోలు చేస్తున్నారు. చాలా చిన్న చిన్న సమస్యలు తప్ప రైతులు సంతోషంగా ఉన్నారు. ప్రకృతి విపత్తుల్లో హెక్టారుకు రూ.25 వేలు పెంచి ఇస్తున్నారు. ఆక్వాకు రూ.1.50లకే యూనిట్ విద్యుత్ ఇస్తున్నారు. మోటార్లకు మీటర్లు రద్దు చేశారు. అన్ని రిజర్వాయర్లు భర్తీ చేశారు. నేడు చంద్రన్న పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు. వర్ధెల్లి మురళి రాసిందంతా అబద్ధం.
‘‘సీజ్ ద షిప్పులో ఉన్న 640 టన్నుల బియ్యం విలువ దాదాపు రూ.2 కోట్లేన’’ని అదో లెక్క కాదు అన్నట్టు వర్ధెల్లి మురళి కొండంత అవినీతిని గులకరాయిగా చూపుతూ.. మూడో అబద్ధం రాశారు. జగన్ ఐదేళ్ల పాలనలో రూ.42 వేల కోట్ల బియ్యం ఎగుమతులు జరిగాయి. అందులో రూ.7 వేల కోట్ల కుంభకోణం జరిగిందని టీడీపీ ఎన్నికలకు ముందే రుజువు చేసింది. లోక్‌సభ స్టార్ట్ క్వశ్చన్ 248, 3.8.2022లో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఇచ్చిన సమాధానం ప్రకారం కేంద్రం పంపిన రేషన్ బియ్యంలో 5,65,964 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పేదలకు పంచలేదు. ఈ 5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కేంద్రం పంపిన బియ్యాన్ని జగన్ రేషన్ బియ్యం మాఫియా ఏంచేసింది? ఇది కుంభకోణం కాదా? ఇలా జగన్ పాలనలో రూ.7 వేల కోట్ల కుంభకోణం జరిగింది. కాకినాడ పోర్టు నుండి 2018-19లో 18 లక్షల టన్నులు ఎగుమతి కాగా, జగన్ పాలనలో అది 2020-21లో 31 లక్షల టన్నులకు, 2021-22లో 48 లక్షల టన్నులకు ఎలా పెరిగింది? రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి ఈ కాలంలో తగ్గింది. మరి ఎగుమతులు ఎలా పెరిగాయి? ఇది కుంభకోణం కాదా?
‘‘బెదిరింపులు ఎదురైవుంటే కేవీ రావు కేసు పెట్టలేనంతటి అర్బకుడని ఎవరు నమ్ముతారు’’ అని మురళి కుతంత్రపు లాజిక్ లేవనెత్తారు. ప్రశ్నించిన చిన్నాన్ననే గొడ్డలికి బలి పెట్టారు. కెవి రావు ఆనాడు ఎదురుతిరిగి కేసు పెట్టివుంటే ఆయన నేడు ప్రాణాలతో ఉండి ఉండేవాడా? కాకినాడలో 4 వేల ఎకరాలు రూ.12 కోట్లకు ఏ అమాయకుడైనా స్వచ్ఛందంగా ఇస్తాడా? గొంతుపై గన్ను పెట్టి రూ.6 వేల కోట్ల పోర్టు, సెజ్ భూముల్ని రూ.506 కోట్లకు కబ్జా చేశారు. సాధారణ చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయసాయిరెడ్డి నేడు వేల కోట్లకు ఎలా ఎగబాకారు? 2004లో రూ.2 కోట్ల ఆస్తులు చూపిన జగన్ నేడు లక్షల కోట్లకు ఎలా ఎగబాకారో మురళి సమాధానం చెప్పగలరా? అబద్ధాలు, బెదిరింపులతో ఎల్లకాలం రాజకీయాల్లో నిలబడలేరు. దోపిడీ, నేరాల తీరు మార్చుకొని నిర్మాణాత్మక రాజకీయాలు చేయకపోతే వైసీపీ భవిష్యత్ అంధకారమే.
`గురజాల మాల్యాద్రి
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్