- కేసులో ఏ2గా వేముల దుర్గారావు
- సతీష్ మైనర్ అంటూ న్యాయవాది వాదన
- ఆధార్ ప్రాతిపదిక తీసుకోవాలని అభ్యర్థన
- మున్సిపల్ సర్టిఫికెట్‌ను పరిగణించిన కోర్టు
- పోలీస్ అదుపులో ఆరుగురు కాలనీవాసులు
- వాళ్లను బహిర్గతపర్చమంటూ మరో పిటీషన్
- నిన్నటి వైసీపీ స్క్రిప్ట్‌కు తాజా పోలీస్ ట్విస్ట్
- పోలీస్ రిపోర్టును ఈసీకి నివేదిస్తున్నామన్న మీనా
- జగన్‌పై రాయి కేసు కొలిక్కివచ్చినట్టేనా?
అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి జగన్‌పై రాయి విసిరిన కేసులో అనుమానితుడుగావున్న సతీష్ అరెస్టయ్యాడు. సతీష్‌ను లోతుగా ప్రశ్నించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేస్తూ గురువారం మధ్యాహ్నం విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరుపర్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సతీష్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇరువర్గాల తరపున కోర్టులో వాదనలు జరిగాయి. అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని, అతనికి నేర చరిత్ర లేదని నిందితుడి తరఫు న్యాయవాది సలీం వాదించారు. రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెడతారా? అని వాదిస్తూ.. 307 సెక్షన్ ఈ కేసులో వర్తించదని కోర్టు దృష్టికి తెచ్చారు. సతీష్‌కు సంబంధించి పోలీసులు తయారుచేసిన రికార్డులోని పుట్టిన తేదీ వివరాలు.. అతని ఆధార్‌లోని తేదీకి తేడా ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు.
ఆధార్ కార్డులో పుట్టినతేదీని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయవాది సలీం కోరారు. దీనికి పోలీస్ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ దురుద్దేశపూర్వకంగానే రాయితో సీఎంపై దాడి చేశారన్నారు. హత్యాయత్నం సెక్షన్ వర్తిస్తుందని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. పుట్టిన తేదీకి సంబంధించి మున్సిపల్ అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. నిందితుడికి మే 2వరకు 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సతీష్‌ను నెల్లూరుకు తరలించినట్టు సమాచారం. ఈ కేసులో దుర్గారావును ఏ2గా పోలీసులు చేర్చారు. అలాగే, సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే.
మా పిల్లల ఆచూకీ చెప్పండి
ఇదిలావుంటే, రాయి వ్యవహారంపై విజయవాడ కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం పిటిషన్ వేశారు. కేసులో నిజాల నిగ్గు తేల్చందుకు న్యాయవాది కమిషనరును నియమించాలని అభ్యర్థించారు. మరోపక్క ఇంకెవరిని ఇరికిస్తారో అనే భయంతో కాలనీ వాసులు కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని, రెండు, మూడు వీధులు జన సంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయాయని పిటీషన్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం సెర్చ్ వారెంట్ జారీ చేసింది. సెర్చ్ వారెంట్ మేరకు అడ్వొకేట్ కమిషనర్ నగరంలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. పోలీస్ స్టేషన్‌లో అనుమానితులు ఉన్నారో, లేదో పరిశీలించనున్నారు.
వైసీపీ స్క్రిప్ట్‌కు పోలీస్ ట్విస్ట్!
సీఎం జగన్‌పై రాయి ఉదంతానికి సంబంధించి పోలీస్ దర్యాప్తులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. సంచలమైన కేసులో దర్యాప్తు వివరాలు మీడియాకు ఇవ్వకుండా జాగ్రత్తపడుతున్న పోలీస్ బాస్‌లు, లీకుల సమాచారాన్నే బయటకు వదులుతున్నారు. నిజానికి `పాలకపక్ష ఇలాకా పత్రిక సాక్షిలో.. గురువారం సాయంత్రం పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి పూర్తి దర్యాప్తు వివరాలు వెల్లడిస్తారంటూ ఓ కథనాన్ని గురువారంనాటి సంచికలో ప్రచురించింది. అయితే సాక్షి ప్రచురించినట్టు పోలీసులు గురువారం మీడియా సమావేశం నిర్వహించకుండా మీడియాకు ముఖం చాటేశారు. అదుపులోవున్న అనుమానితుడిని నిందితుడిగా పేర్కొంటూ నేరుగా కోర్టుకు హాజరుపర్చారు. పోలీసుల ట్విస్ట్‌కు కారణం `విపక్షం సంధిస్తున్న ప్రశ్నలకు సరైన సమాధానం లేకపోవడమేనని తెలుస్తుంది. సాక్షి కథనాలు, పోలీసుల దర్యాప్తు తీరు చూస్తుంటే.. పాలకపక్షం స్క్రిప్ట్‌నే పోలీసులు అనుసరిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గురువారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు.
సాక్షి ప్రచురించిన కథనంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. కేసుపై పలు ప్రశ్నలు సంధించారు. జగన్‌ను గాయపర్చినట్టు పోలీసులు చెబుతున్న గులకరాయి లేదా సిమెంట్ పెంకు దొరికిందా? దొరికితే ఎక్కడుంది? ముఖ్యమంత్రిని గాయపర్చిన పనిముట్టు (ఆయుధం) ఆచూకీ లభించకుండానే అనుమానితులపై కేసులు ఎలా నిర్థారిస్తున్నారు? సంఘటన జరిగిన వెంటనే రాయిని పోలీసులు ఎందుకు వెతకలేకపోయారు? ఇదంతా పోలీస్ నిర్లక్ష్యం వల్ల తలెత్తిన భద్రతా వైఫల్యమా? అధికార పార్టీ సానుభూతి స్క్రిప్టా? అంటూ ప్రశ్నలు సంధించారు. ఇదికాకుండా దర్యాప్తునకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారికి నివేదిస్తున్నామని, ఎన్నికల అధికారి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్తోన్న పోలీసులు, అదే సమాచారాన్ని మీడియాకు ఎందుకు బహిర్గతం చేయడం లేదు? ఈ ప్రశ్నలకు పోలీస్ బాస్‌లు సమాధానం చెప్పాలంటూ మీడియా సమావేశంలో నిలదీశారు.
జగన్‌ను గాయపర్చిన రాయి దొరకలేదని చెప్పడానికి ఇబ్బంది పడుతున్న పోలీస్ బాస్‌లు.. అడ్డంగా దొరికిపోయే పరిస్థితి రావడంతో సాక్షి స్క్రిప్ట్‌ను స్కిప్ చేసి సొంత నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. పురోగతి లేని కేసు దర్యాప్తులో పోలీసులు రోజుకో ట్విస్ట్ తీసుకుంటుండటంతో `పాలకపక్షం డ్రామా, అందులో పోలీస్ పాత్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దీంతో, ముఖ్యమంత్రిపై రాయి కేసులో రాష్ట్ర ప్రజలు తమ ఆసక్తిమేరకు ఎవరికి తోచిన కథలు వాళ్లు అల్లుకుంటున్నారు.
రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు?
కేసును మరింత బలోపేతం చేసే సంచలన అంశాలనే పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారన్నది విశ్వసనీయ సమాచారం. జగన్‌ను హత్య చేయడానికే దాడి జరిగిందన్న అంశానికి బలం చేకూరే విధంగా రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారని తెలుస్తోంది. కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్‌లో నిందితుడి కదలికలు ఉన్నట్టు పోలీసులు నిర్థారించే పనిలో ఉన్నారని అంటున్నారు. కేసులో ఏ2గా చేర్చిన తెలుగుదేశం సానుభూతిపరుడు దుర్గారావునూ పక్కాగా ఇరికించేందుకు పోలీస్ స్క్రిప్ట్ సిద్ధమవుతోందన్న సమాచారమూ లేకపోలేదు.
పోలీస్ రిపోర్టును ఈసీకి నివేదిస్తున్నాం: మీనా
జగన్‌పై రాయి కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు పోలీస్ నుంచి దర్యాప్తు సమాచారం తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా వెల్లడిరచారు. ఎన్నికల నిర్వహణపై గురువారం మీడియాతో మాట్లాడిన మీనా.. జగన్‌పై రాయి అంశాన్ని ప్రస్తావిస్తూ.. పోలీసులు అందిస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈసీకి నివేదిస్తున్నామని, కేసు సమగ్ర పరిశీలనుకు 24న ‘పోలీస్ పరిశీలకురాలు’ వస్తున్నట్టు వెల్లడిరచారు. వాస్తవాలను ఆమె సమీక్షించి ఈసీకి రిపోర్టు చేస్తారన్నారు. ‘జగన్‌పై రాయి’ ఘటనలో పోలీస్ వైఫల్యం, లేక దేనిమీదైనా ఈసీ ఆదేశాల మేరకే చర్యలు ఉంటాయని మీనా స్పష్టం చేశారు.