మంగళగిరి(చైతన్యరథం): గతంలో పరదాల సీఎంను మనం చూశామని.. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం పింఛన్ల పంపిణీ అనంతరం మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్, చంద్రబాబు మధ్య సరదా సంభాషణ జరిగింది.
అధికారులు సెట్ అయ్యేందుకు ఇంకా టైమ్ పడుతుందనుకుంటా సర్.. ఇంకా పరదాలు కడుతున్నారు అని లోకేష్ అనగానే.. లేదు సెట్ అయ్యారని చంద్రబాబు బదులిచ్చారు. కొంతమంది ఇంకా పరదాలు కట్టడం మానుకోలేదని.. బతిమిలాడి తీయిస్తున్నామని లోకేష్ చెప్పారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ మళ్లీ అలాంటివి పునరావృతమైతే పరదాలు కట్టినవారిని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదన్నారు.
ఎవరైనా సరే పాత రోజులు మరిచిపోవాలి. ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తప్పవు. రివర్స్ పోయే బండిని పాజిటివ్ వైపు నడిపిస్తున్నాం. స్పీడ్ పెంచడం తప్ప వెనక్కి వెళ్లే పరిస్థితి ఎవరికీ ఉండకూడదు. ఆ ఆలోచనే రాకూడదు. అలా ఉండకపోతే ఒక్క షాక్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు. దానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రారంభం కాబట్టి స్లోగా వెళ్తున్నా.. ఇక స్పీడ్ పెంచాలి. ఈ ప్రభుత్వంలో 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు. చరిత్ర గుర్తు పెట్టుకోవాలి. నువ్వు కూడా అప్పట్లో కుర్రాడివి. నీకు కూడా ఐడియా లేదు. అప్పట్లో హైదరాబాద్ నుంచి బయల్దేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. ఇప్పుడు అంతలా ఉండదు కానీ.. తప్పు చేస్తే మాత్రం ఎవర్నీ వదిలిపెట్టను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలో సభలో నవ్వులు పూశాయి.