అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర వ్యాప్తంగా సహకార బ్యాంకు సేవల్లో భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇటీవల సహకార బ్యాంకు సేవల్లో కొంత జాప్యం జరిగిన అంశంపై రాష్ట్ర ఉన్నతాధికారులతో మంత్రి శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఖాతాదారుల లావాదేవీల భద్రత, సమగ్రతను కాపాడేందుకు భద్రతా విభాగం, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సేవల్లో తాత్కాలిక జాప్యం తప్పలేదని పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపు చానల్స్, ఆర్‌టీజీ ఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ సేవల్లో తాత్కాలిక నిలిపివేత వల్ల ఎటువంటి నష్టం వాటిల్లలేదని వెల్లడిరచారు. సహకార బ్యాంకు ఖాతాదారుల ప్రయోజనాలు, ఐటీ మౌలిక సదుపాయా లను రక్షించడానికి ఇటువంటి చర్యలు తప్పలేదని, ఇప్పుడు డిజిటల్ చెల్లింపు చానల్స్ పూర్తిగా పనిచేస్తున్నాయని వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనల నుంచి ఎటు వంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.