- సీమలో సిద్ధం సభ పెట్టి సాగునీటి ప్రాజెక్టుల ఊసెత్తని సీఎం
- సీమ రాత మార్చేది నీళ్లు, నిధులు, విద్య, ఉద్యోగాలేనని భావించి పనిచేశా
- అభివృద్ధికి, దోపిడీకి తేడా గుర్తించాలి
- లేపాక్షి నాలెడ్జ్‌హబ్‌లో రూ.10 వేల కోట్ల భూముల్ని రూ.500 కోట్లకే దోచేసే యత్నం
- వాలంటీర్లకు మంచి భవిష్యత్‌నిస్తా, వైసీపీ కోసం పనిచేయొద్దు
- వివేకా హత్యపై చర్చకు నేను సిద్ధం…జగన్ సిద్ధమా.?
- వివేకా హత్యపై గ్యాగ్ ఆర్డర్ తెచ్చింది ఎవరు
- సీబీఐపై కేసులు పెట్టిందెవరు?
- పెనుకొండ రా..కదలిరా సభలో చంద్రబాబు
- వివేకా హత్యపై సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని సభలో చూపించి మరీ చర్చకు సై అంటూ చంద్రబాబు సవాల్
పెనుకొండ: రాయలసీమలో సిద్ధం సభ పెట్టిన జగన్‌రెడ్డి సీమలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఎందుకు నోరెత్తలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులపై జగన్‌కు చిత్తశుద్ధి లేదనటానికి ఇదే నిదర్శనమన్నారు. సీమ రాతను మార్చేది నీళ్లు, పెట్టుబడులు, విద్య, ఉద్యోగాలే అని భావించి తాను ఆ దిశగా పని చేశానని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు మంచి భవిష్యత్ ఉంటుంది.. వాలంటీర్లు ఎవరూ వైసీపీ కోసం పనిచేయవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. స్కామ్‌లోనే మరో స్కామ్‌కు పక్కా ఉదాహరణ లేపాక్షి నాలెడ్జ్ హబ్ అన్నారు. రూ.10 వేల కోట్ల విలువ చేసే భూముల్ని రూ. 500 కోట్లకే దోచేసేందుకు ప్రయత్నించాడని ధ్వజమెత్తారు. శ్రీసత్యసాయిజిల్లా, పెనుగొండ నియోజకవర్గంలో కియా కార్ల పరిశ్రమ సమీపంలో సోమవారం ఏర్పాటు చేసిన రా…కదలిరా సభలో చంద్రబాబు ప్రసంగించారు.
ఓ వైపు ముండుటెండ…మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లా వాసుల్లో కసి.. రాబోయే ఎన్నికల్లో సైకో రెడ్డితో తాడో పేడో తేల్చుకుందామనే పౌరుషం మీలో కనపడుతోంది.. రాష్ట్రాన్ని కాపాడుకోడానికి ప్రతిఒక్కరూ జెండా పట్టుకోవాలి.. స్వార్థం కోసమో..అధికారం కోసమో కాదు…రాష్ట్రాన్ని కాపాడేందుకు మనం కొదమసింహాల్లా ముందుకు రావాలి.. 40 ఏళ్లుగా సభలు, సమావేశాలు ఎన్నో నిర్వహిస్తున్నాను.. కానీ ఇక్కడ మీ ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకోను ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని చంద్రబాబు ఉద్ఘాటించారు.
సీమకు నీళ్లిస్తే సిరులు పండుతాయి
బాదుడు లేని సంక్షేమం, కోతలు లేని సంక్షేమం కోసం, మహిళా రక్షణ కోసం రా కదిలిరా అని పిలుపునిచ్చాను. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిరచండి. నాకు ఉమ్మడి అనంతపురం అత్యంత ఇష్టమైన జిల్లా. భారతదేశంలోనే తక్కువ వర్షపాతం కురిసే జిల్లా ఇది. 47 లక్షల ఎకరాల భూమి ఈ జిల్లాలో ఉన్నా….సాగు అయ్యేది మాత్రం అతి తక్కువ. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని, సిరులు పండిరచే జిల్లాగా చేయాలని కంకణం కట్టుకున్నా. నేను రూ.64 వేల కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టులు పూర్తిచేశాను. నీరు ఇస్తేనే సీమ సిరులు కురుస్తుందని నేను ఎంతో తపించా. జీడిపల్లి, భైరవాని తిప్ప, వెల్లపల్లి, గుంతకల్ బ్రాంచ్ కెనాల్, మడకశిర బ్రాంచ్ కెనాల్ వంటి ప్రాజెక్టులు పూర్తిచేశాను. నీళ్లిస్లే రాయలసీమతో పోటీపడే ప్రాంతం దేశంలోనే ఎక్కడా లేదు. నీళ్లు తెస్తే పెట్టుబడులు వస్తాయి. 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తిచేసి కియా మోటార్స్ తెచ్చిన పార్టీ తెలుగుదేశం. కియా రాకముందు ఈ ప్రాంతంలో ఎకరా రూ.2 లక్షలు…ఇప్పుడు రూ.2 కోట్లు. మనం అధికారంలో కొనసాగి ఉంటే రూ.3 కోట్లయ్యేది. కియా తెచ్చి ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేలమందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇక్కడ తయారు చేసిన 12 లక్షల కార్లు దేశ, విదేశాల్లో తిరుగుతున్నాయంటే అదే టీడీపీ మార్క్. టీడీపీ మరో ఐదేళ్లు ఉండుంటే ఈ ప్రాంతమంతా పరిశ్రమలు వచ్చేవని చంద్రబాబు అన్నారు.
రూ. 10 వేల కోట్ల భూములు కొట్టేసే ప్లాన్
జిల్లాలో ఎవరిది అభివృద్ధో.. ఎవరిది దోపిడీనో ప్రజలు ఆలోచించాలి. వైఎస్సార్ సైన్స్ సిటీ, లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని రైతుల భూములు కొట్టేశారు. స్కాముల కోసమే స్కీములు రూపొందించారు. నాలెడ్జ్ హబ్‌లో భారీ భూ దోపిడీకి జగన్‌రెడ్డి కుట్రపన్నాడు. రూ.10 వేల కోట్లు విలువ చేసే 4,500 ఎకరాల భూమిని రూ.500 కోట్లకు కొట్టేసేందుకు జగన్ రెడ్డి టెండర్ పెట్టాడు. అది ప్రజల సొత్తనుకున్నావా…మీ అబ్బ సొత్తనుకున్నావా? మనకు ఏం తెలీదని జగన్ రెడ్డి అనుకుంటున్నాడు. అతడి ఆటలు కట్టిస్తాం. నేను పేదల ఇళ్లలో సంపద సృష్టిస్తే జగన్ రెడ్డి పేదలను దోచుకుని వారి పొట్ట కొట్టాడు. టీడీపీ హయాంలో జిల్లాకు ఎన్నో పరిశ్రమలు తెచ్చాం. సెంట్రల్ వర్సిటీ, ఏషియన్ పెయింట్స్ తెచ్చాం. ఇక్కడ అడుగడుగునా విండ్ మిల్ , సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్‌లు ఏర్పాటుచేస్తే దేశం మొత్తానికి కరెంటు ఉత్పత్తి చేసే సత్తా మన అనంతపురానికి ఉంది. అధికారంలోకి వచ్చాక రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు ఇచ్చి, గోదావరి నీళ్లు ఇక్కడకు తీసుకొచ్చి, సీమను రతనాల సీమగా చేస్తాం.
యువతను ఇంజనీర్లు, డాక్టర్లుగా తయారుచేస్తే ప్రపంచాన్ని జయించగలరు. అందుకే నేను చదువు, నీటికి ప్రాధాన్యమిచ్చా. భావితరాలు బాగుండాలనే నేను ఆలోచిస్తా. నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్ ఎలా ఉందో చూశారుగా. ఐటీతో యువతకు ఉపాధి కల్పించా. అదే మాదిరిగా ఏపీని బాగుచేయాలని తపించా. మనకున్న అన్ని వనరులు వినియోగించుకుని ఏపీని దేశంలోనే నెంబర్ వన్ చేయాలని భావించాను. దేశంలో ఎక్కడాలేని సముద్రతీరం మనకు ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రణాళికలు రూపొందించాం. రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ప్రపంచస్థాయి నగరంగా రాజధాని అమరావతి నిర్మాణం ప్రారంభించాం. కానీ జగన్ రెడ్డి మొత్తం నాశనం చేశాడని చంద్రబాబు దుయ్యబట్టారు.
వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి బాగోతం
పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఎంత అవినీతిపరుడో మీకు తెలుసుగా? ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పై వైసీపీ గూండాలు దాడి చేశారు. అన్నీ లెక్కపెట్టుకున్నా …ప్రతిదీ చెల్లిస్తా. రాప్తాడులో తోపుదుర్తి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. లేఅవుటు వేయాలన్నా కప్పం కట్టాల్సిందే. రైతు భూమి అమ్మలేదని మామిడి చెట్లు నరికించాడు. నీ అకౌంట్లన్నీ సెటిల్ చేస్తాను తోపూ …రెడీగా ఉండు. జాకీ పరిశ్రమను వెళ్లగొట్టి 6 వేల ఉద్యోగాలు రాకుండా చేశారు. ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు కేతిరెడ్డి గుడ్‌మార్నింగ్ అంటూ పబ్లిసిటీ చేస్తాడు. కదిరి సిద్దారెడ్డి …లక్ష్మీ నరసింహుని కూడా వదల్లేదు. ముడుపులు ఇస్తే కానీ వైసీపీ పాలనలో పనులు కావు. నేను అధికారంలోకి వచ్చాక కియా అనుబంధ సంస్థలు వచ్చేలా ప్రయత్నిస్తా. బెంగళూరు వరకూ ఇండస్ట్రియల్ కారిడార్‌కు కృషి చేస్తా. సత్యసాయి ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తాము. గోరంట్లకు కూడా నీరిచ్చే బాధ్యత తీసుకుంటాం. మడకశిరలో వక్క మార్కెట్ ఏర్పాటు చేస్తాం.
అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తయారుచేస్తాం. జిల్లాలో 14కి 14 సీట్లు గెలిపిస్తామని హామీ ఇవ్వండి. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం. పార్టీలో అందరికీ మంచి భవిష్యత్ ఉంటుంది. టీడీపీ, జనసేన పాలు నీళ్లులా కలసిపోవాలి. ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో చైతన్యం తేవాలి. రాష్ట్రం కోసం పనిచేయండి. మేము మీకు అండగా ఉంటాము. వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే అని చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు.
వివేకా హత్యపై చర్చకు జగన్ సిద్ధమా.?
బాబాయ్ హత్య, రక్త చరిత్ర జగన్‌రెడ్డి మార్కు. సొంత చెల్లి పుట్టుకపై నీచపు ప్రచారం చేయడం నీ మార్కు. అమ్మను గెంటేయడం నీ మార్కు. తల్లికి తిండి పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు కొంటాడా? హు కిల్డ్ బాబాయ్.. సమాధానం చెప్పాలి. వివేకాకు గుండెపోటు అని పనికిమాలిన సాక్షిలో రాశారు. గొడ్డలి ఎవరిచ్చారని నీ చెల్లెలు అడుగుతోంది. సమాధానం చెప్పు జగన్ రెడ్డీ? జగనాసుర రక్తచరిత్ర ఎవరిదో తేల్చుకుందాం. నీకు ధైర్యం ఉంటే రా పెనుకొండ…ఎవరు వివేకాను చంపారో చర్చకు రా. ప్రతిపక్ష నేతగా కోర్టుకు వెళ్లి వివేకా హత్యపై గ్యాగ్ ఆర్డర్ తెచ్చింది ఎవరు? కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై కేసులు పెట్టిందెవరు? హత్యలు చేసే వాళ్లు ముఖ్యమంత్రిగా అర్హులా? వైసీపీ పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ ఉందా? ఆడబిడ్డలకు రక్షణ ఉందా? మా కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్….దెబ్బకు దెబ్బ తీస్తాం. తమాషా అనుకోవద్దు. నేను అనంతపురం జిల్లాలో నీళ్లు పారిస్తే సైకో రెడ్డి రక్తం పారించాడు. ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా నేనూ, పవన్ కల్యాణ్ సిద్ధం. సంపద సృష్టించి, పేదరిక నిర్మూలన చేసే పార్టీ తెలుగుదేశం. ఎమ్మెల్యేలను ప్రాంతాలు మార్చినంత మాత్రాన ..అక్కడ చెత్త ఇక్కడ వేసినంత మాత్రాన గెలవలేరని చంద్రబాబు స్పష్టం చేశారు.
సీమ ద్రోహి జగన్ రెడ్డి
ఇటీవల జగన్ రెడ్డి ఇక్కడ సిద్ధం సభ పెట్టాడు. వేలాది ఆర్టీసీ బస్సులు వాడుకున్నాడు. కానీ మన సభకు మాత్రం బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. మన సభలకు ఆర్టీసీ బస్సులు ఇవ్వడంట. రాష్ట్రం వీళ్ల తాత జాగీరా. సైకో అడ్డుకున్నా మన తమ్ముళ్లు ఆగరు. సభకు రావాలంటే మన తమ్ముళ్లకు మోటర్ బైకులు ఉన్నాయి. వేల బైకులు…లక్షల జనం తరలివచ్చారు. ఎవరైనా అడ్డొస్తే తొక్కించుకుంటా రండి.. నేనున్నా… మీకు అండగా నేనున్నా. రాష్ట్రం కోసం అందరూ కదలి రావాలి. ఇక్కడ జరిపిన సిద్ధం సభలో జగన్ రెడ్డి ఇరిగేషన్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. రాయలసీమ ద్రోహి జగన్‌రెడ్డి. అతడు ఓడిపోవడడానికి సిద్ధం. తెలుగుదేశం-జనసేన గెలవడానికి సిద్ధం. గెలిచేది తెలుగుదేశం-జనసేన…ఓడిపోయేది వైసీపీ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి సిద్ధం పేరుతో ఊరూరా కటౌట్లు పెట్టాడు. పెన్షన్ ఇస్తున్నానని గొప్పలు చెబుతున్నాడు.
అసలు పెన్షన్ ప్రారంభించిందే ఎన్టీఆర్. రూ.200 పింఛను రూ. 2000 చేసింది నేను. నేను మళ్లీ వచ్చుంటే తొలి నెలలోనే రూ.3 వేలు చేసేవాడిని. మేము వచ్చాక ఇంటింటికీ వెళ్లి పింఛను ఇస్తాం. నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే….జగన్ రెడ్డి పాలనలో మటన్ కొట్టులో, ఫిష్ మార్కెట్ లో, మద్యం షాపులో ఉద్యోగాలు ఇచ్చాడు. నేను వచ్చాక నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తా. ఏడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. మీ ఇంటి దగ్గరే కూర్చుని వర్క్ చేసుకునేలా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాను. ఏపీ యువతను ప్రపంచంతో అనుసంధానం చేసి బంగారు భవిష్యత్ మీకిస్తా. మేం అధికారంలోకి వచ్చాక కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది.
కానీ వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయొద్దు. సైకో పోతే తప్పించి మనకు భవిష్యత్ లేదు. 40 రోజులు సైకిల్ ఎక్కండి. గ్లాసు పట్టుకోండి. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం, అన్న క్యాంటీన్లు మూసేయడం, ధరలు పెంచి పేదల నడ్డి విరచడం, సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ధ్వంసం చేయడం జగన్ రెడ్డి మార్కు. ఒక చేత్తో 10 రూపాయిలిచ్చి మరో చేత్తో రూ.100 దోచేసే దొంగ జగన్ రెడ్డి. 25 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం. 12 లక్షల ఇళ్ల నిర్మాణం, చంద్రన్న బీమా, విదేశీ విద్య, తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చింది తెలుగు దేశమే. టీడీపీకి-వైసీపీకి నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చంద్రబాబు అన్నారు