విజయవాడ: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చ కోసం సవాల్ చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు చివరికి తోక ముడిచారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. విజయవాడ ప్రెస్‌క్టబ్‌లో బుధవారం ఉదయం చర్చకు తాము సిద్ధమని మంత్రి అప్పలరాజుకు మంగళవారం కొల్లు రవీంద్ర బహిరంగ లేఖ రాశారు. చెప్పిన మేరకు కొల్లు రవీంద్ర ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు. అయతే మంత్రి అప్పలరాజు మాత్రం రాలేదు. దీనిపై కొల్లు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మంత్రి సీదిరి అప్పలరాజు సవాల్ కు స్పందించి తాము బహిరంగ చర్చకు వచ్చామన్నారు. అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు తాము సిద్దమన్నారు. చెప్పిన విధంగా రాలేక అప్పలరాజు తోక ముడిచారన్నారు. యువగళం పాదయాత్ర పై విమర్శలు చేస్తూ అప్పలరాజు బహిరంగ లేఖ రాశారు. ఆయన లేఖపై స్పందించి, బహిరంగ చర్చకు విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద కు బుధవారం ఉదయం 11 గంటలకు రావాలని చెప్పాం. చర్చకు రాకుండా తోక ముడిచిన అప్పలరాజుకు లోకేష్ గురించి మాట్లాడే అర్హత లేదు. గతంలో మీ నాయకుడు మార్నింగ్, ఈవ్ నింగ్ వాక్ చేశాడు. కోర్టు వాయిదాల పేరుతో ప్రతి వారంలో శుక్రవారం నుంచి మూడు రోజులు రెస్ట్ తీసుకున్నాడు. మా యువ నాయకుడు లోకేష్ ఎండ, వాన లెక్క చేయకుండా పాదయాత్ర పూర్తి చేశాడు. తండ్రిని అక్రమంగా అరెస్టు చేస్తే, పాదయాత్ర ను ఆపి లోకేష్ వెళ్లడం తప్పా. మీ నాయకుడి నాన్న చనిపోతే.. మృతదేహాన్ని పక్కనపెట్టుకుని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేయించిన చరిత్ర మీదని కొల్లు విమర్శించారు.
మీది బీసీ ద్రోహుల పార్టీ
బీసీలను అన్ని విధాలా అణగదొక్కిన చరిత్ర మీ జగన్ ది. వారికి అందాల్సిన పధకాలు, నిధులు నిలిపేశాడు. మీ సీట్లు కోసం లోకేష్ పై నోరు పారేసుకుంటారా. ఎవరి హయాంలో బీసీలకు ఎక్కువ అభివృద్ధి జరిగిందో చర్చకు రండి. పేపర్ పులుల్లా వాగడం కాదు… అంశాల వారీగా చర్చకు రండి. నీ సీటు కోసం బీసీ లను అడ్డు పెట్టుకుంటున్న నిన్ను చూస్తుంటే సిగ్గేస్తుంది. చేతి వృత్తుల వారికి జీవనోపాధి లేకుండా చేశారు. మీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రండి… లేదంటే నోరు మూసుకోవాలని కొల్లు స్పష్టం చేశారు.
దోపిడీకి మరో కొత్త డ్రామా
ఆడుదాం ఆంధ్ర వల్ల ప్రజలకు ప్రయోజనం ఏమిటి. జగన్ దోచుకోవడానికి ఇదొక కొత్త డ్రామా. స్టేడియం ల అభివృద్ధి లేదు.. క్రీడాకారులకు ప్రోత్సాహం లేదు. అప్పలరాజు నోరు అదుపులో పెట్టుకోవాలి. చర్చ కు రాకుండా పారిపోయిన నువ్వు ఇంకోసారి వాగితే రోడ్ల మీద తిరగనివ్వబోమని కొల్లు హెచ్చరించారు.