‘జగన్‌ను వ్యక్తిత్వ హననం చేయడానికి ఒక బలమైన వర్గం పదమూడేళ్లుగా మీడియారంగంలో బ్రూటల్ డామినెన్స్‌ను ఏర్పాటు చేసుకోగలిగింద’ని వర్ధెల్లి మురళి 1.12.2024 ఆదివారం సాక్షి పత్రికలో రాసిన సుదీర్ఘ వ్యాసం, దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా ఉంది. సాక్షి మీడియాను దోపిడీ దుడ్డుతో స్థాపించారు. రాజకీయ ముసుగులో జగన్ చేస్తున్న దోపిడీ, నేరాలను ప్రశ్నిస్తున్న మీడియా సంస్థల, రాజకీయ పార్టీ నేతల, చివరకు న్యాయమూర్తుల శీలహననం చేస్తున్నది జగన్ మీడియానే. దోపిడీ చేసిన డబ్బు వెదజల్లి సోషల్ మీడియాలో వందల, వేల సంఖ్యలో సైకో సైన్యాన్ని ఏర్పరచుకున్నారు. వందలాది సోషల్ ఛానల్స్‌ను కొనేశారు. కొన్ని జాతీయ మీడియా సంస్థలకు తాయిలాలు వెదజల్లి వశపర్చుకున్నారు. ఇలా మీడియాలో బ్రూటల్ డామినెన్స్ ఏర్పాటు చేసుకొని చంద్రబాబు, రామోజీరావు, వేమూరి రాధాకృష్ణ, బీఆర్ నాయుడుల వ్యక్తిత్వాల హననమే సింగిల్ పాయింట్ ఎజెండాగా.. ధారావాహికంగా అబద్ధాలు రాస్తున్నది జగన్ మీడియానే. తమ దుష్ట లక్షణాల్ని ఎదుటివారికి అంటగట్టి.. రాయించిన అబద్ధమే వందసార్లు రాయించడం జగన్ నైజం. రామోజీరావు సంస్థలన్నీ సుదీర్ఘ కాయకష్టంతో, విలువలతో వ్యాపారం చేసి ఎదిగాయి. జగన్ తన దోపిడీ, నేరాలతో అమాంతం ఎదిగారనేది జగమెరిగిన సత్యం. దివంగతులైన రామోజీరావు వ్యక్తిత్వాన్ని నేటికీ హననం చేస్తున్నది సాక్షి మీడియానే. స్వర్గీయ రామోజీరావు వ్యక్తిత్వాన్ని అవినీతి సాక్షి ఏనాటికి దహించలేదు. ఆయన పద్మవిభూషణుడిగా, ప్రజాస్వామ్య యోధుడిగా వెలుగొందుతూనే ఉంటారు.
చంద్రబాబు చేసిన సైబరాబాద్ సృష్టిని, స్థాపించిన విద్యుత్ ప్లాంట్లు, పట్టిసీమ, కియా పరిశ్రమ, డ్వాక్రా వ్యవస్థ, పింఛన్ల పెంపు, అమరావతి, పోలవరం, చేసిన సామాజిక న్యాయం చెరిపేస్తే చెరిగేవి కాదు. అసెంబ్లీలో భువనమ్మ వ్యక్తిత్వాన్ని హననం చేయిస్తూ రాక్షసానందం పొందింది జగనే. చివరకు తల్లి, చెల్లి వ్యక్తిత్వ హననం చేసిన దుర్మార్గుల్ని వెనకేసుకొస్తున్నది ఎవరు? వ్యక్తిత్వ హనన చేష్టలు, కుల, మత, ప్రాంతీయ విద్వేషాలపై ఆధారపడిరది జగన్ పార్టీనే. నీతిపరులైతే సీబీఐ కోర్టు వాయిదాలకు హాజరై తీర్పు పొందకుండా.. 11 ఏళ్ల నుంచి ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు? దోపిడీదారుడు, నేరస్థుడు తన వ్యక్తిత్వాన్ని తానే ధ్వంసం చేసుకుంటాడు. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని రక్షించి జగన్ తన వ్యక్తిత్వాన్ని తానే హననం చేసుకున్నారు.. అంతేకానీ మరెవ్వరూ చేయలేదు. ప్రజాస్వామ్య మీడియా విలువల్ని, చంద్రబాబు వ్యక్తిత్వాన్ని, నీలి మీడియా బ్రూటల్ డామినెన్స్ ఏమీ చేయలేవని ఇప్పటికే చరిత్ర నిరూపించింది. దోపిడీ, నేరమయ అబద్దాల ప్రచార విధానాలు మానుకొని నిర్మాణాత్మక రాజకీయాలవైపు మారకపోతే జగన్‌తో పాటు ఆయనను నమ్ముకున్నవారు సైతం రాజకీయంగా మునిగిపోక తప్పదు.
సెకీ ఒప్పందంపై రాసినవి కూడా అబద్ధాలే. మొదటిది 2021 జనవరిలో గుజరాత్‌తో రూ. 1.90లకు సెకి ఒప్పందం చేసుకున్నది. 2021 డిసెంబర్‌లో అదే సెకితో రూ. 2.49లకు జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం ముడుపుల కోసం కాకపోతే మరేంటి? ఇతర రాష్ట్రాల ఒప్పందాలతో పోల్చుకుంటే చంద్రబాబు ప్రభుత్వం తక్కువ రేట్లకే ఒప్పందం చేసుకున్నది. ఇక రెండోది.. చంద్రబాబు ప్రభుత్వం 2014-19 మధ్య 7,500 మెగావాట్ల సామర్థ్యం గల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు రాయలసీమలో స్థాపించి స్థానికులకు 13వేల ఉద్యోగాలు కల్పించింది. ఈ విద్యుత్ ప్లాంట్ల స్థాపనవల్ల రాయలసీమ రైతుల భూములకు విలువ పెరిగింది. ప్రభుత్వానికి పన్నులు వచ్చాయి. రాజస్థాన్ ప్లాంట్లలో తయారయ్యే 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు వల్ల విద్యుత్ వినియోగదారులపై లక్ష కోట్ల భారం పడుతుంది. రాయలసీమ రైతుల భూములకు విలువ పెరగదు. స్థానికులకు ఉద్యోగాలు రావు. రూ.1,750 కోట్ల కమిషన్‌కు కక్కూర్తి పడి ఇంత భారీగా రాష్ట్రంపై విద్యుత్ భారాలు మోపడమేకాక రాయలసీమకు కూడా ద్రోహం చేశారు. రాజస్థాన్ నుండి ఏపీకి తెచ్చే సోలార్ విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లాస్ తదితరాలు ఉండవని చెప్పడం అబద్ధమే. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు ఈ అదనపు చార్జీల విషయంపై లెటరు రాసింది నిజం కాదా? అన్నీ కలిపి ఒక యూనిట్ రూ.5లు అవుతుందనేది నిజం. అమెరికాకు చెందిన ఎస్‌ఈసి రిపోర్ట్ పేరా 80నుండి 84 వరకు లంచాల విషయం ఏపీ ముఖ్య నేత విషయం రాయబడి ఉన్నది నిజం కాదా? ఎస్‌ఇసికి ఎందుకు పరువు నష్టం నోటీసు ఇవ్వలేదు? ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఇచ్చిన లీగల్ నోటీసు గుడ్డి బెదిరింపు కాదా?
సింహాలు తాటాకు చప్పుళ్ళకు భయపడతాయా!
హామీల అమలులో వైఫల్యం డైవర్షన్ కోసమే. జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారనే మురళి పాచి పాట కూడా అబద్ధమే. జగన్ ప్రభుత్వం మొదటి ఐదు నెలల్లో పింఛను రూ.250, డ్రైవర్లకు 10 వేలు మినహా ఏ ఇతర నవరత్న హామీలను అమలు చేయలేదు. పైగా అన్న క్యాంటిన్లు, నిరుద్యోగ భృతి, పండగ కానుకలు, పెళ్లి కానుకలు లాంటి 120 చంద్రబాబు ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని జగన్ రద్దు చేశారు. ఖజానాను జగన్ దివాళా తీయించినా చంద్రబాబు తన అనుభవంతో ఐదు నెల్లోనే ఒకే దఫా రూ.1,000 పింఛన్ పెంచి ఇస్తున్నారు. 198 అన్న క్యాంటిన్లను ప్రారంభించారు. ఇప్పటికే 50 లక్షల మంది ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నారు. రూ.4,500 కోట్ల ఖర్చుతో 16 వేల పంచాయతీల్లో పనులు చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన రోడ్లు, గుంతలు పూడుస్తున్నారు. ధాన్యం బకాయిలు చెల్లించడమే కాక, తాజాగా కొన్న ధాన్యానికి 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్నారు. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు.
పోలవరం, అమరావతికి కేంద్ర నిధులు సాధించారు. విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వం కాపాడిరది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. వరద సమయంలోనే తుంగభద్ర గేటు బిగించి రాయలసీమకు నీటి భద్రత కల్పించడమైంది. 16,347 ఉపాధ్యాయ నియామకాలు, 6,100 పోలీసు ఉద్యోగ నియామకాలకై లోకేష్ కృషి చేస్తున్నారు. ఇలా ఆరు నెలలు కూడా నిండకముందే 300లకు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు ప్రభుత్వం చేయడం ఒక రికార్డు. కూటమి ప్రభుత్వ వైఫల్యం చెందిందనేది పచ్చి అబద్ధం. కుంభకోణాల నుండి డైవర్షన్ చేస్తున్నది వైకాపానే. ప్రతిపక్ష నేతగా, కుటుంబ పెద్దగా వైఫల్యం చెందింది జగనే!!
– గురజాల మాల్యాద్రి