- యుద్ధప్రాతిపదికన కేంద్ర ప్రాయోజిత పథకాలు
- రాష్ట్రానికి మరిన్ని పథకాలు, నిధులు రాబట్టడమే లక్ష్యం
- సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్‌లను వేగవంతం చేయండి
- యూసీలు సమర్పిస్తేనే.. కేంద్రం నిధులిచ్చేది
- అడ్డంకులను తొలగించి త్వరగా పనుల పూర్తి
- జీడీపీకి కీలకమైన ఆక్వా పైనా ప్రత్యేక దృష్టి
- ఉన్నతస్థాయి సమీక్షలో సీఎస్ నీరబ్ దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో అమలవుతోన్న పలు కేంద్ర ప్రాయోజిత పథకాలను యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లడం ద్వారా కేంద్రం నుంచి మరిన్ని పధకాలు, నిధులు రాబట్టేందుకు అధికారులు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్‌పై వైద్య ఆరోగ్య, వ్యవసాయ, సహకార, ఉద్యానవన, మత్స్య, మున్సిపల్ పరిపాలన, గృహనిర్మాణ, ఆర్ధిక శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పలు సెంట్రల్ సెక్టార్ స్కీములను నిర్దేశిత గడువులో పూర్తిచేయడం ద్వారా రాష్ట్రానికి మరిన్ని కేంద్ర ప్రాయోజిత పధకాలు, నిధులు రాబట్టేందుకు కృషి చేయాలన్నారు. పధకాల అమలులో ఎదురవుతున్న చిన్నచిన్న ఇబ్బందులను అధిగమించాలన్నారు. పూర్తయిన పనులకు సకాలంలో యుటిలైజేషన్ సర్టిఫికెట్లను కేంద్రానికి సమర్పిస్తే తదుపరి వాయిదా నిధులు మంజూరయ్యే వీలుంటుందని, ఆ దిశగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టి రాష్ట్రంలో అమలుకాని ఇతర ప్రాయోజిత ప్రధకాలేమైనా ఉంటే వాటినీ రాష్ట్రంలో అమలుకు తగు పరిశీలన జరగాలని ఢల్లీి ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ లవ్ అగర్వాల్‌కు, మరియు సంబంధిత శాఖల కార్యదర్శులకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సూచించారు.
రాష్ట్ర జీడీపీలో మూడోవంతు ఆక్వారంగం నుండే వస్తోందని, ఆక్వా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చేపల, రొయ్యల చెరువుల వివరాలన్నిటినీ నూరుశాతం కంప్యూటరీకరించి.. ఆయా ఉత్పత్తులకు తగిన పరీక్షల కొరకు ల్యాబ్‌లను ఏర్పాటు చేసి రాష్ట్రం నుండి నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులు ఎగుమతయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేగాక నాబార్డు, ఎంపెడాల ద్వారా తగిన నిధులు మంజూరయ్యేలా కృషి చేయాలన్నారు. అదేవిధంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర తదితర వెనుకబడిన జిల్లాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుండి తగిన నిధులు మంజూరు చేయించుకునే అవకాశం ఉందని, ఆ దిశగా తగిన ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎస్ నీరబ్ సూచించారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్అగర్వాల్ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడుతూ.. సిఎస్ఎస్ పథకాలకు సంబంధించి నిర్వహించిన పనులకు సకాలంలో యూసీలు సమర్పించ గలిగితే కేంద్రం నుండి తదుపరి నిధులు మంజూరు చేయించుకునేందుకు తగు అవకాశం ఉంటుందన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్తు ఇన్ఫ్ర్రాస్ట్రక్చర్ మిషన్ కింద వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పడకల పెంపు, క్రిటికల్ కేర్ బ్లాకులువంటి వైద్య పరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ఐదేళ్ల కాలానికి రూ.367 కోట్ల మంజూరు చేస్తే.. వాటి కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద గర్బిణీ స్రీలకు రూ.5వేలను చెల్లించే మథకం అమలు జరుగుతోందని.. వాటికి సకాలంలో నిధులు విడుదలైతే ఎక్కుమందికి లబ్ది చేకూరుతుందని తెలిపారు. మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన టిడ్కో గృహాల ప్రాజెక్టును 21వేల 377 కోట్ల రూ.లతో చేపట్టగా దానిలో కేంద్రం వాటా రూ.3వేల 924 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.8595 కోట్లు, లబ్దిదారుల వాటాగా రూ.8856 కోట్లుగా ఉందని.. ఇప్పటి వరకూ రూ.16వేల 900 కోట్ల పనులను పూర్తి చేశామని, మిగతా పనులు పూర్తి చేసేందుకు మరో 7వేల రూ.కోట్ల అవసరమని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.. సీఎస్ దృష్టికి తెచ్చారు.
బలహీన వర్గాల గృహనిర్మాణానికి సంబంధించి పిఎంఎవై అర్బన్ కింద రూ.31వేల 146 కోట్లతో వివిధ గృహ నిర్మాణాలు చేపట్టగా ఇప్పటి వరకూ రూ.17వేల 359 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివాన్ మైదీన్ వివరించారు. వ్యవసాయ శాఖలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రూ.737 కోట్లతో 8 పధకాలు అమలవుతుండగా దానిలో రూ.442 కోట్లు కేంద్రం వాటా కాగా రూ.295 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా పనులు జరుగుతున్నట్టు ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ వివరించారు. అదే విధంగా కృషోతన్నతి యోజన కింద 7 ఉప పధకాలు అమలు జరుగుతున్నాయన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ మరియు సహకార శాఖలకు సంబంధించి వివిధ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కంప్యూటరీకరణ ప్రక్రియను కేంద్రం అత్యంత ప్రాధాన్యతాంశంగా చేపట్టిందని, రాష్ట్రంలో ఆ ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని శాఖ కమిషనర్ బాబు వర్చువల్‌గా వివరించారు. సమావేశంలో రాష్ట్ర ఆర్ధికశాఖ కార్యదర్శి జానకి, వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢల్లీి రావు, ఆరోగ్యశ్రీ సిఇఓ లక్ష్మీషా తదితరులు పాల్గొన్నారు.