సిలికా శాండ్ కోసం భూములొదిలి పొమ్మంటున్నారు!
వందేళ్లుగా భూములపై ఆధారపడే బతుకుతున్నాం
కాదంటే కేసులు పెట్టి కుటుంబసభ్యులను జైళ్లలో పెడుతున్నారు
యువనేత లోకేష్ ఎదుట ఎస్సీ, ఎస్టీ మహిళల
సిలికా శాండ్ తవ్వకాల కోసం వందేళ్లుగా వంశపారంపర్యంగా మేం సాగు చేసుకుంటున్న భూములను వదిలి వెళ్లాలని వైసీపీ నేత ప్రియాంకారెడ్డి తన అనుచరులతో బెదిరిస్తున్నారని చిల్లకూరు మండలం, బల్లవోలుకి చెందిన ఎస్సీ, ఎస్టీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. యువనేత పాదయాత్ర చేస్తున్న సమయంలో గురువారం బాధిత మహిళలు రమణమ్మ, ఆదిలక్ష్మమ్మ తమగోడు విన్పిస్తూ… పంచాయితీ లోని 40 కుటుంబాలకు చెందిన మేం వేరుశెనగ పంట సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాం.
30 ఎకరాల భూముల్లో సిలికా శాండ్ కోసం వైసిపి నేత ప్రియాంకరెడ్డి మమ్మల్ని భూములు వదిలి వెళ్లాలని బెదిరిస్తున్నారు. గ్రామ పెద్దలు అడిగితే మీకేం సంబంధం అంటున్నారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించినందుకు మా భర్తల్ని ఎత్తుకెళ్లి జైల్లో పెట్టారు. వర్షం సమయంలో వేల గొడ్లు వచ్చి ఇక్కడ మేత మేస్తాయి… ఇసుక కోసం గుంతలు తీస్తే పొలాలను మేము ఎలా సాగు చేసుకుని బతకాలి.? ప్రియాంక రెడ్డి పోలీసులతో వచ్చి వేధింపులకు దిగుతున్నారు. రాత్రిళ్ల సమయంలో వచ్చి తలుపులు కొడుతున్నారు. సిలికా శాండ్ కోసం గుంతలు తీయడంతో గతంలో వాటిలోపడి ముగ్గురు చనిపోయారు. ఈ ప్రభుత్వంలో రౌడీయిజం రాజ్యమేలుతోంది.
ప్రభుత్వానికి డబ్బులు కట్టామంటూ మా భూముల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. తవ్విన క్వారీలు పూడ్చడానికి రూ.3 లక్షలు ఇస్తామని చెప్పారు..కానీ ఇవ్వలేదు. ఈ సమీపంలో 5 సోన కాల్వలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. కాల్వల కింద వంద ఎకరాల వరి, శనగ, ముంత మామిడి పంటలు పండుతున్నాయి. తాటి చెట్ల లోతు గోతులు తవ్వుతున్నారు, మా బాధలు ఎవరితో చెప్పుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోయారు. ధైర్యంగా ఉండాలని, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీల భూములను వారికే అప్పగిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.